BJP ChargeSheet : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని ప్రధాని పిలుపు….-pm modi suggests ap bjp leaders to fight against ysrcp in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Pm Modi Suggests Ap Bjp Leaders To Fight Against Ysrcp In Ap

BJP ChargeSheet : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని ప్రధాని పిలుపు….

HT Telugu Desk HT Telugu
Nov 12, 2022 06:20 AM IST

BJP ChargeSheet ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి వ్యవహారాలపై మండల స్థాయి నుంచి పోరాటాలు ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నేతలకు సూచించారు. రెండు రోజుల పర్యటనకు విశాఖ వచ్చిన ప్రధాని శుక్రవారం రాత్రి పార్టీ కోర్ నేతలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సంతకాల సేకరణ చేయడంతో పాటు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆదేశించారు.

విశాఖ పర్యటనలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ
విశాఖ పర్యటనలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ

BJP ChargeSheet ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాల జాబితాలను సిద్ధం చేయాలని బీజేపీ రాష్ట్ర పార్టీ బాధ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ప్రభుత్వ అవినీతి వ్యవహారాలపై మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఛార్జిషీట్లు తయారు చేసి వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలన్నారు. ఐఎన్‌ఎస్ చోళాలో పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రభుత్వ విధానాలపై సంతకాల సేకరణ చేయాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న ప్రయోజనాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ నాయకులదేనని ప్రధాని స్పష్టం చేశారు.

గతంలో గుజరాత్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి ఓకేలా ఉంటే, కర్ణాటక, గుజరాత్‌లలో బీజేపీ అధికారంలోకి రాగలిగిందని, ఏపీలో మాత్రం పార్టీ పరిస్థితి బాగోలేదని ప్రధాని నాయకులతో ప్రస్తావించారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టానికి అందరూ కృషి చేయాలని సేచించారు. పార్టీ ముఖ్యమని, మిగిలిన అంశాలన్ని తర్వాతేనని నాయకులకు తేల్చి చెప్పారు. దాదాపు గంటన్నరకు పైగా రాష్ట్ర పార్టీ నాయకులతో ప్రధాని సమావేశమయ్యాచరు. నాయకులు తమను తాము పరిచయం చేసుకుని మాట్లాడుతున్న క్రమంలో ప్రధాని పలు కీలక సూచనలు చేశారు.

ప్రజాక్షేత్రంలోనే ఉండాలని సూచన….

రాష్ట్ర ప్రభుత్వానికి ఇతోదికంగా కేంద్రం నుంచి సహకారం అందుతోందని ప్రధాని నేతలకు వివరించారు. ఎలాంటి వివక్ష లేకుండా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందుతున్నాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మోదీ సూచించారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ అవినీతి, వ్యవస్థీకృత లోపాలపై పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై పోరాడే విషయంలో ఏ మాత్రం వెనుకాడొద్దని సూచించారు. ప్రభుత్వంపై పోరాడుతూనే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి జరుగుతున్న మేలును ప్రజలకు వివరించాలని సేచించారు. రాజకీయాల్లో నిదానంగా ఉంటే కుదరదని, నిత్యం చైతన్య వంతంగా ఉండకపోతే మన స్థానాన్ని ఎవరొకరు ఆక్రమించేస్తారని హెచ్చచరించారు. ప్రతిపక్షంలో సమర్థవంతంగా పనిచేయకపోతే ప్రభుత్వంలోకి రాలేమని సూచించారు.

ప్రజలకు వివరించడానికే……

ఉపప్రధానిగా అడ్వాణీ ఉన్న సమయంలో 500మీటర్ల రోడ్డును ప్రారంభించడానికి వెళ్లడానికి సంకోచించిన ఆ‍యన ఆ కార్యక్రమానికి వెళ్లొచ్చాక సంతోషం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. వందేభారత్ రైళ్లను స్వయంగా జెండా ఊపి ప్రారంభించడానికి కారణం అదేనని ప్రధాని నేతలకు చెప్పారు. తాను వెళ్లాల్సిన అవసరం లేకున్నా, చేసే అభివృద్దిని ప్రజలకు వివరించడానికి ఆ కార్యక్రమానికి వెళుతున్నట్లు చెప్పారు. అభివృద్ధిని ప్రచారం చేయడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విషయంలో ఎలాంటి మీమాంస అవసరం లేదని మోదీ స్పష్టం చేశారు.

పార్టీయే అందరికి ముఖ్యం….

బీజేపీలో పార్టీ ప్రయోజనాలే ఎవరికైనా ముఖ్యమని, ఇందులో వ్యక్తిగత ఆసక్తులకు తావుండదని ప్రధాని స్పష్టం చేశారు. గుజరాత్‌లో పార్టీ ఎలా ఎదిగిందో నాయకులకు వివరించారు. జాతీయ స్థాయి నిర్ణయాలు తాము తీసుకుంటామని, రాష్ట్రంలో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు పార్టీని చేరువ చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. పార్టీని బలోపేత చేయడం కోసం ఏం చేస్తున్నారని ప్రధాని నేతల్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ… వైఎస్సార్సీపీతో సన్నిహితంగా ఉంటుందనే ప్రచారాన్ని ఎమ్మెల్సీ ఒకరు ప్రధానితో ప్రస్తావించారు. రాష్ట్రంలో భూకుంభకోణాలపై పోరాడుతున్నట్లు సీనియర్ నాయకుడొకరు ప్రధానికి వివరించారు. పార్టీని అభివృద్ధి చేయడానికి కార్యాచరణ రూపొందించాలని ప్రధాని మోదీ సూచించారు.

IPL_Entry_Point

టాపిక్