TTD Special Darshan : ఆన్‌లైన్‌లో టీటీడీ ఆర్జిత సేవలు….-ttd special darshan online quota will release on 21st september 2022 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd Special Darshan Online Quota Will Release On 21st September 2022

TTD Special Darshan : ఆన్‌లైన్‌లో టీటీడీ ఆర్జిత సేవలు….

B.S.Chandra HT Telugu
Sep 20, 2022 08:11 AM IST

TTD Special Darshan తిరుమలలో ప్రత్యేేక దర్శన సేవలు, ఆర్జిత సేవలు, అంగ ప్రదక్షణ సేవలకు సంబంధించిన టిక్కెట్లను టీటీడీ బుధవారం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మరోవైపు నేడు తిరుమలలో కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో భక్తులను శ్రీవారి దర్శనానికి ఉదయం 11 తర్వాత అనుమతిస్తారు.

ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టిక్కెట్లు
ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టిక్కెట్లు

TTD Special Darshan తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, అర్జితసేవ, అంగప్రదక్షిణం టికెట్లను బుధవారం ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను కూడా సెప్టెంబరు 21 న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు

TTD Special Darshan నవంబర్ నెలలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ల లభ్యతను బట్టి ఈ టిక్కెట్లు మొద‌ట వ‌చ్చిన వారికి మొద‌ట కేటాయింపు ప్రాతిపదికన జారీ చేస్తారని టీటీడీ ప్రకటించింది.

నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. తిరుమలలో బ్రహ్మోత్సవం జరిగే తేదీలు అంటే అక్టోబర్ 1 నుండి 5వ తేదీ వ‌ర‌కు అంగప్రదక్షిణం టోకెన్లు కేటాయించ‌రు.భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని సెప్టెంబ‌రు 20వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

సెప్టెంబ‌రు 20న‌ ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంత‌రం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

భక్తుల రద్దీ సాధారణం….

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం రద్దీ కొనసాగుతోంది. ఉదయం 6 గంటల సమయానికి 24 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనం భక్తులకు సుమారు 12 గంటలకు పైగా సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 నుండి 4 గంటల సమయం పడుతోంది. సోమవారం స్వామివారిని 67,276 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,140మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమ్పరించారు. స్వామివారికి హుండీ ద్వారా 5.71 కోట్లు కానుకలు సమర్పించారు.

IPL_Entry_Point

టాపిక్