BRS in AP : ఏపీలో బీఆర్ఎస్.. ఆ పార్టీల వైఖరి తేలినట్లేనా ?-janasena ysrcp tdp response on kcrs brs in andhra pradesh politics
Telugu News  /  Andhra Pradesh  /  Janasena Ysrcp Tdp Response On Kcrs Brs In Andhra Pradesh Politics
ఏపీలో బీఆర్ఎస్ - పార్టీల వైఖరి
ఏపీలో బీఆర్ఎస్ - పార్టీల వైఖరి

BRS in AP : ఏపీలో బీఆర్ఎస్.. ఆ పార్టీల వైఖరి తేలినట్లేనా ?

08 January 2023, 23:00 ISTThiru Chilukuri
08 January 2023, 23:00 IST

BRS in AP : బీఆర్ఎస్ పై ఏపీలోని రాజకీయ పార్టీలు ఒక్కొక్కటిగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రాలో కేసీఆర్ ఎంట్రీపై వైఎస్సార్సీపీ ఇప్పటికే తీవ్రస్థాయిలో వ్యతిరేకించగా... బీఆర్ఎస్ ఏపీకి రావడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తో తాము గతంలో పొత్తు పెట్టుకున్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

BRS in AP : బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాలు మొదలు పెట్టిన కేసీఆర్.. ముందుగా ఏపీపై దృష్టి పెట్టారు. ఇప్పటికే పలువురు ఏపీ నేతలకు గులాబీ కండువా కప్పారు. త్వరలో ఏపీలో బహిరంగ సభ, ర్యాలీలు చేపట్టేందుకు కూడా సన్నద్ధం అవుతున్నారు. ఇన్నాళ్లూ తెలంగాణ ప్రయోజనాలకే పరిమితమైన కేసీఆర్.. నేషనల్ పాలిటిక్స్ లో భాగంగా.. ఏపీపై కూడా తన విధానాన్ని అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి దీర్ఘకాల డిమాండ్లు, ఆంధ్రుల కోరికకు అనుగుణంగా పార్టీ అజెండాను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, రాజధాని, విశాఖ ఉక్కు తదితర అంశాలపై ఏపీ ప్రజల తరపున పోరాడేందుకు కేసీఆర్ సై అనే సంకేతాలు ఉన్నాయి. పార్టీ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో మొదలైన తర్వాత.. ఆయా అంశాలపై గులాబీ బాస్ ఏపీ వేదికగానే స్పష్టత ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... కేసీఆర్ ఆంధ్రలో అడుగుపెడితే.. ఏ రాజకీయ పార్టీ ఎలా స్పందిస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది !

ఈ విషయంలో అందరికంటే ముందే.. అధికార వైఎస్సార్సీపీ స్పందించింది. తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబు సహా పలువురు ఏపీ నేతలు హైదరాబాద్ లో కారెక్కగానే... ఏపీలో వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు బీఆర్ఎస్ మీద మాటల దాడి మొదలు పెట్టారు. మంత్రి రోజా, ఎమ్మెల్యే పేర్ని నాని, కొడాలి నాని తదితర నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందు ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా తేల్చాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బకాయిలు కట్టి మాట్లాడాలని అన్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన వారే ఇప్పుడు మళ్లీ రాష్ట్రానికి వస్తున్నారని... ప్రజలు ఈ విషయం గుర్తించాలన్నారు. అయితే... వైఎస్సార్సీపీ ఈ మాటల దాడి వెనక వ్యూహం వేరే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్, జగన్ లు ఇద్దరూ దోస్తులేనని.. ప్రజల్లో సెంటిమెంట్ రగిలించేందుకు డ్రామాలు ఆడుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రెండు పార్టీల మధ్య వైరుధ్యం ఉందని చూపించి.... ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తాపత్రయ పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వ్యూహం.. ఏదైనా, బీఆర్ఎస్ ఏపీ ఎంట్రీని వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. ఇక మిగిలింది.... జనసేన, టీడీపీ.. ! కేసీఆర్ ఏపీ రాజీయాల పట్ల వీరి వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తిగా మారిన నేపథ్యంలో.... ఈ అంశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. ఆదివారం హైదరాబాద్ లో చంద్రబాబుతో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఏపీకి రావడాన్ని తప్పుపట్టే అవసరం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ... తెలంగాణ వాదం వదిలి దేశమంతా పోటీ చేస్తామని అంటున్నారని... వారికి ఏపీలోనూ పోటీ చేసే హక్కు ఉందని చెప్పారు. ఏ పార్టీలో అయినా చేరికలు సహజం అన్న పవన్... కొత్తగా ఏ రాజకీయ పార్టీ వచ్చినా స్వాగతిస్తామని అన్నారు. ఈ అంశంపై చంద్రబాబు నేరుగా స్పందించకున్నా.... గతంలో టీఆర్ఎస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుందని.. 2014లో వేరయ్యామని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలన్నాక చాలా కాంబినేషన్లు ఉంటాయని చెప్పారు.

ఈ మూడు పార్టీల ప్రధాన నేతల మాటలతో.. బీఆర్ఎస్ పై వారి వైఖరి తేలినట్లేననే చర్చ నడుస్తోంది. రానున్న రోజుల్లో కేసీఆర్ ఏపీలో క్రియాశీల రాజకీయాలు మొదలు పెడితే... ఎవరి నుంచి ఎక్కువ వ్యతిరేకత వస్తుందనే విషయంలో ప్రస్తుతానికి అంచనా అయితే వచ్చింది. అయితే... రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు కదా. ఒక్క నిర్ణయం, ఒక్క మాట చాలు. మొత్తం మారిపోవడానికి !!