Elon Musk Twitter : ‘ట్విట్టర్​ సీఈఓగా ఉండాలా? వద్దా?’- ఎలాన్​ మస్క్​ పోల్​!-elon musk asks twitter to decide if he should step down ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Elon Musk Asks Twitter To Decide If He Should Step Down

Elon Musk Twitter : ‘ట్విట్టర్​ సీఈఓగా ఉండాలా? వద్దా?’- ఎలాన్​ మస్క్​ పోల్​!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 19, 2022 07:18 AM IST

Elon Musk Twitter CEO : ట్విట్టర్​ సీఈఓగా ఎలాన్​ మస్క్​ రాజీనామా చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.

ఎలాన్​ మస్క్​
ఎలాన్​ మస్క్​ (REUTERS)

Elon Musk Twitter poll : ట్విట్టర్​లో మరో సంచలన పోల్​ పెట్టారు ఆ సంస్థ సీఈఓ ఎలాన్​ మస్క్​. ట్విట్టర్​ సీఈఓ పదవి నుంచి తప్పుకోవాలా? వద్దా? అన్న విషయంపై పోల్​ను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఫలితం వచ్చినా, దానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

మరికొన్ని గంటల్లో రాజీనామా..?

భారత కాలమానం ప్రకారం.. సోమవారం సాయంత్రం 4:30 గంటల వరకు ఈ పోల్​ ఆన్​లైన్​లో ఉంటుంది. అంటే.. ట్విట్టర్​ సీఈఓగా మస్క్​ కొనసాగుతారా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. అయితే.. ఈ పోల్​కు ఇప్పటివరకు వచ్చిన స్పందన మాత్రం.. మస్క్​కు ప్రతికూలంగానే ఉంది. ట్విట్టర్​ హెడ్​ పదవి నుంచి తప్పుకోవాలా? అన్న పోల్​కు 57.6శాతం మంది 'యెస్​' అన్నారు. 42.4శాతం మంది 'నో' అన్నారు. ఇదే కొనసాగితే.. ట్విట్టర్​ సీఈఓగా ఎలాన్​ మస్క్​ తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది!

Elon Musk Twitter CEO : 'మీరు ఏం కోరుకుంటే, అదే జరుగుతుంది. అందుకే జాగ్రత్తగా కోరుకోండి,' అంటూ మరో ట్వీట్​ చేశారు ఎలాన్​ మస్క్​. సీఈఓ పదవికి రాజీనామా చేసినప్పటికీ.. భవిష్యత్తులో కీలక విధానాల మార్పులపై పోల్స్​ నిర్వహిస్తూ ఉంటానని స్పష్టం చేశారు.

ట్విట్టర్​ టేకోవర్​ తర్వాత సామాజిక మాధ్యమంలో అనేక మార్పులు తీసుకొచ్చారు ఎలాన్​ మస్క్​. వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అనేక విధానాలను మార్చేశారు. ఫలితంగా ఆయనపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. 'సీఈఓగా రాజీనామా చేసి, టెస్లాపై దృష్టి పెట్టాలి' అని మస్క్​కు చాలా మంది చెబుతున్నారు. ట్విట్టర్​ను కొన్నప్పటి నుంచి టెస్లాను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇది టెస్లా షేర్లపై ప్రతికూలంగా మారుతోందని అంటున్నారు.

Elon Musk Twitter CEO resignation : టెస్లాతో పాటు స్పేస్​ఎక్స్​, ది బోరింగ్​ కంపెనీ, న్యూరాలింక్​, మస్క్​ ఫౌండేషన్​కు ఆయన సీఈఓగా కొనసాగుతున్నారు. వాస్తవానికి.. ట్విట్టర్​ సీఈఓగా ఎక్కువ కాలం ఉండనని గతంలోనే మస్క్​ చెప్పారు.

Elon Musk latest news : మరోవైపు మస్క్​ పోల్​ కింద కామెంట్ల వర్షం కురుస్తోంది. "యెస్​ అని ఓటు వేసేవారందరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సీఈఓ పదవి నుంచి తప్పుకున్నా.. ట్విట్టర్​ యజమాని ఎలన్​ మస్కే. రోజూవారీ కార్యకలాపాల నుంచి ఆయన తప్పుకుంటారు అంతే. అన్నింటి మీద తుది నిర్ణయం మస్క్​దే ఉంటుంది. అలాంటిప్పుడు.. మీరు వేసే 'యెస్​' ఓటుకు అర్థం ఉండదు కదా!" అంటూ ఓ నెటిజన్​.. మస్క్​ పోల్​ కింద్​ కామెంట్​ చేశాడు.

WhatsApp channel