Glass Symbol Issue: స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టులో టీడీపీ పిటిషన్, జనసేనకే రిజర్వ్ చేయలేమన్న ఈసీ-tdps petition in high court on glass symbol for independents ec says cannot reserve ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Glass Symbol Issue: స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టులో టీడీపీ పిటిషన్, జనసేనకే రిజర్వ్ చేయలేమన్న ఈసీ

Glass Symbol Issue: స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టులో టీడీపీ పిటిషన్, జనసేనకే రిజర్వ్ చేయలేమన్న ఈసీ

Sarath chandra.B HT Telugu
May 02, 2024 12:37 PM IST

Glass Symbol Issue: సార్వత్రిక ఎన్నికల వేళ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తింపు వ్యవహారం కూటమి పార్టీలను కలవర పెడుతోంది. గాజు గ్లాస్ గుర్తును జనసేనకు రిజర్వు చేయలేమని గురువారం ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టు తెలిపింది.

జనసేనకే గాజు గ్లాస్ గుర్తు  రిజర్వ్ చేయలేమన్న ఈసీ
జనసేనకే గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేయలేమన్న ఈసీ

Glass Symbol Issue: గాజు గ్లాసు గుర్తును జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నా పార్లమెంటు స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాలు, ఆ పార్టీ పోటీ చేసే 21 అసెంబ్లీ సీట్లకు మాత్రమే పరిమితం చేయడంపై టీడీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. జనసేన-టీడీపీ-బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయని, మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరినందున గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించవద్దని కోరుతూ టీడీపీ నాయకుడు వర్ల రామయ్య హైకోర్టును ఆశ్రయించారు.

టీడీపీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు ఈసీ అభ్యంతరం తెలిపింది. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది అవినాష్ దేశాయ్‌ చెప్పారు. ఎన్నికల్లో కూటముల పోటీకి ఎలాంటి గుర్తింపు లేదని, సీట్ల సర్దుబాటు పేరుతో మిన‍హాయింపు సాధ్యపడదన్నారు.

టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్న ఎన్నికల సంఘం, ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున వాటిని అనుమతించ వద్దని విజ్ఞప్తి చేవారు. రాష్ట్ర వ్యాప్తంగా గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి రిజర్వు చేయలేమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.

ఇలాంటి పిటిషన్లను అనుమతిస్తే ఎన్నికలు జరిగే వరకు ఇదే తరహాలో విజ్ఞప్తులు, పిటిషన్లు దాఖలు అవుతూనే ఉంటాయని ఈసీ హైకోర్టు తెలిపింది. దీంతో గాజుగ్లాసు గుర్తు విషయంలో కూటమి పార్టీలకు ఇక్కట్లు తప్పేట్టు లేవు.

జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న రెండు పార్లమెంటు పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటయించదని ఎన్నికల సంఘం వివరించింది. పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజక వర్గాలకు కూడా గాజు గ్లాసు నుంచి మినహాయింపు ఇచ్చామని కోర్టుకు తెలిపారు. దీంతో పాటు జనసేన పోటీ చేస్తున్న 21 నియోజక వర్గాల్లో ఉమ్మడి సింబల్ కేటాయించామని చెప్పారు.

ఈసీ అభ్యంతరాల నేపథ్యంలో టీడీపీ- బీజేపీ - జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయని, అన్ని నియోజక వర్గాల్లో గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించవద్దని విజ్ఞప్తి చేశారు. గాజు గ్లాసు ఫ్రీ సింబల్‌లో ఉందని, ఆ పార్టీ అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఇలా అనుమతిస్తే గుర్తింపు పొందిన పార్టీలన్ని ఇలాగే కోరుతాయన్నారు.

ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పత్రాలను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపేసినందున వాటిని మార్చే అవకాశాలు లేవని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది స్పష్టం చేశారు. దేశంలో ఎన్నికల్లో పోటీ చేసే కూటములకు చట్టబద్దత లేదని, వాటి ఫిర్యాదులతో నిబంధనలు మార్చే అవకాశం లేదని కోర్టుకు స్పష్టం చేశారు.

జనసేన అభ్యంతరాలను తాము ఇప్పటికే పరిష్కరించామన్నారు. పార్టీ గుర్తుల కేటాయింపు కూడా పూర్తైందని ఈసీ తరపు న్యాయవాది కోర్టు వివరించారు. ఎంతమందికి గాజు గ్లాసు గుర్తును కేటాయించారని న్యాయస్థానం ఈసీని ప్రశ్నించడంతో సాయంత్రంలోగా వివరాలు సమర్పిస్తామని, లేదంటే శుక్రవారంలోపు అందిస్తామని ఈసీ కోర్టుకు తెలిపింది.

ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో సీట్ల కేటాయింపు పూర్తైంది. రాష్ట్రంలో 62 అసెంబ్లీ స్థానాలు, ఐదు పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. వారికి వేరే గుర్తులు కేటాయించాలని టీడీపీ కోర్టును అభ్యర్థించింది. ఈసీ మాత్రం ఇప్పటికే వివాదాన్ని పరిష్కరించామని, గాజు గ్లాసు విషయంలో మరిన్ని చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈసీ వాదలను పరిగణలోకి తీసుకుంటే గాజు గ్లాసు గుర్తుతో టీడీపీ ఓట్లకు భారీగా గండి పడుతుందనే ఆందోళన ఆ పార్టీలో ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం