Polavaram Project : ముంపు సంగతి తేల్చాల్సిందే…. రీ సర్వేకు ఏపీ సమ్మతి-neighboring states of ap demands for re survey on polavaram project impact ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Polavaram Project : ముంపు సంగతి తేల్చాల్సిందే…. రీ సర్వేకు ఏపీ సమ్మతి

Polavaram Project : ముంపు సంగతి తేల్చాల్సిందే…. రీ సర్వేకు ఏపీ సమ్మతి

HT Telugu Desk HT Telugu
Oct 08, 2022 07:50 AM IST

Polavaram Project పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపు సంగతి తేల్చాల్సిందేనని ఎగువ రాష్ట్రాలు తేల్చి చెప్పాయి. స్పిల్ వే డిజైన్‌లో లోపాలున్నాయని, భూసేకరణ, పునరావాసం పూర్తి చేశాకే ప్రాజెక్టు నిర్మాణంపై ముందుకు వెళ్లాలని పొరుగు రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. పోలవరం సాంకేతిక కమిటీ సమావేశం వాడీవేడిగా సాగింది. రీ సర్వే చేసే వరకు ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయాలని పొరుగు రాష్ట్రాలు వాదిస్తున్నాయి.

పోలవరం ప్రాజెక్టు వద్ద కిందికి వెళుతున్న వరద ప్రవాహం
పోలవరం ప్రాజెక్టు వద్ద కిందికి వెళుతున్న వరద ప్రవాహం (HT_PRINT)

Polavaram Project పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే డిజైన్‌లో లోపాలున్నాయని ప్రాజెక్టు నిర్మాణంతో ప్రభావానికి గురవుతున్న పొరుగు రాష్ట్రాలు వాదించాయి. పోలవరం ప్రాజెక్టులోకి ఒక్కసారి 58 లక్షల క్యూసెక్కుల వరద వస్తే సముద్రంలోకి వెళ్లకుండా, ఆ ప్రవాహమంతా వెనక్కి తన్నితే తమ భూభాగాలు మునిగిపోతాయని తెలంగాణ, ఒడిసా, ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రాలు సాంకేతిక కమిటీ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశాయి.

పోలవరం బ్యాక్‌వాటర్‌కు సంబంధించి 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వరకే అధ్యయనం చేశారని, స్పిల్‌వే సామర్థ్యాన్ని బట్టి 50 లక్షల క్యూసెక్కుల మేరకు బ్యాక్‌వాటర్‌ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని ముంపుపై అధ్యయనం చేయాలని ఎగువ రాష్ట్రాలు పట్టుబట్టాయి. ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తున్నందున అధ్యయనం పూర్తై, భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టాకే ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టంచేశాయి.

మరోవైపు పోలవరం నిర్మాణాన్ని ప్రత్యేకంగా చూడకుండా ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే బ్యాక్‌వాటర్‌పై అధ్యయనం చేయాలని ఏపీ డిమాండ్ చేసింది. 36 లక్షల క్యూసెక్కుల వరదపై అంచనావేసి అధ్యయనం చేశామని జలశక్తి శాఖ గుర్తు చేసింది. ప్రాజెక్టు నిర్మాణంతో తలెత్తే పర్యావరణ, ముంపు సమస్యలపై పొరుగు రాష్ట్రాల అభిప్రాయాలు తెలసు కోడానికి వాటితో సంప్రదింపులు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ నాలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ భేటీకి ఆయా రాష్ట్రాల ఈఎన్‌సీలు హాజరయ్యారు.

గతనెల 29న సీఎస్‌లతో జరిగిన భేటీలో ఆయా రాష్ట్రాల నుంచి సాంకేతిక అభ్యంతరాలు వ్యక్తం కావడంతో, వాటిని కేంద్ర బృందాల ద్వారా నివృత్తి చేయడానికి ఈ భేటీ నిర్వహించారు. కేంద్ర జలసంఘం చైర్మన్‌ ఆర్కే గుప్తా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ) నిపుణులు కూడా భేటీకి హాజరయ్యారు.

ప్రాజెక్టు నిర్మాణంపై పొరుగు రాష్ట్రాల అభ్యంతరం…

సాంకేతిక కమిటీ సమావేశం ఆరంభం నుంచే ముంపు ప్రభావంపై తెలంగాణ, ఒడిసా, ఛత్తీస్‌ గఢ్‌ కేంద్రం వైఖరిని తప్పు పట్టాయి. ఈ ఏడాది జూలైలో వచ్చిన వరదకు భద్రాచలం ముంపునకు గురైందని 2వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చిందని తెలంగాణ పేర్కొంది. 50లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకోవడానికి వీలుగా పోలవరం స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ డిజైన్‌ చేసినట్లు చెబుతున్నారని డిజైన్లలోనే చాలా లోపాలను గుర్తించామని తెలిపింది. 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి తట్టుకునేలా నిర్మించామంటున్నా, 58లక్షల క్యూసెక్కుల వరద వచ్చే వీలుందని పేర్కొంది. ప్రస్తుతం 36లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఆధారంగా బ్యాక్‌వాటర్‌పై అధ్యయనం చేశారని 50 లక్షల క్యూసెక్కులను బట్టి ఉమ్మడి సర్వే నిర్వహించాలని డిమాండ్‌ చేసింది.

కొత్త సర్వే ప్రకారం భూసేకరణ, సహాయ పునరావాసం చేపట్టాలని స్పష్టం చేసింది. ఇదంతా జరిగాకే ప్రాజెక్టుపై ముందుకు కదలాలని తెలంగాణ తేల్చిచెప్పింది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలను 42.5మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ఆ ప్రభావం తమపై పడుతుందని వాదించింది. ప్రాజెక్టుతో తామే తీవ్రంగా నష్టపోతామని ఒడిసా పేర్కొంది. ఎత్తయిన కరకట్టలు నిర్మించడం వల్ల ముంపు పెరుగుతుందని.. దాని ప్రభావం చాలా గ్రామాలపై పడుతుందని పేర్కొంది. దీనివల్ల ఎదురయ్యే పర్యావరణ సమస్యలపై అధ్యయనం చేయాలని డిమాండ్‌ చేసింది. వీటికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి కొత్తగా అనుమతులు పొందాల్సిందేనని వెల్లడించింది. ఎత్తయిన కరకట్టల నిర్మాణంతో వరద త్వరగా సముద్రంలోకి వెళ్లదని.. ముంపు ప్రభావం చాలా రోజులు ఉంటుందని చత్తీస్‌గడ్‌ తెలిపింది.

అనుమతుల మేరకే నిర్మాణం…..

ఉమ్మడి సర్వేకు అంగీకరించిన ఆంధ్రప్రదేశ్‌.. ఇతర జాతీయ ప్రాజెక్టుల విషయంలో అనుసరించిన మార్గదర్శకాలనే పోలవరానికి కూడా వర్తింపజేయాలని స్పష్టం చేసింది. గోదావరి ట్రైబ్యునల్‌, జలసంఘం అనుమతుల మేరకే నిర్మాణం జరుగుతోందని, డిజైన్లు, నీటి సామర్థ్యం విషయంలో నిబంధనల ఉల్లంఘన జరగలేదని తేల్చిచెప్పింది. అన్ని రాష్ట్రాల వాదనలు విన్న కేంద్రం, ఈ నెల 19వ తేదీన సమగ్ర సాంకేతిక అధ్యయన నివేదికలతో ఢిల్లీ రావాలని ఒడిసా, ఛత్తీస్‌ గఢ్‌, తెలంగాణలను ఆదేశించింది. వరద ప్రభావం, బ్యాక్‌ వాటర్‌పై 10 రోజుల్లోగా రాతపూర్వకంగా తమ అభ్యంతరాలు తెలపాలని సూచించింది. మరోవైపు పోలవరంపై అభ్యంతరాలతో పొరుగు రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ డిసెంబరు 7న జరుగనుంది.

IPL_Entry_Point