AP High Court On GO 1 : ఆ పిటిషన్‌పై ఎందుకంత తొందర…? సీజే ఆగ్రహం…-andhra pradesh high court chief justice raises questions on vacation bench orders on go no1 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh High Court Chief Justice Raises Questions On Vacation Bench Orders On Go No.1

AP High Court On GO 1 : ఆ పిటిషన్‌పై ఎందుకంత తొందర…? సీజే ఆగ్రహం…

HT Telugu Desk HT Telugu
Jan 24, 2023 07:05 AM IST

AP High Court On GO 1 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాకలు చేసిన పిటిషన్‌పై వెకేషన్ బెంచ్‌ అత్యవసర విచారణ చేపట్టడంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్రాంతి సెలవుల్లో అత్యవసర పిటిషన్‌‌గా విచారణ చేపట్టడంపై అభ్యంతరం తెలిపింది. న్యాయమూర్తి పరిధి దాటి వ్యవహరించారని, వెకేషన్ బెంచ్ వ్యవహరించిన తీరు సరికాదని తప్పు పట్టింది.

వెకేషన్ బెంచ్ వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం
వెకేషన్ బెంచ్ వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం

AP High Court On GO 1 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రోడ్లపై సభలు, సమావేశాలు నిర్వహించకుండా నిషేధిస్తూ జారీ చేసిన జీవో నంబర్‌1 వ్యవహారంపై ఏపీ హైకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంక్రాంతి సెలవుల్లో ఎలాంటి అంశాలపై విచారణ జరపాలనే విషయంలో హైకోర్టు ఇచ్చిన రోస్టర్ నోటిఫికేషన్‌కు విరుద్ధంగా సిపిఐ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపడంపై చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను అవమానించేలా వ్యవహరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

భవిష్యత్తులో ఇదే పద్ధతి కొనసాగిస్తే ప్రతి వెకేషన్ కోర్టు న్యాయమూర్తి డిఫ్యాక్టో చీఫ్‌ జస్టిస్‌లా తమకు తాము భావించి విచారణలు చేపడతారని, ఇలాంటి చర్యలు న్యాయ వ్యవస్థకు మంచిది కాదని తప్పు పట్టింది. ఇది తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదని, ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే సొంతమైన అధికారాల విషయాల్లో తాను నిక్కచ్చిగా వ్యవహరిస్తానని చీఫ్ జస్టిస్ ప్రకటించారు.

జీవో నంబర్ 1పై అత్యవసరంగా విచారణ జరపాల్సిందిగా వెకేషన్ బెంచ్‌ను కోరాల్సిన అవసరం ఏమొచ్చిందని పిటిషనర్‌ తరపు న్యాయవాది అశ్వనీకుమార్‌ను సీజే ప్రశ్నించారు. కొంత సమయం వేచి చూస్తే ఆకాశం ఊడి కింద పడిపోదు కదా అని నిలదీసింది. గందర గోళ పరిస్థితులు సృష్టించి, వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకువచ్చేందుకు కారకులయ్యారని పిటిషనర్ తరపు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత పది రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని గుర్తు చేశారు. జీవో నంబర్ 1పై సర్వోన్నత న్యాయస్థానంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతుందని తేల్చి చెప్పడంతో సోమవారం సీజే బెంచ్ ముందుకు విచారణ వచ్చింది. ఈ నేపథ్యంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తరపున అశ్వనీకుమార్‌, అడ్వకేట్ జనరల్ మధ్య హోరాహోరీగా వాదనలు జరిగాయి.

రాష్ట్ర హైకోర్టులో జీవో నంబర్1పై విచారణ జరుగుతుండటంతో టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర, కాంగ్రెస్ పార్టీ తరపున గిడుగు రుద్ర రాజు, బీజేపీ తరపున కన్నా లక్ష్మీనారాయణ దాకలు చేసిన వేర్వేరు వ్యాజ్యాలపై కూడా మంగళవారం విచారణ జరుపుతామని సీజే ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.

కేసు విచారణ సందర్భంగా సీజే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.1 ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించినదని, పూర్తిగా ప్రజా ప్రయోజనమైందని న్యాయస్థానం భావిస్తోందన్నారు. నడి రోడ్డుపై మీటింగ్‌ పెట్టడానికి ఎవరికీ హక్కు లేదని, ప్రభుత్వం ఏ బహిరంగ సభను అడ్డుకోలేదని, నడి రోడ్డు మీద కాదు, సౌకర్యమున్న చోట సభ పెట్టుకోమని చెప్పింది అని చీఫ్‌ జస్టిస్‌ గుర్తు చేశారు.

రోడ్‌షోల మీద, ర్యాలీల మీద సర్కార్‌ ఎలాంటి నిషేధం విధించలేదని, నడి రోడ్డు మీద భారీగా జనాన్ని సమీకరించవద్దని మాత్రమే చెప్పిందని, ప్రజా రక్షణకు సంబంధించి ప్రభుత్వానికే పూర్తి అధికారమని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు సీజే గుర్తు చేశారు.

దురుద్దేశాలతో పిటిషన్….

పిటిషన్‌ వేసిన వ్యక్తిలో దురుద్ధేశమేదో కనిపిస్తోందన్న హైకోర్టు సీజే.. ఎనిమిది మంది చనిపోయిన దుర్ఘటనపై విచారణ కమిటీ నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. జీవో నెంబర్‌ 1ని నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్‌కు సహేతుక కారణాలు లేవని, అలా చేయడమంటే ప్రజల హక్కులు కాలరాసినట్టేనని హైకోర్టు పిటిషనర్‌కు స్పష్టం చేసింది.

ప్రత్యేక సందర్భాల్లో విచారించొచ్చు….

పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ వాదనలు వినిపించారు. అడ్మినిస్ట్రేటివ్, విధాన పరమైన నిర్ణయాలపై వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టకూడదని హైకోర్టు పేర్కొన్నా, ప్రబుత్వం నిర్ణయాలు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉంటే వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టవచ్చన్నారు. జీవో 1 కార్యనిర్వాహణ వ్యవహారాలకు సంబంధించినదని వెకేషన్ బెంచ్ విచారించడంలో తప్పు లేదని వాదించారు.

ప్రభుత్వం జారీ చేసిన జీవో రాజకీయ పార్టీలు చేపట్టే సమావేశాలు, పాదయాత్రలు, ర్యాలీలు ఇతర కార్యక్రమాలను అడ్డుకునేలా ఉందని, తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేస్తోందన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వాలని జీవో పోలీసులను నిర్దేశిస్తోందని, జీవో అడ్డు పెట్టుకుని విపక్షాలకు అనుమతి నిరాకరిస్తారని వాదించారు. ప్రజలకు దూరంగా ఉండే మైదానాలు, సమావేశ మందిరాల్లో సభలు, సమావేశాలు పెట్టుకోవాలనడం సరికాదన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ సభలు, సమావేశాలు పెట్టుకోవడాన్ని నిషేధించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. అలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. జీవో నంబర్ 1 వ్యవహారంపై నేడు కూడా హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి.

IPL_Entry_Point