Polavaram Mistakes : ఆ పొరపాటుతోనే పోలవరంకు నష్టం..-expert committee says polavaram project construction will be delayed with technical issues ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Polavaram Mistakes : ఆ పొరపాటుతోనే పోలవరంకు నష్టం..

Polavaram Mistakes : ఆ పొరపాటుతోనే పోలవరంకు నష్టం..

HT Telugu Desk HT Telugu
Mar 06, 2023 11:52 AM IST

Polavaram Mistakes పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన మట్టికట్ట నిర్మాణం విషయంలో చేసిన పొరపాట్లే ప్రస్తుత పరిస్థితికి కారణమని తేలింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం చేయడంతో వరదల్లో కొట్టుకు పోయినట్లు నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.

పోలవరం నిర్మాణంపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన కమిటీ
పోలవరం నిర్మాణంపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన కమిటీ

Polavaram Mistakess పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్‌, కేంద్ర జలసంఘం నిపుణుల కీలక నిర్ణయం తీసుకున్నారు. వరుస వరదలతో కొట్టుకుపోయిన డయాఫ్రం వాల్‌తో పాటు కోతకు గురైన ప్రాంతాల్లో మరమ్మతులు ఎలా చేయాలనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చారు. గతంలో చేసిన పొరపాట్ల వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇబ్బందులు కలుగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం పూర్తి చేయకుండానే డయాఫ్రం వాల్ కట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అంచనాకు కమిటీ వచ్చింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యానికి కారణమవుతున్న డయాఫ్రం వాల్‌తో పాటు, కోతకు గురైన నదీ గర్భాన్ని ఎలా సరి చేయాలనే దానిపై డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌, కేంద్ర జల సంఘ నిపుణులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్‌ డ్యామ్ నిర్మాణం కోసం డయాఫ్రం వాల్ నిర్మించారు. 2018లో ఈ నిర్మాణం పూర్తైంది. పెద్ద ఎత్తున వచ్చిన వరద ప్రవాహానికి డయాఫ్రం వాల్ దెబ్బతింది. మరోవైపు నదికి అడ్డుగా నిర్మించిన కాంక్రీట్ నిర్మాణం కొట్టుకుపోవడంతో పాటు భారీ వరదలకు నదీ గర్భం పెద్ద ఎత్తున కోసుకుపోయింది.

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించాల్సిన ప్రాంతంలో విధ్వంసం సాగడంతో నిర్మాణాల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై సందేహాలు తలెత్తాయి. “డోజింగ్‌” “వైబ్రో కాంపాక్షన్‌” పద్ధతుల్లో ఇసుకను నింపి నదీ గర్భాన్ని సరి చేసిన సాధారణ భూ భౌతిక పరిస్థితులు తీసుకురావాలని కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ పాండ్యా నేతృత్వంలో రాజమండ్రిలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు.

పోలవరం ప్రాజెక్టు వద్ద ఉన్న పరిస్థితిపై ప్రొఫెసర్‌ రాజు బృందం నాలుగు విధానాల్లో అధ్యయనం చేశారు. ఆ నివేదిక ఫలితాలను కమిటీ ముందుంచారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణంలో చేసిన పరీక్షల్లో 96 శాతం వరకు ఫలితాలు రావడంతో ఆ విధానంలోనే ముందుకెళ్లాలని డీడీఆర్‌పీ నిర్ణయించింది.

జాతీయ జలవిద్యుత్తు కార్పొరేషన్‌, జాతీయ జల, విద్యుత్తు పరిశోధన సంస్థ, చెన్నైలోని స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఎస్‌ఈఆర్‌సీ), సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ ప్రతినిధులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య అధికారులు, జలవనరులశాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

డయాఫ్రం వాల్‌ ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ఎన్‌హెచ్‌పీసీ ప్రతినిధులు ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఎక్కడెక్కడ డయాఫ్రం వాల్‌ దెబ్బతిందో ఆ వివరాలన్నీ నేషనల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కమిటీ ప్రతినిధులు సమర్పించారు. ఈ అంశాలపై చర్చించి తర్వాత పరిష్కార మార్గాలు సూచించారు.

డయాఫ్రం వాల్‌తో పాటు గోదావరి గర్భం కోత పరిష్కారాలపై చర్చ జరిగింది. డోజింగు, వైబ్రో కాంపాక్షన్‌ విధానంలోనే ఇసుక నింపి కోతకు గురైన చోట పరిస్థితులు మెరుగుపరచాలని పాండ్యా సూచించారు. బావర్‌ కంపెనీ గతంలో నేలను పరీక్షించినప్పుడు వచ్చిన ఫలితాలను.. ప్రస్తుత విధానంలో సరిదిద్దిన తర్వాత వచ్చిన ఫలితాలను పోల్చి చూసుకోవాలనీ సూచించారు.

స్పిల్‌వే స్థితిగతులపై స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పరిశోధనల ఫలితాలను వివరించారు. స్పిల్‌ వే గడ్డర్లలో ఎక్కడెక్కడ పగుళ్లున్నాయో, ఎన్ని ఉన్నాయో స్పష్టంగా నివేదించాలని కమిటీ కోరింది. పగుళ్లను ఎలా సరిదిద్దాలో, ఏ రకంగా గ్రౌట్‌ చేయాలో తర్వాత సమావేశంలో నిర్ణయిద్దామని పేర్కొంది.

IPL_Entry_Point