Polavaram : టీడీపీ తప్పుల వల్లే పోలవరం పూర్తి కావట్లేదు….! అంబటి-ap irrigation minister accuses tdp for polavaram project delay ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Irrigation Minister Accuses Tdp For Polavaram Project Delay

Polavaram : టీడీపీ తప్పుల వల్లే పోలవరం పూర్తి కావట్లేదు….! అంబటి

HT Telugu Desk HT Telugu
Jul 31, 2022 06:55 AM IST

డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్ల 2021 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చ లేకపోయామని, ఈ తప్పు గత ప్రభుత్వానిదేనని అంబటి రాంబాబు చెప్పారు. 41.15 అడుగుల ఎత్తు వరకూ మొదటి దశలో పూర్తిచేసి నీటిని నిల్వచేస్తామని, తర్వాత 45.72 అడుగుల ఎత్తుకు రెండో దశలో పనులు చేసి పోలవరం లక్ష్యాన్ని పూర్తిచేస్తామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు సహాయ పునరావాస చర్యలు వచ్చే నాలుగు నెలల్లోగా పూర్తి చేస్తామని జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.

పోలవరం జాప్యానికి టీడీపీయే కారణమంటున్న అంబటి రాంబాబు
పోలవరం జాప్యానికి టీడీపీయే కారణమంటున్న అంబటి రాంబాబు

ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా జూలై మొదటి వారంలోనే గోదావరికి ఉదృతంగా వరదలు వచ్చాయని, ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో అన్ని చర్యలు తీసుకుందని అంబటి రాంబాబు చెప్పారు. గతంలో ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు మాత్రమే ఉండేవారని, కానీ జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలతో సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగుల అందరూ కలిసి వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారన్నారు.

వరదబాధితులకు పునరావాసం కల్పించి, రూ.2 వేల తక్షణ ఆర్థిక సహాయం అందించామన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, ప్రతి పక్షం ప్రభుత్వంపై బురదచల్లడం తగదని హితవు పలికారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ప్రతిపక్ష నేత రెచ్చగొట్టడం సరికాదన్నారు. 1986లో భద్రాచలంలో కరకట్ట కట్టానని ప్రతిపక్ష నేత గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయలేకపోయిందో ప్రతిపక్ష నేత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం కట్టాల్సిన జాతీయ ప్రాజెక్టును గత ప్రభుత్వం ఎందుకు తీసుకుందో కూడా సమాధానం చెప్పాలన్నారు.

అసెంబ్లీ సాక్షిగా టీడీపీ ప్రభుత్వం 2018లో పోలవరం నుండి నీళ్లిస్తామని ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పలేదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. కాఫ‌ర్ డ్యామ్ పూర్తి చేయ‌కుండా డ‌యాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తారా అని నిల‌దీశారు. పోలవరం డ్యామ్ ఎత్తుపై కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారని, డ్యాం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రమ్ వాల్ పూర్తిచేస్తారా అని నిలదీశారు. గత ప్రభుత్వ తప్పిదాలతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్లే పోలవరం ఆలశ్యమైందన్నారు. స‌హాయ‌క చ‌ర్యల‌కు ఆటంకం క‌లుగుతుంద‌నే ముంపు ప్రాంతాల‌కు వరదల సమయంలో ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్ళలేద‌ని, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి వరద బాధితుల‌కు అండ‌గా నిలిచింద‌ని చెప్పారు.అనూహ్య వరదలతో ఎటువంటి ప్రాణం నష్టం జరగకుండా చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేసిందన్నారు. గోదావ‌రి ఉధృతితో భారీ న‌ష్టం జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి గత ప్రభుత్వ నిర్ణయాలే కారణమని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, దశల వారీగా ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. 41.15 అడుగుల స్థాయిలో నీరు నిలబెట్టాలంటే దాదాపు 21 వేల ఇళ్లను ఖాళీ చేయించాలని, ఇప్పటికే 10 వేల ఇళ్లు ఖాళీ చేయించామని 3 వేల మంది నగదు కావాలంటున్నారని చెప్పారు.

మరో 3 వేల మందికి ఇళ్లు తయారవుతున్నాయని, రాబోయే రోజుల్లో మొత్తం 21 వేల ఇళ్ల మందికి పునరావాసం కల్పించి, ప్రాజెక్టులో నీరు నింపుతామన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టం 45.72 అడుగుల నీరు నింపాలంటే దాదాపు 85 వేల ఇళ్లు ఖాళీ చేయించాల్సి ఉందన్నారు. దీనికి సుమారు రూ.20 వేల కోట్లు కావాలని. కేంద్రం ఇస్తేనే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ సాధ్యమవుతుందన్నారు. మొదట 41.15 అడుగులకు నీటిని నిల్వ చేసి రెండో దశలో 45.72 అడుగులకు పెంచుతామన్నారు. పోలవరం ఎత్తు తగ్గించే అవకాశం లేదని స్పష్టం చేశారు.

IPL_Entry_Point

టాపిక్