Govt Employees Issue : అది భావ ప్రకటన స్వేచ్ఛే…. ఉల్లంఘన కాదన్న హైకోర్టు…-andhra pradesh high court relief to ap government employees association for show cause notices ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh High Court Relief To Ap Government Employees Association For Show Cause Notices

Govt Employees Issue : అది భావ ప్రకటన స్వేచ్ఛే…. ఉల్లంఘన కాదన్న హైకోర్టు…

HT Telugu Desk HT Telugu
Feb 16, 2023 06:41 AM IST

Govt Employees Issue వేతనాలు సకాలంలో చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర గవర్నర్‌ను కోరడం భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందని హైకోర్టు తేల్చి చెప్పింది. గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఏపీ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పు పట్టింది.

ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Govt Employees Issue ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించేలా చూడాలని కోరుతూ గవర్నర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించడం, వేతనాల కోసం మీడియాతో మాట్లాడిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసివ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.

ట్రెండింగ్ వార్తలు

ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వడంపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ భావప్రకటన స్వేచ్ఛపై దాడిగా అభిప్రాయపడింది. ఉద్యోగ సంఘం గుర్తింపు రద్దు చేయాలని నిర్ణయించుకొని షోకాజ్‌ నోటీసిచ్చినట్లుందని వ్యాఖ్యానించింది. నోటీసివ్వడానికి కారణాలేంటో ప్రభుత్వం పేర్కొనలేదని తప్పు పట్టింది.

ఈ ఏడాది జనవరి 23న జారీ చేసిన షోకాజ్‌ నోటీసు అమలును హైకోర్టు నిలిపివేసింది.కోర్టు తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు.. ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని తేల్చి చెప్పింది. ఉద్యోగుల సంఘం దాఖలు చేసిన వ్యాజ్యంపై లోతైన విచారణ జరపాలని పేర్కొంది. ఈ వ్యవహారంపై మూడు వారాల్లో కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని, తర్వాత రెండు వారాల్లో రిప్లై దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. విచారణను మార్చి 23కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలిచ్చేలా చట్టం చేయాలని కోరుతూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గవర్నర్‌ను కలవడం, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన వ్యవహారంపై సంజాయిషీ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఇటీవల జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌, న్యాయవాది పీవీజీ ఉమేశ్‌ చంద్ర వాదనలు వినిపించారు.

వేతనాలు డిమాండ్‌ చేస్తే నోటీసులెందుకు….

'ఫైనాన్షియల్‌ కోడ్‌, 1990 ఏప్రిల్‌లో ఇచ్చిన జీవో ప్రకారం ప్రతి నెలా చివరి రోజు ప్రభుత్వోద్యోగులకు జీతాలు చెల్లించాల్సి ఉందని, ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వడం లేదని, ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్ము రూ.413 కోట్లను వారికి తెలియకుండానే వివిధ పథకాలకు మళ్లించిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర అధికారులకు వినతులిచ్చినా చర్యల్లేవని కోర్టుకు వివరించారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చివరి ప్రయత్నంగా గవర్నర్‌ను కలిసి విన్నవించినట్లు తెలిపారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసిచ్చిందని, వివరణ ఇవ్వకపోతే వారంలో సంఘం గుర్తింపును ఉపసంహరిస్తామని పేర్కొందని కోర్టుకు తెలిపారు. ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, షోకాజ్‌ నోటీసులోనూ కారణాలను పేర్కొనలేదన్నారు.

ఉద్యోగుల సంఘం గుర్తింపును ఉపసంహరించాలనే ఉద్దేశంతోనే నామమాత్రంగా నోటీసిచ్చారని, ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్మును ప్రభుత్వం తీసుకున్నా, సకాలంలో జీతాలు ఇవ్వకపోయినా ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడగకూడదనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నోటీసులపై చర్యలను నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు.

నోటీసుల్ని సవాలు చేయలేరన్న జీపీ…

రాష్ట్ర ప్రభుత్వ జిఏడి తరఫున గవర్నమెంట్‌ ప్లీడర్ మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణ అర్హత లేదన్నారు. షోకాజ్‌ నోటీసును సవాలు చేయడానికి వీల్లేదని, ప్రభుత్వ నోటీసులకు వివరణ ఇచ్చాక తగిన ఉత్తర్వులిస్తామన్నారు. గవర్నర్‌కు వినతి ఇస్తే తప్పులేదని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిపై మీడియాతో మాట్లాడటంపై అభ్యంతరం ఉందన్నారు. కొన్ని అంశాల్ని గోప్యంగా ఉంచాలన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ నోటీసులపై తదుపరి చర్యలు వద్దని ఆదేశించింది.

ఏప్రిల్ 1నుంచి సమ్మెకు దిగుతాం….

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌ రావు పేర్కొన్నారు. ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే వేతనాలు ఇచ్చేలా చట్టం తెచ్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. అవసరమైతే ఏప్రిల్‌ 1 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన సీపీఎస్‌ రద్దు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, ఒకటో తేదీన వేతనాల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగులకు రూ.14 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. వాటిని ఎప్పుడు చెల్లిస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

IPL_Entry_Point

టాపిక్