Macharla Issue : మాచర్ల ఎమ్మెల్యేను హతమార్చడమే లక్ష్యంగా ఘర్షణలు…అంబటి-ysrcp mlas says tdp targets to eliminate macharla sitting mla with political clashes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ysrcp Mlas Says Tdp Targets To Eliminate Macharla Sitting Mla With Political Clashes

Macharla Issue : మాచర్ల ఎమ్మెల్యేను హతమార్చడమే లక్ష్యంగా ఘర్షణలు…అంబటి

HT Telugu Desk HT Telugu
Dec 18, 2022 06:36 AM IST

Macharla Issue మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిని హతమాార్చడం కోసమే టీడీపీ ఘర్షణలు లేవనెత్తిందని వైసీపీ ఆరోపించింది. ఇదేం ఖర్మ పేరుతో మాచర్లలో బీసీలపై దాడులకు పాల్పడ్డారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డు తొలగించుకోడానికే ఘర్షణలు జరిగాయని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో రాళ్లు, కర్రలు ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు.

మాచర్ల ఘర్షణల్లో గాయపడిన వారిని పరామర్శిస్తున్న అంబటి రాంబాబు
మాచర్ల ఘర్షణల్లో గాయపడిన వారిని పరామర్శిస్తున్న అంబటి రాంబాబు

Macharla Issue పల్నాడులో ఫ్యాక్షన్ నేర చరిత్ర ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల టీడీపీ ఇన్ చార్జిగా పెట్టి, చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, పార్టీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ హత్యా రాజకీయాలకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిల ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మాచర్లలో ఘర్షణల్లో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నరసరావుపేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైసీపీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఇద్దరు తీవ్రగాయాల పాలైనట్లు వైద్యులు వివరించారు.

పిన్నెల్లిని ఓడించే శక్తిసామర్థ్యాలు చంద్రబాబుకుగానీ, ఇన్ చార్జీగా బ్రహ్మారెడ్డికి కానీ లేకపోవడంతో ఎమ్మెల్యే పిన్నెల్లినే అంతమొందించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని అంబటి విరుచుకుపడ్డారు. చంద్రబాబు హత్యా రాజకీయాలు, కుట్ర రాజకీయాలను చూస్తూ ఊరుకోమని అంబటి హెచ్చరించారు. బ్రహ్మారెడ్డి నేర చరిత్ర ఏమిటో, అతను ఎన్ని హత్యలు చేశాడో మాచర్ల ప్రజలకు తెలుసునన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, హత్యా రాజకీయాలు చేసినా, మాచర్ల ఎమ్మెల్యేను ఏమి చేయలేరన్నారు.

ఇదేం ఖర్మ అంటూ.. పల్నాడు ప్రాంతానికి ఇటీవల వచ్చిన చంద్రబాబు స్థానికుల్ని రెచ్చగొట్టారని ఆరోపించారు. "నేను కన్నెర్ర చేస్తే పల్నాడులో ఒక్కడు ఉంటాడా..?" అంటూ పల్నాడును తిరిగి రావణకాష్టం చేసేలా, ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడింది నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు రెచ్చగొట్టిన ఆ వీడియోలు యూ ట్యూబులో ఇప్పటికీ ఉన్నాయన్నారు. చంద్రబాబు కూడా ఒక రౌడీలా మాట్లాడుతూ, ఆ పార్టీ నాయకులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

టీడీపీ హత్యా రాజకీయాలను చూస్తూ ఊరుకోబోమని, ఉక్కుపాదంతో ప్రభుత్వం అణచివేస్తుందని హెచ్చరించారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోవడానికి సీఎం కుర్చీలో ఉంది చంద్రబాబు కాదని.. ఆ కుర్చీలో ఉన్నది జగన్ మోహన్ రెడ్డి అన్నది తెలుసుకోవాలన్నారు. జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వంలో తప్పు చేసిన వారు ఎవరైనా తప్పించుకోలేరని చెప్పారు.

బీసీలపై టీడీపీ దాడులు….

ఇదేం ఖర్మ కార్యక్రమం ముసుగులో తెలుగుదేశం పార్టీ నేతలు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఇదేం ఖర్మ అంటూ టీడీపీ నేతలు ప్రజల వద్దకు వెళుతుంటే.. ప్రజలు వారిని ఛీ కొడుతున్నారని, దాంతో ప్రజలపైనే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 7 హత్య కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్న బ్రహ్మారెడ్డి టీడీపీ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మాచర్లలో విద్వంసకాండలు ప్రారంభమయ్యాయన్నారు.

పల్నాడు లో ఫ్యాకన్ రాజకీయాలను మళ్లీ ప్రారంభించి, ప్రోత్సహిస్తున్న వ్యక్తి బ్రహ్మారెడ్డి అన్నారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇలాంటి దాడులకు, దుర్మార్గాలకు టీడీపీ పాల్పడుతుందని అన్నారు. టీడీపీ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బీసీలు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడవటం చూసి, ఓర్వలేక బీసీలపైనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.

ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిచ్చుపెట్టేందుకు నిరంతరం టీడీపీ ప్రయత్నిస్తుందన్నారు. ఇదేం ఖర్మ కార్యక్రమం చేపట్టి ఇంటింటికి వెళ్లే టీడీపీ నేతలకు రాళ్లు, కర్రలు ఎందుకు తీసుకువచ్చారో కాసు మహేష్‌ రెడ్డి ప్రశ్నించారు. ఇదేం ఖర్మ కార్యక్రమం పేరిట దాడులకు పాల్పడటమే లక్యం గా టీడీపీ ప్రణాళికలు తయారు చేశారని అన్నారు. కనీసంగా 20 కేసులు అయినా లేకపోతే వారు టీడీపీ నాయకులు కాలేరు.. అంటూ చంద్రబాబు సర్టిఫికెట్ ఇవ్వడం దేనికి సంకేతం అన్నారు.

IPL_Entry_Point

టాపిక్