Single Subject Graduation : ఇక ఒక సబ్జెక్టులోనే డిగ్రీ కోర్సులు….-andhra pradesh higher education department plans for single subject graduation courses ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Higher Education Department Plans For Single Subject Graduation Courses

Single Subject Graduation : ఇక ఒక సబ్జెక్టులోనే డిగ్రీ కోర్సులు….

HT Telugu Desk HT Telugu
Jan 27, 2023 06:51 AM IST

ఏపీలో నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే తమిళనాడులో కొన్ని యూనివర్శిటీలు అమలు చేస్తున్న తరహాలో సింగల్ సబ్జెక్ట్ డిగ్రీ కోర్సుల్ని ప్రవేశపెట్టాలని ఏపీ ఉన్నత విద్యా మండలి యోచిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో నూతన విద్యావిధానానికి అనుగుణంగా కొత్త కోర్సుల్ని అందుబాటులో తీసుకురానున్నారు.

ఏపీ ఉన్నత విద్యా మండలి
ఏపీ ఉన్నత విద్యా మండలి

ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ కోర్సులో బోధనలో కీలక మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న మూడు సబ్జెక్టుల విధానం స్థానంలో ఒక్క సబ్జెక్టులోనే విద్యార్ధుల్ని నిష్ణాతుల్ని చేసేందుకు కసరత్తు చేస్తోంది. అన్ని కలిసొస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన విధానంలో కోర్సుల్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ విధానంలో విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు.

ఏపీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సిలబస్‌‌లో సమూల మార్పులు చేసేందుకు ఉన్నత విద్యామండలి ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్శిటీల పరిధిలో డిగ్రీలో మూడు సబ్జెక్టుల విధానం ఉంది. దీని స్థానంలో ఒక సబ్జెక్టు విధానాన్ని డిగ్రీ కోర్సులకుతీసుకురావాలని భావిస్తోంది. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్పులు చేయాలని ఉన్నత విద్యా మండలి ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతం ఉన్న బిఏ, బీఎస్సీ కోర్సులలో ఏదైనా మూడు ప్రధాన సబ్జెక్టుల్ని విద్యార్ధులు చదవాల్సి ఉంటుంది. బిఎస్సీలో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు మూడేళ్ల పాటు చదవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థి, కొత్త విధానంలో ఏదో ఒక సబ్జెక్టు ఎంపిక చేసుకొని చదువుకోవచ్చు. అదే ప్రధాన సబ్జెక్టుగా ఉంటుంది. మైనర్‌ సబ్జెక్టులుగా నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

సింగల్ సబ్జెక్ట్‌ డిగ్రీ కోర్సుల్ని 60శాతం ఆఫ్‌లైన్‌లో, 40శాతం ఆన్‌లైన్‌లోనూ చదువుకునేలా కోర్సులను డిజైన్‌ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ మైనర్‌ డిగ్రీలు పూర్తి చేసే అవకాశం విద్యార్థికి ఉంటుంది. ప్రస్తుతం మూడు సబ్జెక్టులకు కలిపి 75 క్రెడిట్లు ఇస్తున్నారు. కొత్త దాంట్లో ఒక సబ్జెక్టుకు 25 క్రెడిట్లు ఇస్తారు. ఐచ్ఛికంగా విద్యార్థి ఎంపిక చేసుకునే రెండు సబ్జెక్టులకు 50 క్రెడిట్లు ఉంటాయి. క్రెడిట్ల విధానంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.

బీఎస్సీ సైన్స్ సబ్జెక్టుల్లో చేరే విద్యార్ధి వాటిని చదువుతూనే మైనర్ సబ్జెక్టులుగా ఆర్థిక శాస్త్రం, సంగీతం ఇలా తనకు నచ్చిన అంశాలను చదువుకోవచ్చు. వీటికి అదనంగా క్రెడిట్లు ఇస్తారు. విద్యార్థి వేర్వేరు సబ్జెక్టులపై అవగాహన కలిగి ఉండేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు.

ప్రస్తుతం అమలు చేస్తున్న నాలుగేళ్ల డిగ్రీలో విద్యార్థి ఎప్పుడైనా బయటకు వెళ్లిపోయే అవకాశం కల్పిస్తారు. మొదటి ఏడాది పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించి చదువు మానేస్తే సర్టిఫికెట్‌ ఇస్తారు. రెండేళ్లు చదివితే డిప్లొమా, మూడేళ్లు చదివితే డిగ్రీ, నాలుగేళ్లు చదివితే ఆనర్స్‌ డిగ్రీ ఇస్తారు. మొదటి లేదా రెండో ఏడాదిలో చదువు ఆపేసిన విద్యార్థి ఎప్పుడైనా మళ్లీ చదువుకోవాలనుకుంటే డిగ్రీలో చేరి చదువుకోవచ్చు.

ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ఉన్న విధానాన్ని డిగ్రీ కోర్సుల్లో కూడా ప్రవేశపెడుతున్నారు. విద్యార్థి మధ్యలో వెళ్లిపోయి తిరిగి చదువుకోవడానికి వస్తే ఎక్కడ చేర్చుకోవాలి, మధ్యలో వెళ్లి తిరిగి కోర్సుల్లో ప్రవేశించేందుకు నిర్ణీత గడువు ఎంత పెట్టాలనే దానిపై నిపుణులతో చర్చిస్తున్నారు. విద్యార్ధులు నిర్దిష్టంగా ఎన్నేళ్లలో కోర్సులు పూర్తి చేయాలనే దానిపై కూడా విధి విధానాలు ఖరారు చేయనున్నారు.

ఇప్పటికే డిగ్రీ కోర్సుల్లో అన్ని యూనివర్శిటీల పరిధిలో డ్యుయల్‌ డిగ్రీలు చదివే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని యూజీసీ ఆదేశించింది. ఒక డిగ్రీ స్థానంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వేర్వేరు డిగ్రీలను పూర్తి చేసేందుకు విద్యార్ధులకు అవకాశం కల్పించాలని యోచిస్తున్నారు. ఒకేసారి ఏక కాలంలో రెండు డిగ్రీలు పూర్తి చేసే విధానం ప్రవేశ పెట్టేందుకు కూడా ఉన్నత విద్యామండలి సమాలోచనలు జరుపుతోంది. ఈ విధానాన్ని ఎలా ప్రవేశ పెట్టాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

అన్ని కోర్సుల సిలబస్‌ రూపకల్పనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న నాలుగేళ్ల డిగ్రీలో మొదటి మూడు సెమిస్టర్లలో లైఫ్ స్కిల్స్‌, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు ఉన్నాయి. మొదటి, రెండు ఏడాదిల్లో రెండేసి నెలల చొప్పున, మూడో ఏడాదిలో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ విధానాన్ని తప్పనిసరి చేశారు. నాలుగో ఏడాది రీసెర్చ్‌తో పాటు విద్యార్థి చదివిన సబ్జెక్టులకు అనుగుణంగా కోర్సులను రూపొందిస్తున్నారు. ఆనర్స్ డిగ్రీలద్వారా విద్యార్ధులకు అయా సబ్జెక్టులపై పూర్తి స్థాయిలో పట్టు లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్