Swachh Survey : స్వచ్ఛ సర్వేక్షణ్ ఫలితాల్లో విశాఖ టాప్‌….బెడిసికొట్టిన ప్రయోగాలు-andhra pradesh cities got swachh survekshan awards ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Cities Got Swachh Survekshan Awards

Swachh Survey : స్వచ్ఛ సర్వేక్షణ్ ఫలితాల్లో విశాఖ టాప్‌….బెడిసికొట్టిన ప్రయోగాలు

HT Telugu Desk HT Telugu
Oct 02, 2022 11:03 AM IST

Swachh Survey స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో విశాఖకు 9వ స్థానం నుంచి నాలుగో ర్యాంకు చేరింది. విజయవాడ మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పరిమితం అయ్యింది. టాప్‌ 100 ర్యాంకుల్లో ఏపీలోని ఐదు నగరాలకు చోటు దక్కింది. పది లక్షల్లోపు జనాభా నగరాల్లో తిరుపతి మొదటి స్థానానికి చేరింది. రాజమండ్రి 41 నుంచి 91కు, కడప 51 నుంచి 93కు చేరింది. కర్నూలు 70 నుంచి 55కు, నెల్లూరు 60వ స్థానాన్ని దక్కించుకుంది.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు అందుకుంటున్న మంత్రి ఆదిమూలం సురేష్‌
స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు అందుకుంటున్న మంత్రి ఆదిమూలం సురేష్‌

జాతీయ స్థాయి స్వచ్ఛత నగరాల జాబితాలో విజయవాడ ఈ ఏడాది వెనుక బడింది. గతం కంటే రెండు ర్యాంకులు పడిపోయింది. మరోవైపు స్టేట్‌ క్యాపిటల్‌ విభాగంలో మాత్రం మొదటి వరుసలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గతేడాది స్వచ్ఛ నగరాల జాబితాలో విజయవాడ జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలవగా, ఈ సారి కచ్చితంగా 1, 2 స్థానాల్లో నిలుస్తుందని అధికారులు భావించినా, ఐదోస్థానానికి పరిమితమైంది.

సర్వీస్‌ లెవల్ ప్రోగ్రెస్‌కు 3వేల మార్కులు, సిటిజన్ వాయిస్‌ విభాగంలో 2250మార్కులు, ఓడిఎఫ్‌, ఓడిఎఫ్‌ ప్లస్‌, వాటర్ ప్లస్‌, చెత్త రహిత నగరాల జాబితాలో స్టార్ రేటింగ్‌ సర్టిఫికేషన్‌ మొత్తం 7500 మార్కులకు సర్వే నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 73లక్షల 95 వేల 680 మంది ఆన్‌లైన్‌లో ఫీడ్ బ్యాక్‌ సేకరించారు. 2701 మంది క్షేత్రస్థాయిలో పర్యటించి 17,030 వాణిజ్య ప్రాంతాలు, 24,744 నివాస ప్రాంతాలు, 16,501 చెత్త శుద్ధి కేంద్రాలు, 1496 రెమిడియేషన్‌ సైట్లను సందర్శించి క్షేత్ర స్థాయిలో తీసిన 22.26లక్షల ఫోటోలను విశ్లేషించి ర్యాంకుల్ని ఖరారు చేశారు.

లక్షకు పైబడిన నగరాల్లో విశాఖపట్నం 7500 మార్కులకు 6701 మార్కులతో నాలుగో స్థానంలో, 6699 మార్కులతో విజయవాడ 5 స్థానంలో, 6584 మార్కులతో తిరుపతి ఏడో స్థానంలో , 4810 మార్కులతో 75వ ర్యాంకుతో కర్నూలు, 4688 మార్కులతో 81వ స్థానంలో నెల్లూరు పట్టణాలు స్వచ్ఛభారత్‌ ర్యాంకుల్ని దక్కించుకున్నాయి.

జాతీయ స్థాయిలో స్థానిక సంస్థల విభాగంలో పెద్దనగరాల జాబితాలో 10నుంచి 40 లక్షల జనాభా కింద ఈసారి పలు నగరాలను అవార్డు కోసం ఎంపిక చేయగా, మధ్యస్థాయి నగరాల జాబితాలో, 3 నుంచి 10 లక్షల జనాభా విభాగంలో మరికొన్ని నగరాలు, పట్టణాలను చేర్చారు. స్టేట్‌ క్యాపిటల్‌ జాబితాలో మరికొన్ని నగరాలకు అవార్డులు ప్రకటించగా, విజయవాడ మొదటిస్థానంలో నిలిచింది.అంశాలవారీ స్కోరింగ్‌.. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుకు సంబంధించి మొత్తం వివిధ విభాగాల కింద 7,500 మార్కులు కేటాయించారు. అందులో విజయవాడ 6,699 మార్కులు మాత్రమే సాధించింది.

వాలంటీర్లకు టార్గెట్లు….

గత ఏడాది చెత్త రహిత శుభ్రమైన నగరంగా మూడో స్థానాన్ని దక్కించుకున్న విజయవాడకు వాటర్‌ ప్లస్‌ సిటీస్‌ క్యాటగిరీలో కూడా అవార్డులు దక్కాయి. చెత్తసేకరణ, నిర్వహణ, రిసైక్లింగ్, తడిపొడి చెత్తల వేర్వేరు సేకరణ, నిర్మాణ వ్యర్థాల వినియోగంలలో నగరానికి మంచి ఫీడ్ బ్యాక్ లభించింది. కొన్నేళ్లుగా నంబర్‌ వన్ స్థానాన్ని దక్కించుకునేందుకు విజయవాడ తీవ్రంగా శ్రమిస్తోంది. అందుకే ఈసారి స్వచ్ఛ్‌ భారత్‌ అవార్డుల్లో నంబర్ వన్‌ స్థానం పొందడానికి ఓ ప్లాన్ వేశారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు అదనంగా పాయింట్లు పొందేందుకు ఉద్యోగులు, వాలంటీర్లకు టార్గెట్లు పెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి గ్రామంలో, పట్టణాల్లో ప్రతి వార్డులో క్లస్టర్ల వారీగా వాలంటీర్ల ద్వారా పౌరసేవలు అందిస్తున్నారు. ఇప్పుడు స్వచ్ఛ్ సర్వేక్షణ్‌ బాధ్యతల్ని కూడా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు వాలంటీర్లకు అప్పగించారు. ప్రతి వాలంటీర్‌ తన పరిధిలో ఉన్న కుటుంబాల తరపున సర్వే పూర్తి చేసేస్తున్నారు. వాలంటీర్ల వద్ద తన పరిధిలో ఉండే కుటుంబాల మొబైల్ ఫోన్ నంబర్లు ఉండటంతో వాటి ద్వారా సర్వే పూర్తి చేస్తున్నారు. మొబైల్‌ రిజిస్టర్‌ చేసి ఆ ఫోన్లకు వచ్చే ఓటీపీలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇలా కనీసం 100మంది తరపున సర్వే పూర్తి చేయాలని ఒక్కోక్కరికి టార్గెట్ పెట్టారు.

ప్రచారం ఎక్కువ ఫలితం తక్కువ...

స్వచ్ఛ్‌ భారత్‌ ద్వారా ప్రజోపయోగ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నా వాటి ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. విజయవాడ వంటి నగరాల్లో పబ్లిక్‌ టాయిలెట్లు పేరుకే ఉంటున్నాయి. నిర్వహణాలోపాలు ఎక్కువగా ఉంటున్నాయి. అయినా సర్వేలలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం విజయవాడ మునిసిపల్ కమిషనర్‌గా నివాస్ ఉన్న సమయంలో సర్వేలో పాల్గొనేందుకు కన్సల్టెంట్లకు బాధ్యతలు అప్పగించారని వార్తలు రావడంతో విజయవాడ నగరాన్ని ర్యాంకుల నుంచి మినహాయించారు. ఆ తర్వాత మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు వాలంటీర్లే ప్రజల తరపున సర్వేలు పూర్తి చేసే బాధ్యత అప్పగించారు.

స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్రమాల కోసం కేంద్రం భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. కేంద్ర బృందాలు పర్యటించే సమయంలో ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పెద్ద ఎత్తున హోర్డింగులు, ప్రచార కార్యక్రమాలు కనిపించేలా ఏర్పాట్లు చేస్తారు. ఆ బృందాలు నగరాల్లో పర్యటించకుండానే ఈ హంగామా చూసి బాగా పనిచేస్తున్నాయనుకుని వెనుదిరిగిపోతాయి. మొత్తంమ్మీద ఏపీలో స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ అవార్డుల కోసం నగరపాలక సంస్థలు పడుతున్న పాట్లు ప్రచారాలకు పనికొస్తున్నాయి.ఈ ఏడాది విశాఖకు ర్యాంకు రావడానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

IPL_Entry_Point

టాపిక్