Accidents in AP : రోడ్డు ప్రమాదంలో వైద్యుడి మృతి…-palasa government hospital doctor killed in road accident ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Palasa Government Hospital Doctor Killed In Road Accident

Accidents in AP : రోడ్డు ప్రమాదంలో వైద్యుడి మృతి…

HT Telugu Desk HT Telugu
Nov 14, 2022 09:41 AM IST

Accidents In AP : ఏపీలో సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ మృతి చెందారు. జిల్లాలోని నందిగాం మండలం పెద్ద నాయుడుపేట వద్ద సోమవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి పలాసకు వస్తున్న వైద్యడి కారు ప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లా మేదరమెట్లలో జరిగిన ప్రమాదంలో ఓవర్‌టేక్‌ చేసే ప్రమాదంలో డివైడర్‌ను ఢీ కొట్టడంతో కారు దగ్ధమైంది.

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు

Accidents In AP శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో పలాస ప్రభుత్వాస్పత్రి సూపరింటెండ్‌ చనిపోయారు. జాతీయ రహదారిపై ఉన్న రిటైనింగ్‌ వాల్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న పలాస ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మడే రమేష్‌తో పాటు అతడి కుమారుడు సంకల్ప్ స్పాట్‌లో చనిపోయారు. వైద్యుడి భార్య, గైనకాలజిస్ట్‌ ప్రసన్న లక్ష్మితో పాటు వారి కుమార్తె సైర్యకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. నిద్రమత్తులో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. విశాఖపట్నంలో ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లిన డాక్టర్ రమేష్ కుటుంబం, అర్థరాత్రి పలాస బయలుదేరగా వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. గాయాల పాలైన వారిని రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రకాశంలో కారు దగ్ధం...

ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు దగ్ధమైంది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అయ్యప్పరాజుపాలెం గ్రామానికి చెందిన చింతంరెడ్డి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో కలిసి అన్నవరం వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే పి.గుడిపాడు సమీపంలో ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో ఇంజిన్‌లో మంటలు మొదలై కారు అంతా వ్యాపించాయి. కారులోఉన్నవారు వెంటనే కిందకు దిగిపోయారు. మంటలు వేగంగా వ్యాపించడంతో కారు రోడ్డుపైనే పూర్తిగా కాలిపోయింది. ఈ సమయంలో మొత్తం చిన్న పిల్లాడితో కలిపి కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

మరో ఘటనలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఢీకొన్న సంఘటన కొరిశపాడు మండలం పి.గుడిపాడు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. నెల్లూరు డిపోకు చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు విజయవాడ నుంచి నెల్లూరు వెళుతూ పి.గుడిపాడు సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలోబస్సు ముందుభాగం దెబ్బతింది. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. బస్సులో 27 మంది ప్రయాణికులు ఉండగా వారిని వేరే బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు.

IPL_Entry_Point