Telugu News  /  Andhra Pradesh  /  Ntr District Mylavaram Mla Vasantha Krishna Prasad Sensational Comments On Politics
మాజీ హోమంత్రి వసంత నాగేశ్వరరావు (ఫైల్)
మాజీ హోమంత్రి వసంత నాగేశ్వరరావు (ఫైల్)

Mylavaram MLA : పోరంబోకు రాజకీయాలు చేయలేనన్న వసంత కృష్ణ ప్రసాద్….

10 January 2023, 9:43 ISTB.S.Chandra
10 January 2023, 9:43 IST

Mylavaram MLA వైసీపీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తోన్న ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పోరంబోకు రాజకీయాలు చేయలేనని, ప్రతిపక్షాలపై అనవసరంగా తప్పుడు కేసులు బనాయించడం తన వల్ల కాదని ప్రకటించారు. గత కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానంపై బహిరంగంగా అసంతృప్తిని ప్రదర్శిస్తున్న వసంత కృష్ణప్రసాద్ తాజాగా పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు.

Mylavaram MLA ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పది మంది పోరంబోకులను వెంటేసుకుని తిరిగే రాజకీయాలు చేయలేకపోతున్నానన్నారు. పోరంబోకుల్లా మనం ప్రవర్తిస్తేనే ఇప్పటి రాజకీయాల్లో నిలబడగలమని, ఇప్పుడు రాజకీయాల్లో పెద్దరికం పనికిరాదని, అందుకే తాను పాత తరం నాయకుడిగా మిగిలిపోయానన్నారు. తన తండ్రి వసంత నాగేశ్వరరావు కాలం నాటి రాజకీయాలు ఇప్పుడు లేవని, ప్రతి పక్షాలపై నేను తప్పుడు కేసులు బనాయించనని, అందుకే పార్టీలో కొందరికి నాపై అసంతృప్తిగా ఉందని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు

వసంత కృష్ణ ప్రసాద్ కొద్ది రోజులుగా పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. వైసీపీ అధిష్టానం తీరుపై ఆయన అసంతృప్తిగా ఉంటున్నారు. గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమంలో తొక్కిసలాట జరగడం, ఆ తర్వాత ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు. శ్రీనివాస్ తన స్నేహితుడని, కష్టపడి జీవితంలో పైకి వచ్చాడని, సేవా కార్యక్రమాలు చేసే వారిని వేధిస్తే భవిష్యత్తులో ఎవరు సేవ చేయడానికి ముందుకు రారన్నారు. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనపై రాజకీయ కక్ష సాధింపులు పాల్పడటం తగదని విమర్శించారు. ఇది వైసీపీలో కలకలం రేపింది.

తాాజాగా తాను పుట్టే నాటికి తండ్రి సర్పంచిగా ఉన్నాడని, పుట్టిన 2ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారని, అప్పటికి, ఇప్పటికీ రాజకీయాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని. పిన్నమనేని వెంకటేశ్వరరావు, చనుమోలు వెంకట్రావు, వసంత నాగేశ్వరరావు కాలంలోనే తాను ఉండిపోయానని, నేటి రాజకీయాలు చేయలేకపోతున్నానని కార్యకర్తల భేటీలో చెప్పారు. వసంత కృష‌్ణప్రసాదం అంతరంగం ఏమిటో తెలీక వైసీపీ నాయకులు అయోమయానికి గురవుతున్నారు.

మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమాను మట్టికరిపించి గెలుపొందిన వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీకి దగ్గరవుతున్నారని ఎన్టీఆర్‌ జిల్లాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. మైలవరం అసెంబ్లీ నియోజక వర్గంపై కన్నేసిన మంత్రి జోగి రమేష్ వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో పట్టు కోసం వసంత, జోగి వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతుండటంతోనే వసంత కృష్ణ ప్రసాద్ కలత చెందారని చెబుతున్నారు.

వైసీపీ అధిష్టానం కూడా వసంత కృష్ణ ప్రసాద్‌ కంటే జోగి రమేష్‌కు ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రచారాలను మైలవరం ఎమ్మెల్యే ఖండిస్తున్నా, టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలను కొట్టి పారేయలేని పరిస్థితి ఉంది.

మరోవైపు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు టీడీపీ ఎంపీ కేశినేని నానితో భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేసిన వసంత నాగేశ్వర్ రావు కేశినేని నానితో సామాజిక, రాజకీయ అంశాలపై చర్చలు జరిపినట్లు చెప్పారు. పార్లమెంట్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపైనా చర్చించారు. కేశినేని మంచి నాయకుడని వసంత నాగేశ్వర్ రావు ప్రశంసలు కురిపంచారు. నాని తాత వెంకయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో వసంత కుటుంబం వైసీపీకి గుడ్‌బై చెప్పినా ఆశ్చర్య పోనక్కర్లేదని జిల్లా వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకులను టీడీపీకి చేరువ చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి.

టాపిక్