Singareni Share: సింగరేణిలో ఏపీ వాటా తేల్చాలన్న ఏపీ బీజేపీ-ap bjp leaders want to settle andhra pradesh s stake in singareni coal mines ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Singareni Share: సింగరేణిలో ఏపీ వాటా తేల్చాలన్న ఏపీ బీజేపీ

Singareni Share: సింగరేణిలో ఏపీ వాటా తేల్చాలన్న ఏపీ బీజేపీ

HT Telugu Desk HT Telugu
Apr 14, 2023 11:58 AM IST

Singareni Share: స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాజకీయ లబ్ది కోసం బీజేపీ డ్రామాలు ఆడుతోందని, సింగరేణిలో ఆంధ్రా వాటాల సంగతి తేల్చాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బిఆర్‌ఎస్‌ స్టీల్ ప్లాంట్ అంశాన్ని వాడుకుంటోందని విమర్శిస్తున్నారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్

Singareni Share: విశాఖ పట్నం స్టీల్‌ప్లాంట్‌‌ను ఆదుకోడానికి కంటే ముందు సింగరేణిలో ఆంధ్రప్రదేశ్ వాటాల సంగతి తేల్చాలని ఏపీ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ స్టీల్‌ ప్లాంట్‌ అంశాన్ని రాజకీయంగా వినియోగించు కుంటోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్‌ ఆరోపించారు. సింగరేణి గనుల్లో ఆంధ్ర రాష్ట్రానికి వాటా ఉందని, ముందు ఆ వాటా తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌పై బీఆర్‌ఎస్‌కు అంత చిత్తశుద్ధి ఉంటే పోలవరానికి సహకరించాలని, స్టీల్‌ ప్లాంట్‌కు రూ.5 వేల కోట్లు నిధులు ఇచ్చేందుకు ముందుకు రావాలన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బొగ్గు గనులను కేటాయించాలని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తేను విశాఖ పట్నం నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్లాంట్‌ను లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు సహకరిస్తామని, గనుల కేటాయింపు విషయం ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్తామని కేంద్ర మంత్రి చెప్పారని విశాఖ ఎంపీ ఎంవివి తెలిపారు.

స్టీల్‌ ప్లాంట్‌ విషయంపై బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోందని, సింగరేణి గనుల నుంచి బొగ్గు సరఫరా చేస్తామని ముందుకు వస్తే ప్లాంట్‌ కొనటానికి వచ్చినట్లు ప్రచారం చేసుకోవటం దారుణమన్నారు. బీజేపీతో గొడవ ఉంటే వారితో నేరుగా తేల్చుకోవాలని, స్టీల్‌ ప్లాంట్‌ అంశాన్ని రాజకీయం చేయొద్దన్నారు.

మరోవైపు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే గురువారం ఉదయం ప్రకటించారు. ప్రైవేటీకరణ కంటే ముందు ఆర్‌ఐఎన్‌ఎల్‌ ను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పూర్తి సామర్థ్యం మేరకు ప్లాంట్‌ పనిచేసే ప్రక్రియపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. గనుల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ప్లాంటు సమస్యలపై ఆర్‌ఐఎన్‌ఎల్‌ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి ప్రకటనతో రాజకీయ పార్టీలు క్రెడిట్ దక్కించుకోడానికి పోటీలు పడ్డాయి.

తుస్సుమనిపించిన కేంద్ర మంత్రి…

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని తాను చెప్పలేదని, మరింత బలోపేతం చేస్తామని మాత్రమే చెప్పానని కేంద్ర మంత్రి ఫగన్‌సింగ్‌ కులస్తే సాయంత్రం ప్రకటించారు. ఉదయం చేసిన ప్రకటనపై మరింత క్లారిటీ ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు కేంద్ర మంత్రిని కోరారు.

ప్లాంట్‌ను మరింత బలోపేతం చేస్తామని మాత్రమే మీడియాకు చెప్పానని, స్టీల్‌ ప్లాంట్‌ లాభాల్లోకి వచ్చేలా సహకరిస్తామన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకొనే అంశం తన చేతుల్లో లేదని, కేంద్ర క్యాబినెట్నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో కార్మిక సంఘాల నేతలు కేంద్ర మంత్రితో సమావేశం నుంచి బయటకు వచ్చేశారు.

IPL_Entry_Point