Avinash Petition: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువడనుంది. వివేకా హత్య కేసులో విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని, తనపై కఠిన చర్యలు తీసుకోకుండా, ఇకపై విచారణకు పిలవకుండా ఆదేశాలివ్వాలంటూ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ,గత సోమవారం ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులపై తీర్పును వాయిదా వేశారు. తుది ఉత్తర్వులు వెలువరించేదాకా అవినాష్‌రెడ్డిపై అరెస్టు సహా కఠిన చర్యలు తీసుకోరాదంటూ సీబీఐని హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈనేపథ్యంలో హైకోర్టు తీర్పుపై రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ,మరోవైపు మాజీ మంత్రి వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలను తెలంగాణ హైకోర్టుకు సీబీఐ అందించింది. హత్యకేసుకు సంబంధించిన దర్యాప్తు స్థాయీ నివేదికను, హార్డ్ డిస్క్‌ను, 10 కీలక డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలను, హత్య జరిగిన సమయంలో వివేకా రాసిన లేఖ, ఫోరెన్సిక్ పరీక్షల నివేదికలు, ఘటనా స్థలంలో ఆధారాలు చెరపక ముందు తీసిన ఫొటోలు, ఆధారాలు మాయం చేసిన తర్వాతి ఫోటోలు కేసు డైరీ తదితర వివరాలను సీల్డ్ కవర్‌లో సీబీఐ అందజేసింది.,వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని సిబిఐ అనుమానిస్తోంది. ఈ కేసులో అప్రూవర్లుగా మారిన నుంచి సేకరించిన సమాచారంతో పాటు సాంకేతిక ఆధారాలతో అవినాష్ రెడ్డి ప్రమేయంపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. వాటి ఆధారంగానే కేసు దర్యాప్తులో ముందుకు వెళ్తోంది. మరోవైపు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ అవినాష్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ఎలా స్పందిస్తుందోనని ఆసక్తికరంగా మారింది. ,వివేకా పిఏ మరో పిటిషన్వివేకా హత్య కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరిని అప్రూవర్‌గా మారేందుకు అనుమతివ్వడంపై వ్యాజ్యం దాఖలైంది. హత్య కేసులో నిందితుడు షేక్ దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ కడప చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ వివేకానందరెడ్డి పిఏ ఎంవీ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ,సీబీఐతో పాటు, ఏ4గా ఉన్న షేక్ దస్తగిరిని ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేందర్ గురువారం దీనిపై విచారణ జరిపారు. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 'దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు కడప కోర్టు అనుమతి ఇవ్వడంపై ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఏ1, ఏ3 ఎర్ర గంగిరెడ్డి, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలను ఏపీ హైకోర్టు కొట్టేసిందని వివరించారు. ఇదే వ్యవహారంపై మరొకరు వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఇదే కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడానికి తమకు అనుమతి ఇవ్వాలని వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది స్వేచ్ఛ అభ్యర్థించారు. పూర్తి స్థాయి విచారణ కోసం వ్యాజ్యాన్ని సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.