MP GVL Problems : బీజేపీ ఎంపీ జీవిఎల్‌కు ఎన్నికల కష్టాలు…-bjp mp gvl narasimha rao struggles for establish in visakhapatnam loksabha segment for next election ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Bjp Mp Gvl Narasimha Rao Struggles For Establish In Visakhapatnam Loksabha Segment For Next Election

MP GVL Problems : బీజేపీ ఎంపీ జీవిఎల్‌కు ఎన్నికల కష్టాలు…

HT Telugu Desk HT Telugu
Feb 13, 2023 12:45 PM IST

MP GVL Problems బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహరావుకు ఎన్నికల కష్టాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఏదొక నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ అధిష్టానం తేల్చి చెప్పడంతో జివిఎల్ ఇప్పటి నుండి ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ నుంచి పోటీ చేయాలనే యోచనలో జివిఎల్ అందులో భాగంగా రకరకాల పాట్లు పడుతున్నారు.

ఎంపీ జివిఎల్ నరసింహరావు
ఎంపీ జివిఎల్ నరసింహరావు

MP GVL Problems విశాఖ లోక్‌సభ స్థానంపై కన్నేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన జీరో అవర్‌లో వంగవీటి మోహన రంగా పేరును రాజ్యసభలో ప్రస్తావించారు. విజయవాడ ఎయిర్ పోర్ట్‌కు రంగా పేరు పెట్టాలని, ఏపీలో ఏదొక జిల్లాకు రంగా పేరు పెట్టాలని, రంగాను కొందరు ద్రోహులు హత్య చేశారని పార్లమెంటులో ప్రకటించారు.

జివిఎల్‌కు హఠాత్తుగా వంగవీటి రంగా, కాపులపై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందే బీజేపీ నేతలకు కూడా అంతు చిక్కడం లేదు. జివిఎల్‌కు కాపులు ఎందుకు సన్మానాలు చేస్తున్నారని గత వారం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో తరచూ కాపుల గురించి జివిఎల్ ప్రస్తావించడం వెనుక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.

విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న జివిఎల్‌ అక్కడి ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మార్చుకునేందుకు తంటాలు పడుతున్నారు.

జివిఎల్‌ నరసింహరావు ప్రజల్లో బాగా గుర్తింపు ఉన్న నాయకుడేమి కాదు. బీజేపీ పెద్దలతో ఉన్న పరిచయాలతో పాటు ఎన్డీఏ హయంలో వాజ్‌పాయ్‌, అడ్వానీల కాలంలో బీజేపీ నేతలతో ఉన్న పరిచయాలతో రాజ్యసభ సభ్యుడైపోయారు. 2004కు ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో జివిఎల్ కూడా ఉన్నారు. ఆ తర్వాత బిజెపి ముఖ్యమంత్రులకు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తూ ఉత్తరాదిలోనే ఎక్కువ కాలం గడిపేశారు.

మోడీ ప్రధానమంత్రి అయ్యాక అదృష్టం కలిసొచ్చి ఎంపీ పదవి వరించిన వారిలో జివిఎల్ కూడా ఒకరు. మరోసారి రాజ్యసభను సభ్యత్వాన్ని పునరుద్ధరించే అవకాశాలు కష్టమని బీజేపీ నేతలే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో సొంతంగా బీజేపీ పోటీ చేయాల్సిందేనని జివిఎల్‌కు కూడా ఆ పార్టీ అగ్ర నాయకత్వం తేల్చి చెప్పేసింది. దీంతో విశాఖ ఓటర్ల మనసు గెలుచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీలో విశాఖ స్థానానికి పురంధేశ్వరి నుంచి పోటీ ఎదురవుతుందని భావించి ఆమెను పోటీలోకి రాకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ముందు నుంచి తానే విశాఖలో పోటీ చేస్తానని లీకులిస్తున్నారు. విశాఖలో కాపు ఓటర్లు గణనీయంగా ఉండటంతో వారిని మెప్పించే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. జివిఎల్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే.

IPL_Entry_Point

టాపిక్