Medical Colleges : మెడికల్ కాలేజీలలో ఫీజుల దోపిడి….-medical colleges collecting additiopnal fee in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Medical Colleges : మెడికల్ కాలేజీలలో ఫీజుల దోపిడి….

Medical Colleges : మెడికల్ కాలేజీలలో ఫీజుల దోపిడి….

B.S.Chandra HT Telugu
Aug 07, 2022 05:57 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవే‌ట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఫీజుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని వైద్య పీజీ వైద్య విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తూ విద్యార్ధుల్ని అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విజయవాడలోని ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్
విజయవాడలోని ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్

ఏపీలో ప్రైవేట్‌ మెడికల్ కాలేజీలలో ఫీజు వసూళ్ళలో యాజమాన్యాలు రకరకాల పద్ధతుల్లో దోపిడీలకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల్ని మించి రకరకాల పద్ధతుల్లో అదనపు వసూళ్ళు చేస్తున్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వ, యూనివర్శిటీ పర్యవేక్షణ అంతంతమాత్రంగా ఉండటంతో విద్యార్ధులు విధిలేని పరిస్థితుల్లో యాజమాన్యాలు డిమాండ్ చేసిన ఫీజుల్ని చెల్లించాల్సి వస్తోంది. ఎంబిబిఎస్‌ కోర్సులతో పాటు, పీజీ విద్యార్ధుల నుంచి ఇలా బలవంతంగా ఫీజు వసూలు చేస్తున్నారు. ఎంబిబిఎస్‌ కోర్సు వ్యవధి నాలుగున్నర సంవత్సరాలు అయితే మొత్తం ఐదేళ్ల కాలానికి విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆర్నెల్ల కాలానికి అదనంగా విద్యార్ధుల నుంచి వసూలు చేస్తున్నట్లు కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై ఆరోపణలు ఉన్నాయి. హౌస్‌ సర్జన్‌గా పనిచేసే కాలానికి కూడా విద్యార్ధుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. కోర్సు వ్యవధి నాలుగున్నర సంవత్సరాలే అయినా ఐదేళ్ళ కాలానికి విద్యార్దుల నుంచి వార్షిక ఫీజులు వసూలు చేస్తున్నారు.

ఇటీవల కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఐదో ఏడాది మొత్తం ఫీజు చెల్లించకపోతే తరగతులకు హాజరు కానివ్వమని విద్యార్ధుల ఇళ్లకు లేఖలు పంపుతున్నాయి. చిత్తూరులోని అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇటీవల ఇలాగే విద్యార్ధులకు లేఖలు పంపింది. 2018 బ్యాచ్‌కు చెందిన విద్యార్ధులు ఐదో ఏడాది పూర్తి ఫీజు చెల్లించాలని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యార్ధులను ఒత్తిడిచేస్తున్నాయని జూనియర్ డాక్టర్ల సంఘం ఆరోపిస్తోంది. ప్రభుత్వం వైద్య విద్యను వీలైనంత ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుంటే ప్రైవేట్ కాలేజీలు మాత్రం విద్యార్ధుల్ని దోచుకోవడానికి మార్గాలు వెదుకుతున్నాయని జూనియర్ డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జశ్వంత్ ఆరోపించారు.

ఇక పీజీ కోర్సుల్లో దోపిడీ మరో విధంగా ఉంటుందని వైద్య విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. ఫీజు వసూళ్ల కోసం మెడికల్ కాలేజీలు వేటికవే నిబంధనల్ని ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేసేందుకు కొత్త మార్గాలు కనిపెడుతున్నాయి. విద్యార్ధులకు మేలు చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పీజీ మెడికల్ కోర్సు ఫీజుల్ని సవరించిన తర్వాత మెడికల్ కాలేజీలు కొత్త దారులు వెదకడం ప్రారంభించాయి. రకరకాల పేర్లతో విద్యార్ధుల నుంచి అందిన కాడికి వసూలు చేయడం మొదలు పెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు తగ్గించిన తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఏ క్యాటగిరిలో పీజీ కోర్సుల ఫీజు రూ.4.32లక్షలుగా ఖరారు చేశారు. బి క్యాటగిరీలో రూ.8.64లక్షలు, సి క్యాటగిరీలో రూ.50లక్షల వరకు వసూలు చేసేందుకు అనుమతించారు. గతంలో ఈ ఫీజులు వరుసగా రూ.7.5లక్షలు, రూ.25లక్షలు, రూ.75లక్షలుగా ఉండేవి.

ప్రభుత్వం ఫీజుల్ని భారీగా తగ్గించడంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అదనపు ఆదాయం కోసం కొత్త దారులు వెదకడం ప్రారంభించాయి. కొన్ని కాలేజీలు తమ వద్దే హాస్టల్లో చేరాలని విద్యార్ధుల్ని బలవంతం చేస్తున్నాయి. ఇందుకోసం ఏడాదికి రూ.2 నుంచి మూడున్నర లక్షల రుపాయలు వసూలు చేస్తున్నాయి. వార్షిక స్పోర్ట్స్‌ మీట్‌, లైబ్రరీ ఛార్జీల పేరుతో మరో లక్ష రుపాయలు వసూలు చేస్తున్నారు. విద్యార్ధులు అడ్మిషన్ సమయంలో చెల్లించే కాషన్ డిపాజిట్‌ను కోర్సు పూర్తి చేసే సమయంలో తిరిగి చెల్లించాల్సి ఉన్నా చాలా కాలేజీలు ఇవ్వడం లేదు. దాదాపు రూ.50వేల రుపాయలు ఇలా తమ ఖాతాలో వేసుకుంటున్నాయి.

పీజీ వైద్య విద్యార్ధులకు ప్రతి నెల రూ.30వేల రుపాయలను స్టైపెండ్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలతో సమానంగా ప్రైవేట్ కాలేజీలు కూడా స్టైపెండ్ చెల్లించాల్సి ఉన్నా చాలా మెడికల్ కాలేజీలు అలా చేయడం లేదు. విద్యార్దులకు నామమాత్రంగా స్టైపెండ్ చెల్లించి చేతులు దులుపుకుంటున్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల దోపిడీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని వైద్య విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్