Tirumala Security : తిరుమలలో భద్రత కట్టుదిట్టం.-high security in tirumala for brahmotsavam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  High Security In Tirumala For Brahmotsavam

Tirumala Security : తిరుమలలో భద్రత కట్టుదిట్టం.

HT Telugu Desk HT Telugu
Sep 27, 2022 09:36 AM IST

Tirumala Security తిరుమలలో మూడంచల భద్రతా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ ఏడాది తిరుమల గరుడ సేవలో హారతి ఉండదని తిరుమల చీఫ్ విజిలెన్స్‌ ఆఫీసర్ తెలిపారు. తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సంతృప్తికరంగా మూలమూర్తి దర్శనం, వాహనసేవల దర్శనం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని తెలిపారు.

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల
బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల

Tirumala Security తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుచ చేశారు. అసాంఘిక శ‌క్తుల నుండి భక్తులకు ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త క‌ల్పించేందుకు మూడంచ‌ల భ‌ద్ర‌తా విధానాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని, ప్ర‌తి ఒక్క‌రినీ క్షుణ్ణంగా త‌నిఖీ చేసిన త‌రువాతే అనుమ‌తిస్తామ‌ని చీఫ్‌ విజిలెన్స్‌ అండ్ సెక్యూరిటీ అధికారి చెప్పారు.

మొద‌టి ద‌శ‌లో అలిపిరి చెక్ పాయింట్ వద్ద, రెండో ద‌శ‌లో శ్రీవారి ఆలయంలోకి ప్ర‌వేశించే ముందు, మూడో ద‌శ‌లో మాడ వీధుల్లోకి అనుమ‌తించే ముందు త‌నిఖీలు చేప‌డ‌తామ‌న్నారు. తిరుమ‌ల‌లో 2200 సిసి కెమెరాల ద్వారా భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని, మూడో ద‌శ‌లో 1500 సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. దశలవారీగా ఘాట్‌ రోడ్లను కూడా సిసి కెమెరాల ద్వారా కవర్ చేస్తామ‌న్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో దొంగ‌త‌నాలు జ‌ర‌గ‌కుండా చూసేందుకు, శాంతిభద్రతలను అదుపు చేసేందుకు టిటిడి విజిలెన్స్ సిబ్బందితో పాటు ప్రత్యేక స్క్వాడ్‌లు, 460 మంది ఎస్‌పిఎఫ్ సిబ్బంది క‌లిపి 5000 మంది బలగాలను మోహరిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా గరుడ సేవ కోసం 1256 మంది సిబ్బందిని అదనంగా ర‌ప్పిస్తున్న‌ట్టు వివ‌రించారు. తిరుమలలో ప‌రిమితికి మించి వాహ‌నాల రద్దీ పెరిగితే వాహ‌నాల‌ను అలిపిరిలోనే నిలిపివేస్తామన్నారు.

పెర‌టాసి మాసంలో బ్రహ్మోత్సవాలు రావ‌డంతో తమిళనాడు నుండి భారీ సంఖ్యలో భక్తులు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని అధికారులు చెబుతున్నారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో 1.25 లక్షల మంది కూర్చునే అవ‌కాశం ఉంద‌ని, వాహ‌న‌సేవ మొద‌లుకాగానే ఒక్కో గేటు నుండి 10 వేల మందికి అద‌నంగా ద‌ర్శ‌నం చేయించ‌డం వ‌ల్ల మొత్తం 2.25 లక్షల మందికి ద‌ర్శ‌నం చేయించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

తిరుమ‌ల‌లో చేయాల్సిన‌వి, చేయ‌కూడ‌నివి….

తిరుమ‌ల‌లో చేయాల్సిన‌వి, చేయ‌కూడ‌ని అంశాల్లో భ‌క్తుల‌కు విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్న‌ట్టు చెప్పారు. మీడియా, పోలీసులు, టిటిడి ఉద్యోగుల కోసం శ్రీ బేడి ఆంజనేయ దేవాలయం వ‌ద్ద ES-7 గేటు ద్వారా ప్ర‌వేశం క‌ల్పిస్తామ‌ని, ES-6 గేటు ద్వారా వెలుప‌లికి రావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామ‌న్నారు. బ్రహ్మోత్సవం సందర్భంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1, 2 ద్వారా సర్వదర్శనం క్యూలైన్లలోకి భక్తులు ప్రవేశించేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

తిరుమ‌ల‌లో పాద‌ర‌క్ష‌ల కౌంట‌ర్ల వ‌ద్ద మాత్ర‌మే పాద‌ర‌క్ష‌లు ఉంచాల‌ని, చెల్లాచెదరుగా పాడ‌వేయ‌రాద‌ని కోరారు. ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల స్థానంలో గాజు సీసాలు లేదా స్టీల్ లేదా రాగి సీసాల‌ను వినియోగించాల‌ని భక్తులను కోరారు. ఎక్కువ మంది భ‌క్తుల‌కు దర్శనం కల్పించేందుకు వీలుగా గరుడసేవ రోజున హారతిని టిటిడి బోర్డు రద్దు చేసిందని, మిగతా రోజుల్లో హారతులు కొనసాగుతాయని చెప్పారు. చక్రస్నానం సందర్భంగా 24 మంది ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేశామ‌న్నారు.

తిరుమల మాడ వీధుల్లో వాహన సేవలు జరిగే సమయంలో నాణాలను విసరొద్దని అధికారులు సూచించారు. అర్చకులు, పల్లకీ మోసే వారికి నాణాలు తగిలి ఇబ్బందికరంగా ఉంటుందన్నారు.

IPL_Entry_Point

టాపిక్