Whatsapp Worm : అది వాట్సాప్‌ పురుగే…. … రెక్కలొచ్చి ఎగిరిపోయే రకమే అట….-whatsapp worm creating terror among rural public ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Whatsapp Worm Creating Terror Among Rural Public

Whatsapp Worm : అది వాట్సాప్‌ పురుగే…. … రెక్కలొచ్చి ఎగిరిపోయే రకమే అట….

B.S.Chandra HT Telugu
Sep 17, 2022 10:31 AM IST

పురుగు కుట్టినా, తాకినా క్షణాల్లో ప్రాణాలు పోతున్నాయంటూ రెండు మూడ్రోజులుగా వాట్సాప్‌లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. పసుపు రంగుల్లో చూడ్డానికి గొంగళి పురుగులా కనిపిస్తున్న పురుగు ఫోటో వాట్సాప్‌లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. దానికి అనుబంధంగా చిలవలు పలవలుగా టెక్స్ట్‌ కూడా పుట్టుకొచ్చింది. చివరకు అది వాట్సాప్‌ కీటకంగా తేల్చేశారు వ్యవసాయ నిపుణులు. ఆ ఫార్వార్డ్‌ మెసేజ్‌ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న పురుగు ఫోటో
వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న పురుగు ఫోటో

Whatsapp Worm గత 2 - 3 రోజుల నుండి వాట్సప్ గ్రూపులో ప్రత్తి పంటలో ఒక పురుగు ఉంటోంది. ఆ పురుగు మనిషిని తాకిన వెంటనే 5 నిముషాలలో చనిపోతున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని అందర్నీ భయపెడుతూ పురుగు ఫోటోలు, చనిపోయినట్టు ఉన్న మనుషుల ఫోటోలను, ఆడియో సందేశాలను తెగ పంపిస్తున్నారు. పసుపు రంగులో ఉన్న ఈ పురుగు సాధారణ గొంగళి పురుగు వంటిదేనని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Whatsapp Worm వాట్సాప్ గ్రూపుల్లో జనం ముందు వెనుక ఆలోచించకుండా పంపుతున్న పురుగు ఎక్కువగా చెరకు మరియు పండ్ల తోటల్లో కనిపిస్తుంది. ఈ పురుగు లద్దె పురుగు ఆకారంలో ఉండి, శరీరంపై వెంట్రుకలతో ఉంటుంది. వెంట్రుకల చివరిభాగం లో స్వల్ప విషపూరిత పదార్థం ఉంటుంది. ఇతర జాతుల పురుగులు, పక్షుల నుంచి ఆ పురుగుకు ఆత్మరక్షణ కోసం ప్రకృతి సిద్ధంగా ఉన్న ఏర్పాటు అది. చెరకు ఆకుల క్రింది వైపు ఉంటూ, దాని ఆకులను తింటూ ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే ఈ పురుగు ప్రత్తి పంటలో అసలు కనపడదట.

ఒకవేళ ఈ Whatsapp Worm పురుగు మన శరీరంలో ఎక్కడైనా తగిలితే, పురుగు వెంట్రుకలలో ఉండే స్వల్ప విష పదార్థం మన శరీరానికి తగలడం వల్ల, తగిలిన చోట దురద, మంట పుడతాయి. గొంగళి పురుగులు పాకినా సెన్సిటివ్‌ స్కిన్‌ ఉన్న వారికి దద్దుర్లు వచ్చేస్తాయి. ఇది కూడా అలాంటిదే. మరీ ఎక్కువగా తగిలిన చోట వాపు రావచ్చు. ఇది కూడా ఎక్కువ మందికి గంటల వ్యవధిలో, కొద్ది మందికి ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుందట. మనిషి చనిపోయేటంత ప్రమాదం ఉండదనే ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రైతులకు వీటి గురించి బాగానే తెలిసినా పట్టణ ప్రాంతాలు, అమాయక ప్రజానీకం మాత్రం కొత్త కీటకంWhatsapp Worm వచ్చేసిందని ఎడాపెడా వాట్సప్‌లోనే షేర్‌ చేసేస్తున్నారు. ఆ పురుగుల గురించి పెద్దగా పట్టించుకోవద్దని చెబుతున్నారు. సాధారణ గొంగళి పురుగు జాతుల్లో అదొకటని కాస్త దూరంగా ఉంటే అవే సీతాకొక చిలుకలుగా మారిపోతాయని చెబుతున్నారు. వాట్సాప్ మసాలా వార్తలకు Parasa lepida జాతికి చెందిన కీటకం కాస్త విషకీటకంగా మారిపోయి జనాల్ని బెదరగొట్టే స్థాయికి వెళ్లిపోయింది.

IPL_Entry_Point

టాపిక్