అక్రమ మైనింగ్‌పై వస్తున్న ఆరోపణలు అవాస్తవం: ఏపి గనుల శాఖ డైరెక్టర్ క్లారిటీ-there is no illegal mining in chittoor ap dmg clarifies ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  There Is No Illegal Mining In Chittoor, Ap Dmg Clarifies

అక్రమ మైనింగ్‌పై వస్తున్న ఆరోపణలు అవాస్తవం: ఏపి గనుల శాఖ డైరెక్టర్ క్లారిటీ

Chittoor- forest area
Chittoor- forest area (twitter)

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలో అటవీప్రాంతంలో ప్రస్తుతం ఎటువంటి అక్రమ మైనింగ్ జరగడం లేదని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ డైరెక్టర్ (DMG) వి.జి.వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ కొనసాగుతున్నట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆయన ఖండించారు.

Chittoor | చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలో అటవీప్రాంతంలో ప్రస్తుతం ఎటువంటి అక్రమ మైనింగ్ జరగడం లేదని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ డైరెక్టర్ (DMG) వి.జి.వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ముద్దనాపల్లె గ్రామ పరిధిలోని 104, 213 సర్వే నెంబర్లలో అక్రమ మైనింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆయన ఖండించారు.

ట్రెండింగ్ వార్తలు

గతంలో ఈ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో 15 సార్లు గనులశాఖ తనిఖీలు నిర్వహించిందని, అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వారికి రిమాండ్ నోటీసులు జారీ చేయడంతో పాటు భారీ యంత్రాలు, వాహనాలను సీజ్ చేసిందని తెలిపారు. ఈ దాడుల్లో రూ.5 కోట్ల విలువైన 555 గ్రానైట్ బ్లాక్స్ తో పాటు 6 కంప్రెషర్లు, 2 హిటాచీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కుప్పం సమీపంలోని అటవీప్రాంతంలో అనధికారికంగా గ్రానైట్ తవ్వకాలు జరుపుతున్నారనే సమాచారం రాగానే గనులశాఖ అధికారులు తక్షణం స్పందించి ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నారని, ఫలితంగా ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎటువంటి అక్రమ మైనింగ్ జరగడం లేదని గనుల శాఖ డైరెక్టర్ వివరించారు.

గత నెలలో కూడా నాలుగు బృందాలతో కుప్పం అటవీప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు వి.జి.వెంకట్ రెడ్డి తెలిపారు.

ద్రావిడ విశ్వ విద్యాలయం పరిధిలోని భూముల్లో అక్రమ మైనింగ్ పై గతంలో దాడులు చేశామని అన్నారు. అలాగే శాంతిపురం, ముద్దనపల్లె ప్రాంతంలో గత ఏడాది అక్టోబర్ 25, 28, డిసెంబర్ 23వ తేదీల్లో అక్రమ మైనింగ్ పై దాడులు జరిపి, సర్వే నంబరు 104, 213 పరిధిలో అక్రమ మైనింగ్ చేసిన గ్రానైట్ బ్లాక్ లను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

అక్రమ మైనింగ్‌కు పాల్పడితే ఫారెస్ట్ యాక్టు కింద కేసులు

కుప్పం సమీపంలో అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతం పూర్తిగా అటవీప్రాంతంగా ఉండటం వల్ల ఇక్కడ నిఘాను పెంచాలని, మైనింగ్ కు పాల్పడే వారిపై ఫారెస్ట్ యాక్ట్ 1980 ప్రకారం కేసులు నమోదు చేయాలని కోరుతూ చిత్తూరు డిఎఫ్ఓకు లేఖ కూడా రాసినట్లు తెలిపారు. ద్రవిడ యూనివర్సిటీ పరిధిలోని అటవీభూముల్లోకి ఎవరూ ప్రవేశించకుండా ట్రెంచ్ ల ఏర్పాటు, సెక్యూరిటీ గార్డ్ లతో పర్యవేక్షణ చేయిస్తున్నామని అన్నారు. అంతే కాకుండా రెవెన్యూ, మైనింగ్, గనులశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో తనిఖీలు చేపడుతున్నామని, దాని ఫలితంగా ప్రస్తుతం ఇక్కడ అక్రమ మైనింగ్ కు పూర్తిస్థాయిలో నియంత్రణలోకి వచ్చిందని అన్నారు.

గనులశాఖ దాడుల్లో సీజ్ చేసిన ఖనిజాలను A.P e-procurement ద్వారా వేలంలో డిస్పోజ్ చేస్తామని వి.జి.వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆక్షన్ కు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అక్రమ మైనింగ్ పై ప్రభుత్వం సీరియస్ ఉందని, మూడంచెల వ్యవస్థ ద్వారా పూర్తిస్థాయిలో అక్రమ మైనింగ్, రవాణాలకు అడ్డుకట్ట వేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చెక్ పోస్ట్ వ్యవస్థ ను పటిష్టం చేశామని అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఇతర రాష్ట్రాలకు మినరల్స్ తరలించకుండా కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని అన్నారు. అక్రమ మైనింగ్ కు బాధ్యులైన వారిని వదిలిపెట్టేది ప్రసక్తే స్పష్టం చేశారు. మైనింగ్ అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

WhatsApp channel