Vidya Kanuka : ముఖ్యమంత్రి చేతుల మీదుగా విద్యాకానుక-jagan launches vidya kanuka distribution in kurnool district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vidya Kanuka : ముఖ్యమంత్రి చేతుల మీదుగా విద్యాకానుక

Vidya Kanuka : ముఖ్యమంత్రి చేతుల మీదుగా విద్యాకానుక

HT Telugu Desk HT Telugu
Jul 05, 2022 01:06 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యార్ధుల కోసం అందిస్తున్న జగనన్న విద్యాకానుక పంపిణీని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కర్నూలు జిల్లా ఆదోనీలో ప్రారంభించారు. దాదాపు 47లక్షల మంది విద్యార్ధులకు 931కోట్ల రుపాయల వ్యయంతో విద్యాభ్యాసానికి అవసరమైన వస్తువులను ఉచితంగా అందచేస్తారు.

కర్నూలులో విద్యాకానుక పంపిణీ ప్రారంభించిన సీఎం
కర్నూలులో విద్యాకానుక పంపిణీ ప్రారంభించిన సీఎం

చదువుకునే పిల్లలకు మేనమామగా అండగా ఉంటానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కర్నూలు జిల్లా ఆదోనీలో జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో 47.40 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుకను అందిస్తున్నట్లు ముఖ‌్యమంత్రి ప్రకటించారు. విద్యాకానుక కోసం రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నామని, పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలన్నారు. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందని ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకోవాలని సూచించారు. పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి అమలు చేస్తున్నామని నాడు-నేడు కింద​ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామన్నారు.

జగనన్న గోరుముద్ద పథకంతో బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని, బైజూస్‌ యాప్‌‌ను పేద పిల్లలకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. విద్యార్థుల కోసం ఇంగ్లీష్‌ -తెలుగు భాషల్లో పాఠ్య పుస్తకాలు ఇచ్చామన్నారు. ఆంగ్లభాష పరిజ్ఞానం కోసం ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మూడేళ్లలోనే విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు.

జగనన్న విద్యాకానుక క్రింద . ప్రతి విద్యార్ధికి ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్‌ కుట్టుకూలితో సహా ఇస్తారు. ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, . బెల్టు, స్కూలు బ్యాగు, బై లింగువల్‌ టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్‌, వర్క్‌బుక్స్‌తో పాటు అదనంగా ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీషు – తెలుగు డిక్షనరీని ప్రభుత్వం అందజేస్తుంది. బోధనా కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 5 నుంచి నెలాఖరు వరకు విద్యాకానుక కిట్లను విద్యార్ధులకు అందజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్ధినీ, విద్యార్ధులకు రూ. 931.02 కోట్ల ఖర్చుతో విద్యా కానుకను అందచేస్తున్నారు.

నాణ్యమైన విద్యను అందించడం ద్వారా పిల్లల భవిష్యత్‌పై తమ ప్రభుత్వం దృష్టిపెట్టిందని చెప్పారు. విద్యాసంత్సరం ఆరంభంలోనే విద్యా కానుక అందిస్తున్నామని చెప్పారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు ఇస్తున్నామని, ఒక్కో కిట్‌ విలువ రూ.2వేలు ఉంటుందన్నారు. విద్యా కానుక పంపిణీ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనికి డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆటోనగర్‌, జగనన్న కాలనీలకు బీటీ రోడ్లు, రోడ్ల విస్తరణ కోసం రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

WhatsApp channel