ఫర్నీచర్‌కు ఆ డబ్బులు వాడట్లేదు....-ap endowment orders withdrawn ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఫర్నీచర్‌కు ఆ డబ్బులు వాడట్లేదు....

ఫర్నీచర్‌కు ఆ డబ్బులు వాడట్లేదు....

HT Telugu Desk HT Telugu
Apr 22, 2022 07:07 AM IST

ఫర్నీచర్‌ కొనుగోలు బాధ్యత దేవాలయాలకు అప్పగించిన వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తీవ్ర స్థాయిలో విమర్శలు రేగడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫర్నీచర్ కొనుగోలుకు దేవాలయాల సొమ్మును వినియోగించడంపై ఇచ్చిన ఆదేశాలు ఉపసంహరించుకుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AFP)

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన జిల్లా కార్యాలయాల్లో ఫర్నీచర్ అవసరమైంది. వాటి కొనుగోలు బాధ్యతను ఆలయాలపై మోపుతూ ఇచ్చిన ఉత్తర్వులపై విమర్శలు రేగాయి. ఫర్నీచర్ కొనుగోలుకు కామన్ గుడ్ ఫండ్ నిధుల్ని వినియోగించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 63లక్షలు ఖర్చు చేయాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్‌ వినియోగానికి అనుమతించింది. 

 

ప్రభుత్వ నిర్ణయంపై ఏపీలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. ధార్మిక సంఘాలు, హిందూ సంస్థలు ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో తప్పు పట్టాయి. మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్‌ కృష్ణారావుతో పాటు, పలువురు ప్రముఖులు ప్రభుత్వ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ డిజిపి అరవిందరావుతో పాటు, ఐవైఆర్ కృష్ణారావు ఇతరులు సభ్యులుగా ఉన్న శ్రీ భారతీ దేవాలయ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధమని వాటిని నిలుపుదల చేయాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఏప్రిల్ 15న ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఏపీలోని 18ప్రముఖ దేవాలయాల కామన్‌ గుడ్ ఫండ్ నుంచి 63లక్షల రుపాయలు వెచ్చించి ఫర్నీచర్‌ కొనుగోలు, రిపేర్లకు వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై అవుటుపల్లి ప్రసాద్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరపున వాదించిన ఫణిదూత్ చాణక్య కామన్ గుడ్ ఫండ్ దేవాలయాల నిర్వహణ, ఆధునీకీకరణ, వేద పాఠశాలలు, ఆధ్మాత్మిక కార్యక్రమాల కోసమే నిర్దేశించిందని కోర్టుకు ఫిర్యాదు చేశారు.

 

సిజిఎఫ్ నిధుల్ని వేరే అవసరాల కోసం మళ్లించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం పిటిషన్ విచారణకు రాగానే దేవాదాయ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఫర్నీచర్ కొనుగోలుకు సంబంధించిన నిధుల్ని ఇతర మార్గాలలో సమకూర్చుకోవాలని ఆదేశించినట్లు కోర్టుకు తెలిపారు. దీంతో పిటిషన్‌‌ను ముగిస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.

IPL_Entry_Point

టాపిక్