రుషికొండలో అక్కడ నిర్మాణాలు చేపట్టవద్దు - సుప్రీంకోర్టు-supreme court key orders on construction work at rushikonda hills in visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Supreme Court Key Orders On Construction Work At Rushikonda Hills In Visakhapatnam

రుషికొండలో అక్కడ నిర్మాణాలు చేపట్టవద్దు - సుప్రీంకోర్టు

HT Telugu Desk HT Telugu
Jun 01, 2022 07:00 PM IST

విశాఖలోని రుషికొండ తవ్వకాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. గతంలో రిసార్ట్‌ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టాలని.. కొత్తగా తవ్విన ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలకు చేపట్టకూడదని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రుషికొండలో నిర్మాణాలపై సుప్రీం విచారణ(ఫైల్ ఫొటో)
రుషికొండలో నిర్మాణాలపై సుప్రీం విచారణ(ఫైల్ ఫొటో)

రుషికొండలో కొత్తగా ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాత రిసార్టు ఉన్న ప్రదేశంలో మాత్రం కొత్త నిర్మాణాలు చేపట్టవచ్చని తెలిపింది. హైకోర్టులో తేలేంతవరకు ఇకపై కొత్త తవ్వకాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీలో తొలుత ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ.. తవ్వకాలను నిలిపివేస్తూ మే 6న ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్ గవాయ్‌ ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు.

హైకోర్టులో తేలే వరకూ ఎన్జీటీలో విచారణ జరపరాదని సుప్రీం ఆదేశించింది. ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి తదుపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని, పిటిషనర్ల అభ్యంతరాలు అక్కడ చెప్పుకోవాలని తెలిపింది. హైకోర్టులో కేసు విచారణ పూర్తయ్యేవరకు తవ్వకాలు జరిపిన ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశిస్తూ గతంలో రిసార్టు ఉన్న ప్రాంతంలో పాత భవనాలు తొలగించిన చోట మాత్రం నిర్మాణాలు జరపడానికి అవకాశం ఇచ్చింది.

రుషికొండ వద్ద ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రాజెక్టు పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్ గతేడాదే స్పందించింది. అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటుకూ ఆదేశించింది. ఈ క్రమంలో రుషికొండను పూర్తిగా తొలచి వేస్తున్న దృశ్యాలు ఇటీవలి కాలంలో విసృత్తంగా ప్రచారం అయ్యాయి. వీటి ఆధారంగా రుషికొండ ప్రాంతంలో ప‌ర్యావ‌ర‌ణ ఉల్లంఘన జ‌రుగుతోంద‌ని నర్సాపురం ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. తవ్వకాల్లో ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు, నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్నార‌ని పేర్కొన్నారు. వీటిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన ఎన్జీటీ..స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ తవ్వకాల అంశంపై హైకోర్టులోనూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా విచారణ జరుగుతోంది.

IPL_Entry_Point

టాపిక్