జగన్ మంత్రివర్గంలోని 24మంది రాజీనామా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్లోని 24మంది మంత్రులు గురువారం సాయంత్రం రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి జగన్కు తమ రాజీనామా లేఖలను అందించారు.

AP cabinet reshuffle | మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో భాగంగా.. ప్రస్తుతం కేబినెట్లో ఉన్న 24మంది మంత్రులు గురువారం రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎం వైఎస్ జగన్కు సమర్పించారు.
సచివాలయంలో గురువారం సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో జగన్ సైతం పాల్గొన్నారు. 36అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. భేటీ ముగిసిన వెంటనే.. 24మంది మంత్రులు రాజీనామా చేసేశారు.
కూర్పు ఎలా ఉండనుంది..?
మంత్రుల రాజీనామాతో మంత్రి వర్గ కూర్పు ఎలా ఉంటుందనే అంశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రధానంగా నలుగురు సీనియర్లను కొత్త మంత్రి వర్గంలో కొనసాగిస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో.. ఎవరికి వారు తమ పదవికి ఎలాంటి ఢోకా లేదని ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం రానున్న ఎన్నికలను ఎదుర్కోవడంతో పాటు సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. మంత్రి వర్గంలో రెడ్డి., కాపు సామాజిక వర్గాల నుంచి ఎక్కువ మంది ఉండటంతో వారి సంఖ్యను తగ్గిస్తారని తెలుస్తోంది. అదే సమయంలో దళితులకు అదనంగా మరో మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. ఇతర బీసీ సామాజిక వర్గాలకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. అయితే ముఖ్యమంత్రికి తప్ప కొత్త మంత్రులు ఎవరనే విషయంలో ఎవరికి సమాచారం లేకపోవడం గమనార్హం.
ప్రమాణ స్వీకారాలు ఎక్కడ..?
ఈ నెల 11 తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి వేదికను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2019 జూన్‌లో సచివాలయం వెలుపల ఉన్న ఖాళీ స్థలంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసారి కూడా అక్కడే నిర్వహించాలా, విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించాలా అనే దానిపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. తొలుత సచివాలయంలోని రెండో బ్లాక్ నుంచి అసెంబ్లీకి వెళ్లే మార్గంలోని ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేయాలని భావించారు. ఆ ప్రాంతంలో పార్కింగ్ ఇబ్బందుల దృష్ట్యా అసెంబ్లీ గేటు ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలంలోనే నిర్వహించాలన్న అంశంపై చర్చిస్తున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి మరో మూడు రోజుల సమయం ఉండటంతో గురువారం సాయంత్రంలోగా నిర్ణయం తీసుకోనున్నారు.
సంబంధిత కథనం
టాపిక్