Telugu News  /  Andhra Pradesh  /  Vote Bank Strategies For Selecting Rajyasabha Candidates For Ysrcp
ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్మోహన్ రెడ్డి

ఓటు బ్యాంకు చిక్కుల్లో తెలుగుదేశం పార్టీ

17 May 2022, 12:16 ISTHT Telugu Desk
17 May 2022, 12:16 IST

వైసీపీని గద్దె దించడానికి ఏ త్యాగాలకైనా సిద్ధమని చంద్రబాబు ప్రకటన, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుని చీలనివ్వమంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రకటనలతో ఏపీ ఎన్నికల పొత్తులపై చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. అదే సమయంలో ఇరు పక్షాలు బోలెడు సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది ఏపీలో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి. వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభకు బీసీ సంఘాల నాయకుడు ఆర్‌.కృష్ణయ్యను ఎంపిక చేయడం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు కులం చుట్టూ తిరుగుతాయనే సంగతి అందరికి తెలిసిందే అయినా, ఓటు బ్యాంకు సమీకరణలే ఇప్పుడు కీలకంగా మారాయి. ఎన్నికల పొత్తుల విషయంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల ప్రకటనల నేపథ్యంలో వైసీపీ అధినేత వారికి చెక్‌ పెట్టేలా బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మొన్నటి మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలో సైతం బీసీలకు ఎక్కువ పదవులు దక్కేలా జాగ్రత్త పడ్డారు. తాజాగా రాజ్యసభ స్థానాల భర్తీ కూడా కులం కోణంలోనే జాగ్రత్త పడుతుండటం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న బీసీ సామాజిక వర్గాలు 2019 ఎన్నికల్లో వైసీపీకి దగ్గరయ్యాయి. రికార్డు స్థాయిలో 151 అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీకి దక్కడం వెనుక బీసీ ఓటు బ్యాంకు కూడా ఓ కారణం. చంద్రబాబు కాపులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే భావంతో ఉన్న బీసీలు ప్రత్యామ్నయ రాజకీయ అస్తిత్వాన్ని వెదుక్కోవడం టీడీపీకి ప్రతికూల ఫలితాన్నిచ్చింది. తమది బీసీల పార్టీ అని తెలుగుదేశం పార్టీ చెప్పుకున్నా ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. 2014-19 మధ్య కాలంలో కాపు రిజర్వేషన్ల వ్యవహారంతో పాటు మంత్రి పదవులు, కార్పొరేషన్ల ఏర్పాటు, మిగిలిన బీసీ కులాలకంటే కాపులకు ఆర్ధికంగా ఎక్కువ లబ్ది చేకూర్చేలా చంద్రబాబు వ్యవహరించడాన్ని వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుంది. తెలుగుదేశం పార్టీకంటే ఎక్కువగా తాము బీసీలకు ప్రయోజనాలు కల్పిస్తామనేలా వ్యవహరించింది.

చంద్రబాబు నిర్ణయాలు, వైసీపికి ప్రయోజనాలు....

2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని అధికారం నుంచి దించాలనే లక్ష్యంతో ఎన్నికల పొత్తులపై చంద్రబాబు ముందే ప్రకటన చేశారు. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేనతో రాజకీయ అవగాహన కుదుర్చుకునేందుకు సిద్ధమనేలా మాట్లాడారు. అటు పవన్‌ కళ్యాణ్‌ కూడా అందుకు తగ్గట్లుగానే స్పందించారు. పనిలో పనిగా అవసరమైతే బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడతానంటూ రాయబారం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 23 స్థానాల్లో గెలిచింది. ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 39.17శాతం ఓట్లు దక్కాయి. అదే సమయంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ 49.95శాతం ఓట్లు వచ్చాయి. 151 స్థానాల్లో గెలిచింది. జనసేన 137 స్థానాల్లో పోటీ చేసి 7.04శాతం ఓట్లను దక్కించుకుంది. ఒక స్థానమే గెలిచినా మొత్తంగా చూస్తే టీడీపీ, జనసేనలు కలిస్తే ఆ రెండింటి ఓటు బ్యాంకు సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముంది. బీజేపీకి గత ఎన్నికల్లో 0.85శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ వైఖరి ఎలా ఉన్నా టీడీపీ, జనసేనలు కలిస్తే ఆ రెండు పార్టీల బలాలు పెరుగుతాయి.

ఎన్నికల పొత్తులతో పార్టీల బలం పెరిగిన బీసీ ఓటు బ్యాంకు ప్రభావం కూడా గణనీయంగానే ఉంటుందని అధికార పక్షం అంచనా వేస్తోంది. తెలుగుదేశం, జనసేన పార్టీలను అయా సామాజిక వర్గ పార్టీలుగా పరిమితం చేయాలనే ఆలోచనతో బీసీ సంఘాల నాయకుడిని ఏపీ నుంచి రాజ్యసభకు పంపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఆర్‌.కృష్ణయ్యకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బలమైన నేపథ్యం ఉంది. ఉద్యమకారుడిగా దశాబ్దాల అనుభవం ఉంది. రాజకీయ పార్టీలుగా టీడీపీ, జనసేనలను ఎదుర్కోడానికి, బీసీల తరపున పార్టీ పనిచేస్తోందని నిరూపించుకోడానికి కృష్ణయ్య ఇమేజ్‌ పనికొస్తుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు, పవన్‌కళ్యాణ్‌తో కలిసి ముందుకు సాగితే బీసీ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది కూడా ఇప్పుడు చర్చగా మారింది. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికలో ఎవరి లెక్కలు ఫలిస్తాయో తెలియాలంటే మాత్రం 2024వరకు ఆగాల్సిందే...

టాపిక్