AP HIGH COURT: కొన్ని విగ్రహాలకు ఎందుకు మినహాయింపు..?-ap high court key comments on ysr statue issue at nandigama in krishna district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap High Court: కొన్ని విగ్రహాలకు ఎందుకు మినహాయింపు..?

AP HIGH COURT: కొన్ని విగ్రహాలకు ఎందుకు మినహాయింపు..?

HT Telugu Desk HT Telugu
Apr 07, 2022 07:13 AM IST

రోడ్లు, ప్రభుత్వ స్థలాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయడ, తొలగించడం వంటి విషయాల్లో ఏకీకృత నిబంధనలు అమలు చేయాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి పక్షపాతం చూపొద్దని వ్యాఖ్యానించింది.

విగ్రహాల అంశంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
విగ్రహాల అంశంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు (HT)

ప్రభుత్వ స్థలాలు., రోడ్లపై ఏర్పాటు చేసిన విగ్రహాల విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో నిబంధన ఎందుకు అమలు చేస్తున్నారంటూ ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్లు., ప్రభుత్వ స్థలాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయడం., తొలగించడం వంటి విషయాల్లో ఏకీకృత నిబంధనలు అమలు చేయాలని., ఎలాంటి పక్షపాతం చూపొద్దని ఆదేశించింది. కృష్ణాజిల్లా నందిగామలోని గాంధీ బొమ్మ చౌరస్తాలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని తొలగించకుండా మిగిలిన విగ్రహాలను తొలగించడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పు పట్టింది. 

విగ్రహాలకు సైతం వివక్ష పాటిస్తే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తందని హెచ్చరించింది. విగ్రహాల ఏర్పాటు, తొలగింపు అనేది సున్నితమైన అంశం కాబట్టి ప్రభుత్వ స్థలాల్లో విగ్రహాలను తొలగించే విషయంలో సరైన పరిష్కారాన్ని ప్రభుత్వమే సూచించాలని ఆదేశించింది. కోర్టు సూచనల్ని పట్టించుకోకుండా తామే ఉత్తర్వులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే., తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్ కుమార్‌ మిశ్రా., జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. వైఎస్సార్‌ విగ్రహాన్ని మినహాయించి మిగిలిన జాతీయ నాయకుల విగ్రహాలను తొలగించడంతో., నందిగామ గాంధీ సెంటర్‌లో ట్రాఫిక్‌ సమస్యలు యథాతథంగా ఉన్నాయి. ఈ వ్యవహారంపై వై.రామకృష్ణ అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గాంధీ సెంటర్‌లో తొలగించిన విగ్రహాలను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రి స్థలంలో ఏర్పాటు చేశారని., ప్రభుత్వాసుపత్రిలో విగ్రహాల ఏర్పాటు చట్టవిరుద్ధమని ఫిర్యాదు చేశారు. కూడలిలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహాన్ని తొలగించకపోవడంతో రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయని., రోడ్డు విస్తరణ నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. విగ్రహాల తొలగింపు వ్యవహారంలో రెవిన్యూ, మునిసిపల్ అధికారులు వివక్ష పాటిస్తున్నారని., ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని న్యాయస్థానానికి వివరించారు. నందిగామలో వైఎస్సార్‌ విగ్రహం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని., ఆర్‌ అండ్‌ బి స్థలంలో ఆ విగ్రహం లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఆ విగ్రహం వల్ల ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారికి ఎలాంటి ఇబ్బంది కలగడం లేదని., వ్యక్తిగత కారణాలతో పిల్‌ దాఖలు చేశారని వాదించారు. తెలుగు దేశం పార్టీ నాయకుడైన పిటిషనర్‌ రాజకీయ ప్రయోజనాల కోసమే వైఎస్సాఆర్‌ విగ్రహాన్ని తొలగించాలని పట్టుబడుతున్నారన్నారు. నందిగామ కూడలిలో ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తోన్న 14 విగ్రహాలను తొలగించేదుకు మునిసిపాలిటీ తీర్మానం చేసిందని ఆ మేరకు చర్యలు చేపట్టామని చెప్పారు.

 దీనిపై స్పందించిన సీజే ధర్మాసనం రాజకీయ కారణాలతో న్యాయస్థానానికి సంబంధం లేదని సుప్రీం కోర్టు మార్గదర్శకాలు పాటించాల్సిందేనన్నారు. విగ్రహాలను ఏర్పాటు చేసే విషయంలో గతంలో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. రహదారులపై విగ్రహాలను ఏర్పాటు చేసే విషయంలో వాటిని అమలు చేయాల్సిందేనని, రోడ్లపై ఇష్టానుసారం విగ్రహాలను అనుమతించొద్దని వాటిని వెంటనే తొలగించడానికి పరిష్కార మార్గాన్ని ప్రభుత్వమే సూచించాలని, లేకుంటే తామే చర్యలకు దిగుతామని హెచ్చరించింది. విగ్రహాలను తొలగించడానికి ప్రభుత్వం సరైన సూచనలు.,పరిష్కారం కనుగొనలేకపోతే ఈ వ్యవహారాన్ని పరిశీలించి చర్యలు చేపట్టేందుకు న్యాయస్థానమే కమీషనర్‌ నియామకాన్ని చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.

IPL_Entry_Point

టాపిక్