Ronaldo on rift in portugal team: పోర్చుగల్‌ టీమ్‌ చీలిపోయిందా.. కెప్టెన్‌ రొనాల్డో సమాధానమిదీ-ronaldo on rift in portugal team says no one can break the team from outside ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ronaldo On Rift In Portugal Team: పోర్చుగల్‌ టీమ్‌ చీలిపోయిందా.. కెప్టెన్‌ రొనాల్డో సమాధానమిదీ

Ronaldo on rift in portugal team: పోర్చుగల్‌ టీమ్‌ చీలిపోయిందా.. కెప్టెన్‌ రొనాల్డో సమాధానమిదీ

Hari Prasad S HT Telugu
Dec 08, 2022 08:40 PM IST

Ronaldo on rift in portugal team: పోర్చుగల్‌ టీమ్‌ చీలిపోయిందా? ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వార్తలపై ఆ టీమ్‌ కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డో స్పందించాడు.

క్రిస్టియానో రొనాల్డో
క్రిస్టియానో రొనాల్డో (AFP)

Ronaldo on rift in portugal team: ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ టీమ్‌ ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్‌ చేరింది. అయితే ఆ వార్త కంటే కూడా పోర్చుగల్‌ టీమ్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న వార్తలు హాట్‌ టాపిక్‌గా మారాయి. కోచ్‌ ఫెర్నాండో శాంటోస్‌, కెప్టెన్‌ రొనాల్డో మధ్య విభేదాలు ఉన్నాయని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

అయితే వీటిపై తాజాగా రొనాల్డో స్పందించాడు. గురువారం (డిసెంబర్‌ 8) ట్విటర్‌ ద్వారా అతడు ఈ పుకార్లను ఖండించాడు. పోర్చుగల్‌ టీమ్‌ను చీల్చాలని బయటి నుంచి ఎవరూ చూసినా అది సాధ్యం కాదని స్పష్టం చేశాడు. "బయటి శక్తులు దాదాపు విచ్ఛిన్నం చేసినంత పని చేసిన గ్రూప్‌ ఇది. ఎలాంటి ప్రత్యర్థిని చూసైనా భయపడని ఎంతో ధైర్యం గల దేశం. టీమ్‌ అనే పదానికి అసలైన అర్థం. చివరి వరకూ తమ కలను నెరవేర్చుకోవడానికి పోరాడే టీమ్‌. మమ్మల్ని విశ్వసించండి" అని రొనాల్డో ట్విటర్‌లో రాశాడు.

సౌత్‌ కొరియాతో మ్యాచ్‌లో రొనాల్డో తీరుతో అతన్ని తర్వాత జరిగిన స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌కు పక్కన పెట్టారు. దీంతో కోచ్‌, కెప్టెన్‌ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని మ్యాచ్ తర్వాత కోచ్‌ శాంటోస్‌ను ప్రశ్నించగా.. ఈ విషయాన్ని అంతర్గతంగా పరిష్కరించుకున్నట్లు చెప్పాడు. అయితే రొనాల్డో వరల్డ్‌కప్‌ను మధ్యలోనే వదిలేసి వెళ్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

దీనిపై పోర్చుగల్‌ ఫుట్‌బాల్ అసోసియేషన్‌ స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చింది. ఈ మధ్యే రొనాల్డో.. మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌ నుంచి కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రెండేళ్ల కాంట్రాక్ట్‌ను యునైటెడ్‌ క్లబ్‌ ముందుగానే రద్దు చేసుకుంది.

ఫిఫా వరల్డ్‌కప్‌ క్వార్టర్‌ఫైనల్స్‌లో మొరాకాతో పోర్చుగల్‌ తలపడనుంది. స్విట్జర్లాండ్‌ను 6-1తో చిత్తుగా ఓడించి ఊపు మీదున్న పోర్చుగల్‌ టీమ్‌.. క్వార్టర్స్‌లోనూ అదే ఫామ్‌ కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు మొరాకో కూడా స్పెయిన్‌ను పెనాల్టీల్లో 3-0తో ఓడించి క్వార్టర్స్‌ చేరింది.

WhatsApp channel