Jagadeesh Reddy:కాంగ్రెస్ పాలనపై భ్రమలు తొలగిపోయాయి,ఈసారి బీఆర్ఎస్ దే గెలుపు- హెచ్.టి తెలుగుతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి-suryapet ex minister brs mla jagadeesh reddy says brs got 16 seats in lok sabha elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Jagadeesh Reddy:కాంగ్రెస్ పాలనపై భ్రమలు తొలగిపోయాయి,ఈసారి బీఆర్ఎస్ దే గెలుపు- హెచ్.టి తెలుగుతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

Jagadeesh Reddy:కాంగ్రెస్ పాలనపై భ్రమలు తొలగిపోయాయి,ఈసారి బీఆర్ఎస్ దే గెలుపు- హెచ్.టి తెలుగుతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
May 01, 2024 04:08 PM IST

Ex Minister Jagadeesh Reddy : కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు, అలవికాని హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజస్వరూపం అయిదు నెలల్లోనే ప్రజలకు అర్థమైందని విమర్శించారు.

హెచ్.టి తెలుగుతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
హెచ్.టి తెలుగుతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

Ex Minister Jagadeesh Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకున్న బీఆర్ఎస్(BRS)... లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో పార్టీ శ్రేణులు ఉత్సాహం నింపుతున్నారు. కేసీఆర్(KCR) శైలి ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర, రాష్ట్రంలో సమకాలీన పరిస్థితులపై మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హెచ్.టి.తెలుగుతో మాట్లాడారు.

‘‘కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు.. అలవి కాని హామీలతో ప్రజలు మోసపోయారు. ఈ ఒక్కసారి చూద్దామని కేసీఆర్(KCR) ను దూరం చేసుకున్నారు. మేం కేవలం స్వల్ప ఓట్ల తేడాతో మాత్రమే ప్రభుత్వం నుంచి దిగిపోయాం. అది కేవలం 1.5 శాతం తేడా. కానీ, దాదాపు అయిదు నెలల కాలంలోనే ప్రజలకు కాంగ్రెస్ మీద భ్రమలు తొలిగిపోయాయి. లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) రాష్ట్రంలోని 17 స్థానాల్లో 16 చోట్ల బీఆర్ఎస్ కచ్చితంగా మొదటి స్థానంలో లేదంటే.. రెండో స్థానంలో ఉంటుంది. అత్యధిక స్థానాలు మేమే గెలుచుకుంటాం’’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి ‘ హిందూస్తాన్ టైమ్స్ తెలుగుతో పేర్కొన్నారు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని సోలిపేట, మున్సిపాలిటీ పరిధిలోని 29, 30వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. వివిధ దుకాణదారులు, చిరు వ్యాపారులను వారి షాపులకు వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు అడిగారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి, నల్గొండ లోక్ సభ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు చూస్తున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadeesh Reddy)తో సాగిన HT TELUGU ఇంటర్వ్యూ విశేషాలివి.

కాంగ్రెస్ వి మోసపూరిత హామీలు

'తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక రెండు పర్యాయాలు ఈ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ను అక్కున చేర్చుకున్నారు. కానీ, ఈ సారి కాంగ్రెస్(Congress) చేసిన మోసపూరిత హామీల వల్ల ప్రజలు కేసీఆర్ ను దూరం చేసుకున్నారు. నిండా అయిదు నెలల పదవీ కాలం పూర్తి కాకముందే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో భ్రమలు తొలిగిపోయాయి. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో.. పైసా ఖర్చులేని మహిళలకు ఆర్టీసీ బస్సు(RTC Bus Free journey)ల్లో ఉచిత ప్రయాణం మినహా మిగిలిన వాటిని విస్మరించారు. రైతులకు రైతు బంధు లేదు, రుణ మాఫీ లేదు.. పెన్షన్ల మొత్తాన్ని పెంచి ఇచ్చింది లేదు. ఒక్కటంటే ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. అలవికాని 420 హామీలు.. కాంగ్రెస్ పాలన వైఫల్యాలే మా ప్రచార అస్త్రాలు. మా పార్లమెంటు అభ్యర్థుల విజయం కోసం చేస్తున్న ప్రచారంలో ఆ అంశాలనే ప్రజలకు వివరిస్తున్నాం' అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

సాగర్ లో నీరున్నా ఆకట్టును ఎండబెట్టారు

'నాగార్జున సాగర్ (Nagarjuna Sagar)లో నీరున్నా.. ఆయకట్టును ఎండబెట్టారు. కాళేశ్వరంలో నీరున్నా బీఆర్ఎస్ ను దోషిగా చూపెట్టాలని ఉద్దేశపూర్వక కరవును తెచ్చారు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రైతులు వేలాది బోర్లు తవ్వుకోవాల్సి వచ్చింది. కష్టాలు పడి పండించిన ధాన్యం కల్లాల్లో రాశులుగా పేరుకుపోయాయి. ధాన్యం కొనుగోళ్లు(Paddy Procurement) లేవు.. ధాన్యానికి బోనస్ చెల్లింపులు లేవు.. రైతు బంధు రాక, ప్రైవేటు అప్పులు తెచ్చుకున్నారు.. రైతన్నల, నేతన్నల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నాగార్జున సాగర్ ఆయకట్టును, రైతులను ఆదుకున్నాం. కాంగ్రెస్ మంత్రులకు దోచుకోవడం, దాచుకోవడం మినహా మరేమీ కనిపించడం లేదు. ఈ కరవు పరిస్థితులు, రైతుల అవస్థలు, నాగార్జున సాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించే ప్రయత్నాలు చేయడం వల్లే మాజీ సీఎం కేసీఆర్(KCR) నల్గొండ జిల్లాలో బహిరంగ సభ పెట్టారు. లోక్ సభ ఎన్నికల్లో బస్సు యాత్ర కూడా మిర్యాలగూడెం నుంచే అందుకే మొదలు పెట్టారు. రైతులకు మేం అండగా ఉంటాం' - జగదీష్ రెడ్డి

రాష్ర్టంలో 16 స్థానాల్లో ముందుంటాం

"తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో(Lok Sabha Constituencies) 16 చోట్ల మేమే ముందుంటాం. అత్యధిక స్థానాలు గెలుచుకుంటాం. మెజారిటీ స్థానాల్లో మొదటి స్థానంలో ఉంటాం. కొన్ని చోట్ల వెనకబడినా రెండో స్థానంలో కూడా మేమే ఉంటాం. ఉమ్మడి నల్లగొండ(Nalgonda) జిల్లాలోని రెండు స్థానాలు భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లను కచ్చితంగా గెలుచుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, తనను ప్రజలు నమ్మడం లేదని అర్థమయ్యాకే దేవుడి మీద ఒట్టు అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. రుణమాఫీకి వాయిదాల మీద వాయిదాలు పెడుతున్నారు. ప్రజలెలా విశ్వసించాలి? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు కొంత లయ తప్పడం వల్ల ప్రభుత్వం మారింది కానీ, ఈ సారి అలా కాదు. కేంద్రం నుంచి బీజేపీ(BJP) నుంచి తరుముకొస్తున్న ముప్పును అడ్డుకోవాలంటే కేసీఆర్ చేతులకు మనం బలం ఇవ్వాల్సి ఉంటుంది. ఓటర్లకు అదే వివరిస్తున్నాం. ఎన్ని ఎంపీ సీట్లు బీఆర్ఎస్(BRS) కు ఇస్తే.. అంతగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడగలుగుతాం. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలనే ప్రచారస్త్రాలుగా ప్రజల్లోకి వెళుతున్నాం" అని హెచ్.టి.తెలుగుతో అన్నారు.

(రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, HT TELUGU నల్గొండ )

WhatsApp channel

సంబంధిత కథనం