AP High Court on Advisors : శాఖల్లో సలహాదారులు ప్రమాదకరమన్న హైకోర్టు….-ap high court serious comments on govrnment for appointing advisors in every department ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap High Court Serious Comments On Govrnment For Appointing Advisors In Every Department

AP High Court on Advisors : శాఖల్లో సలహాదారులు ప్రమాదకరమన్న హైకోర్టు….

HT Telugu Desk HT Telugu
Jan 20, 2023 08:34 AM IST

AP High Court on Advisors ప్రభుత్వ శాఖల్లో సలహాదారుల నియామకం అంటే సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమేనని, ఇది ప్రమాదకరమైందని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి సైతం సలహాదారుడిని నియమించడంపై ధర్మాసనం విస్తుపోయింది. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో టిఏ,డిఏలు చెల్లించడానికి కూడా సలహాదారుల్ని నియమిస్తారని అభిప్రాయపడింది. సలహాదారుల నియామకంపై పూర్తి స్థాయి వివరాలు సమర్పించడానికి అడ్వకేట్ జనరల్ హైకోర్టును గడువు కోరారు.

సలహాదారుల నియామకంపై హైకోర్టు ఆగ్రహం
సలహాదారుల నియామకంపై హైకోర్టు ఆగ్రహం

AP High Court on Advisors సలహాదారుల పేరుతో రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లవుతుందని ఏపీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి సైతం సలహాదారుల్ని నియమించడాన్ని తప్పు పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తిపై విచారణ ఫిబ్రవరి 2కు వాయిదా వేసిన ధర్మాసనం అంతకు ముందు ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పు పట్టింది.

ట్రెండింగ్ వార్తలు

ఏపీలో సలహాదారుల నియామకాన్ని చేపడుతున్న తీరుపై హైకోర్టు ఘాటుగా విమర్శలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి సలహాదారు ఎందుకని ప్రశ్నించింద. ఇదే కొనసాగిస్తే ఉద్యోగులకు టీఏ, డీఏలు ఇచ్చేందుకూ కూడా సలహాదారులను నియమిస్తారేమోనని అనుమానం వ్యక్తం చేసింది.

ప్రతి విభాగానికి సలహాదారులను నియమిస్తే సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లేనని అభిప్రాయపడింది. ఇలాంటి దొడ్డిదారి నియామకాలు ప్రమాదకరమని తప్పు పట్టింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తీరుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

దేవాదాయ శాఖలో జ్వాలాపురపు శ్రీకాంత్‌ను సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 630ను సవాలు చేస్తూ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య అధికార ప్రతినిధి రాజశేఖరరావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ రిటైర్డ్‌ ఉద్యోగి మునెయ్య మరో పిల్‌ వేశారు. ఈ వ్యాజ్యాలపై గతంలో విచారణ జరిపిన కోర్టు.. సలహాదారుల నియామకంలోని రాజ్యాంగ బద్ధతను తేలుస్తామని ప్రకటించింది.

జ్వాలాపురపు శ్రీకాంత్‌ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంతో చంద్ర శేఖర్‌ రెడ్డి నియామకంపై దాఖలైన పిల్‌ జతయినట్లు, మీడియా ద్వారా తెలుసుకుని విచారణకు హాజరయ్యామని చంద్రశేఖర్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది హేమేంద్రనాథ్‌రెడ్డి కోర్టుకు వివరించారు. న్యాయస్థానం ఇచ్చిన నోటీసు అందలేదని, ప్రభుత్వ సలహాదారు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. మీడియాలో చూసి రావడమేంటని ప్రశ్నించింది. కేసుల జాబితా చూసుకోవాలి కదా అని వ్యాఖ్యానించింది.

చంద్రశేఖర్‌ రెడ్డిపై రాజకీయ ప్రేరణతో పిటిషన్ దాఖలు చేశారని అడ్వకేట్‌ చెప్పడంతో ఎలాంటి వ్యాజ్యాలను ఎలా డీల్‌ చేయాలో తమకు తెలుసని దర్మాసనం హెచ్చరించింది. ఏపీ బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య తరఫు సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ, ఏజీ సమయం కోరడంపై అభ్యంతరం తెలిపారు. సలహాదారుల నియామకం విషయంలో మరికొన్ని వివరాలను సేకరించి కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని ఏజీ కోరారు. దీంతో విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. జ్వాలాపురపు శ్రీకాంత్‌ దేవాదాయశాఖ సలహాదారుగా కొనసాగేందుకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది

IPL_Entry_Point

టాపిక్