Tirumala Drone visuals : తిరుమల డ్రోన్ దృశ్యాల కలకలం.. బాధ్యులపై క్రిమినల్ కేసు.. ?-tirumala temple drone visuals case investigation in under process says ttd chairman yv subbareddy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Drone Visuals : తిరుమల డ్రోన్ దృశ్యాల కలకలం.. బాధ్యులపై క్రిమినల్ కేసు.. ?

Tirumala Drone visuals : తిరుమల డ్రోన్ దృశ్యాల కలకలం.. బాధ్యులపై క్రిమినల్ కేసు.. ?

HT Telugu Desk HT Telugu
Jan 21, 2023 04:53 PM IST

Tirumala Drone visuals : తిరుమల ఆలయ డ్రోన్ దృశ్యాలుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ అంశంలో సమగ్ర విచారణ చేస్తున్నామని... హైదరాబాద్ కు ఓ చెందిన సంస్థ ఆ వీడియో అప్ లోడ్ చేసినట్లు గుర్తించామని... పూర్తి వివరాలు రెండు, మూడు రోజుల్లో వెల్లడిస్తామని చెప్పారు.

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (facebook)

Tirumala Drone visuals: తిరుమల ఆలయ డ్రోన్ వీడియో వ్యవహారంపై టీటీడీ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోంది. డ్రోన్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అప్రమత్తమైన టీటీడీ నిఘా విభాగం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతోంది. ఈ అంశంలో సమగ్ర విచారణ చేస్తున్నామని... హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లుగా గుర్తించామని.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పారు. అవి ఒరిజినల్ డ్రోన్ చిత్రాలు లేక ఫోటోలను యానిమేట్ చేసి వీడియోగా రూపొందించారనే విషయాన్ని తేల్చేందుకు చిత్రాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించామని తెలిపారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.... ఈ వ్యవహారంలో రెండు, మూడు రోజుల్లో పూర్తి వివరాలను భక్తులకి తెలియజేస్తామని వివరించారు.

"స్వామి వారి ఆలయాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరించినట్లుగా ఉండే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. శుక్రవారం ఈ విషయం మా దృష్టికి వచ్చింది. ఈ చిత్రాలను వైరల్ చేసిన వారిని విజిలెన్స్ బృందం గుర్తించింది. హైదరాబాద్ కు చెందిన ఒక సంస్థ ఈ చర్యలకు పాల్పడింది. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం. అవి నిజంగా డ్రోన్ ద్వారా చిత్రీకరించిన చిత్రాలా ? లేక స్టిల్ ఫోటోలని యానిమేట్ చేశారా ? భక్తులని తప్పుదోవ పట్టించే విధంగా... దుష్ప్రచారం చేసే పనిలో భాగంలో చేశారా ? అన్నది తేలాల్సి ఉంది. ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపి విచారణ జరిపిస్తున్నాం. స్టిల్ ఫోటో గ్రాఫ్స్ ని యానిమేట్ చేసి డ్రోన్ వీడియోలుగా ప్రచారం చేస్తున్నారనేది ప్రాథమికంగా తేలింది. రెండు మూడు రోజుల్లోనే పూర్తి వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతాం" అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

తిరుమల... ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన హిందూ దేవాలయాల్లో ఒకటి. అధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అలాంటి తిరుగిరుల్లో భారీ భద్రత ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుంది. తిరుమల కొండపై ఆంక్షలు కూడా అమల్లో ఉంటాయి. ముఖ్యంగా వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండను ‘నో ఫ్లై జోన్’ గా ప్రకటించారు. విమానాలు, హెలికాప్టర్లకు ఆ కొండ పైనుంచి ఎగిరేందుకు అనుమతి లేదు. ఆగమశాస్త్రం ప్రకారం కూడా శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి అనుమతిలేదు. అలాంటి తిరుమల దేవాలయానికి సంబంధించిన ఓ డ్రోన్ వీడియో ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ గా పేర్కొంటున్న చిత్రాలు.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వైరల్ అవుతున్నాయి. ఐకాన్ అనే అకౌంట్ నుంచి ఈ వీడియో అప్‌లోడ్ అయినట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది నవంబర్‌లో ఈ వీడియోను అప్‌లోడ్ చేసినట్లు ప్రాథమికంగా తేల్చారు. సంబంధిత సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.

IPL_Entry_Point

టాపిక్