MP Sai reddy : ప్రభుత్వాలు మారినా హామీలు నెరవేర్చాల్సిందే…. ఎంపీ సాయిరెడ్డి-ysrcp mp vijayasai reddy demands special category status for andhra pradesh in rajya sabha ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ysrcp Mp Vijayasai Reddy Demands Special Category Status For Andhra Pradesh In Rajya Sabha

MP Sai reddy : ప్రభుత్వాలు మారినా హామీలు నెరవేర్చాల్సిందే…. ఎంపీ సాయిరెడ్డి

HT Telugu Desk HT Telugu
Feb 08, 2023 07:58 AM IST

MP Sai reddy ప్రభుత్వాలు మారినా చట్ట సభల్లో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో జరుగుతున్న అన్యాయంపై పార్లమెంటులో సాయిరెడ్డి ప్రశ‌్నించారు.

రాజ్యసభలో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి
రాజ్యసభలో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి

MP Sai reddy ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంటామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఉమ్మడిగా విఫలమయ్యాయని ఆరోపించారు. 2014లో లోక్‌సభలో తలుపులు మూసేసి విభజన బిల్లుకు ఆమోదముద్ర వేశారని ఆరోపించిన సాయిరెడ్డి, ఇదే బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినపుడు ఆంధ్రప్రదేశ్‌కు అయిదేళ్ళపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇస్తే ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్య నాయుడు హోదా అయిదేళ్ళు కాదు పదేళ్ళు ఇవ్వాలని పట్టుబట్టారని సాయిరెడ్డి గుర్తు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ స్వయంగా రాజ్య సభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని, అది ఈనాటికీ ఆచరణకు నోచుకోలేదన్నారు. పార్లమెంట్‌లో ప్రధాని అంతటి వ్యక్తి ఇచ్చిన హామీని సైతం అమలు చేయకుండా తుంగలో తొక్కడానికి బీజేపీ ప్రభుత్వం వెనకాడటం లేదని ఆయన విమర్శించారు. విభజన పేరిట ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేశారని, రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, సవాళ్ళకు మూల కారణం కాంగ్రెస్‌, బీజేపీలే అని ఆరోపించారు.

2014లో విభజన బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందే నాటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆ తర్వాత అధికారం కోల్పోయిందని, కొత్తగా అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా హామీని నెరవేర్చకుండా సాకులు చెబుతూ తప్పించుకుంటోందని ఆరోపించారు. “పార్టీలు, ప్రభుత్వాలు మారినా ఇచ్చిన హామీ నేరవేర్చే బాధ్యత కేంద్రంపై ఉందని” ఆయన అన్నారు. హామీ అమలు అయ్యేలా చూడాల్సిన అస్యూరెన్స్‌ కమిటీ సైతం చేతులు ముడుచుకుని చోద్యం చూస్తోందని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు.

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేసినందుకే కాంగ్రెస్‌, బీజేపీలు ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ముఖం కూడా చూపించలేనంత దుస్థితిలో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను చట్టబద్దం చేస్తూ అవి అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌కు సాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కాసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని హోదా ఇచ్చే వరకు విశ్రమించేది , విస్మరించేది లేదన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ హక్కు అన్నారు.

మూడు రాజధానుల ప్రణాళిక...

వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి కావాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వినూత్నంగా తీసుకువచ్చిందని చెప్పారు. మూడు రాజధానుల ప్రణాళికకు అన్ని వర్గాల ప్రజల ఆమోదం పొందిందని విజయసాయి రెడ్డి అన్నారు. న్యాయ వ్యవస్థ తీసుకున్న నిర్ణయం కారణంగా వికేంద్రీకరణ ఫలాలు రాష్ట్ర ప్రజలకు అందడం లేదన్నారు.

మూడు రాజధానుల ప్రణాళికకు చట్టబద్ధత ఏ విధంగా ఉందో ఆయన వివరించారు. మొదటగా పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని రాజ్యంగంలోని ఆర్టికల్‌ 154 (రెడ్‌ విత్‌ ఆర్టికల్‌ 163) స్పష్టం చేస్తోంది. రాజధాని ఏ నగరంలో ఉండాలన్నది నిర్ణయించేంది పాలనాధికారం మాత్రమే అన్నారు. రాజ్యాంగం ఆదేశిక సూత్రాలను అనుసరించి ఆర్టికల్‌ 38 ప్రకారం ప్రాంతీయ అసమానతలను తొలగించాలని, మూడు రాజధానుల ద్వారా పాలనను వికేంద్రీకరించే చర్య ఆ దిశగా తీసుకున్న నిర్ణయమే అన్నారు. లోక్‌ సభలో 2020 ఫిబ్రవరి 4న హోం శాఖ మంత్రి ఒక ప్రశ్నకు ఇచ్చిన జవాబు ప్రకారం ఒక రాష్ట్ర పరిధిలో రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసిందని, అంటే మూడు రాజధానుల ప్రణాళికకు కేంద్రం కూడా ఆమోదం తెలిపిందని విజయసాయి రెడ్డి చెప్పారు.

IPL_Entry_Point

టాపిక్