Trains to Polavaram Villages :పోలవరం విలీన మండలాలకు రైలు సౌకర్యం..-news railway line will built between odishas malkangiri and panduragapuram near bhadrachalam
Telugu News  /  Andhra Pradesh  /  News Railway Line Will Built Between Odishas Malkangiri And Panduragapuram Near Bhadrachalam
పోలవరం ముంపు మండలాలకు రైలు  కూత
పోలవరం ముంపు మండలాలకు రైలు కూత

Trains to Polavaram Villages :పోలవరం విలీన మండలాలకు రైలు సౌకర్యం..

13 March 2023, 6:02 ISTHT Telugu Desk
13 March 2023, 6:02 IST

Trains to Polavaram Villages పోలవరం ముంపు మండలాల్లో త్వరలో రైలు కూత వినిపించనుంది.ఏజెన్సీ ప్రాంతాల్లో రైలు కనెక్టివిటీ పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.సరకు రవాణాతో పాటు,గిరిజన గ్రామాలకు రైలు మార్గాన్ని విస్తరించేందుకు ఒడిశాలోని మల్కాన్‌ గిరి నుంచి భద్రాచలం వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కానుంది.

Trains to Polavaram Villages ఏజెన్సీ ప్రాంతాల్లో త్వరలో రైలు కూత వినిపించనుంది. మల్కన్‌గిరి నుంచి భద్రాచలం వరకు 173 కి.మీ. కొత్త రైల్వేలైను ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో పోలవరం ముంపు మండలాల్లోని చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల్లో నాలుగు రైల్వే స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు ఇప్పటికే సర్వే పూర్తి అయినట్లు రైల్వే వర్గాలు ప్రకటించాయి.

ఏజెన్సీ ప్రాంతంలో త్వరలో రైలు కూతలు వినిపించబోతున్నాయి. ఇప్పటివరకు రోడ్డు మార్గంలో బస్సులు, ఇతర వాహనాలు, గోదావరిలో లాంచీలలో మాత్రమే తిరిగిన ఏజెన్సీలో ఇకపై రైళ్లు కూడా రాకపోకలు సాగించనున్నాయి. ప్రస్తుతం గిరిజన ఆవాస ప్రాంతాల ప్రజలు రైలులో ప్రయాణించాలంటే రాజమహేంద్రవరం, ఖమ్మం, కొత్తగూడెం వెళ్లాల్సి ఉంది. నూతన లైను ఏర్పాటులో భాగంగా మన్యం ఏరియాలో నాలుగు రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు.

మారుమూల గిరిజన ప్రాంతాలకు రైలు మార్గాన్ని అనుసంధానం చేస్తూ రవాణాను సులభతరం చేసేందుకు ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం వరకు సుమారు 173 కిలో మీటర్ల మేర రైల్వేలైను మంజూరైంది. కొత్త రైలు మార్గం నిర్మాణానికి రూ 2,800 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఈ లైన్‌ను మల్కన్‌గిరి నుంచి భద్రాచలం సమీపంలోని పాండురంగాపురం రైల్వేస్టేషన్‌ వరకు నిర్మిస్తారు. కొత్త రైల్వే లైను ఏర్పాటులో భాగంగా పలుచోట్ల 213 వంతెనలు నిర్మించనున్నారు. వీటిలో 48 పెద్ద వంతెనలు, 165 చిన్న వంతెనలు ఉన్నాయి. వాగులు, వంకలు, గోదావరి ఉపనదులు, పంట కాల్వల మీదుగా రైల్వే లైను నిర్మాణం జరుగనుంది.

మల్కన్‌గిరి నుంచి భద్రాచలం వరకు నిర్మించనున్న కొత్త రైల్వేలైను విలీన మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల మీదుగా సాగనుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోవాసిగూడ, బదలి, రాజన్‌గూడ, మహరాజ్‌పల్లి, లూనిమన్‌గూడ, ఆంధ్రా ప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కన్నాపురం, కూనవరం మండలం కూటూరు గట్టు, పల్లూరు, ఎటపాక మండలం నందిగామలో రైల్వే స్టేషన్లు ఏర్పాటుచేస్తారు.

నందిగామ నుంచి తెలంగాణలోని గోదావరి మీదుగా భద్రాచలం, అక్కడి నుంచి పాండురంగాపురం వరకు ఈ రైల్వేలైను నిర్మించనున్నారు. రైల్వే లైన్ సర్వే పూర్తి కావడంతో వీలైనంత త్వరగా కొత్త రైలు మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. బొగ్గుతో పాటు, ఖనిజ పదార్ధాల రవాణాకు కొత్త రైలు మార్గం అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ రైలు మార్గం నిర్మాణానికి ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.