Heavy Rains Alert : బంగాళాఖాతంలో వాయుగుండం… కోస్తాలో భారీ వర్షాలు…
Heavy Rains Alert ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. చెన్నైకు ఆగ్నేయంగా 670కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి.
Heavy Rains Alert బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వచ్చే 48 గంటల్లో తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా తీరంలోని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఐఎండి సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంతో పాటు ఆ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రస్తుతానికి వాయుగుండం రాగల 48 గంటల్లో నెమ్మదిగా పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు మరియు దక్షిణకోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వివరించారు.
వాయుగుండం ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో, రాయలసీమలోని చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణకోస్తా-తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లవద్దని సూచించారు. వర్షాల నేపధ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షప్రభావం ఉన్న జిల్లాల రెవిన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
వాయుగుండం దృష్ట్యా సంబంధిత జిల్లాల యంత్రాంగాన్ని ముందస్తు చర్యల కోసం అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి అంబేద్కర్ తెలిపారు. అత్యవసర సహయం, సమాచారం కోసం విపత్తుల సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండేందుకు 1070, 18004250101, 08632377118 నెంబర్లను సంప్రదించాలన్నారు.
వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురువనున్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువనున్నాయి. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55కిలోమీటర్లు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులువీస్తాయని, సముద్రంలో అలజడి ఉంటుందని వాతావరణ శాఖపేర్కొంది.
వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలోని సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి.చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.