Ravi Shastri on Virat Kohli: కోహ్లితో ఆస్ట్రేలియాకు కష్టమే: రవిశాస్త్రి
Ravi Shastri on Virat Kohli: కోహ్లితో ఆస్ట్రేలియాకు కష్టమే అని అన్నాడు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు అతడు ఆస్ట్రేలియాకు హెచ్చరికలు జారీ చేశాడు.
Ravi Shastri on Virat Kohli: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురువారం (ఫిబ్రవరి 9) నుంచి ప్రారంభం కాబోతోంది. ఈసారి ఇండియాలో జరుగుతున్న ఈ సిరీస్ ఎవరు గెలుస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. పిచ్ లు ఎలా ఉంటాయి? ఎవరితో ఎవరు పోటీ? ఇండియాలో ఆస్ట్రేలియా రికార్డులేంటి? అన్న విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
అయితే ఈ సిరీస్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లితో ఆస్ట్రేలియాకు కష్టమే అంటున్నాడు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి. అతడు ఆస్ట్రేలియా టీమ్ పై చెలరేగుతాడని, ఒక్కసారి అతనికి మంచి ఆరంభం లభిస్తే మాత్రం కోహ్లిని ఆపడం ఆసీస్ కు అంత సులువు కాదని చెప్పాడు.
"ఆస్ట్రేలియాపై కోహ్లి రికార్డు అద్భుతంగా ఉంది. మంచి ఫామ్ లో ఉన్నాడు. మంచి ఆరంభం కోసం చూస్తున్నాడు. అతని తొలి రెండు ఇన్నింగ్స్ చూడాలి. ఒకవేళ మంచి ఆరంభం లభిస్తే మాత్రం ఆస్ట్రేలియాకు ఇక కష్టమే. అది కచ్చితంగా జరగకూడదని ఆ టీమ్ భావిస్తుంటుంది. ఆస్ట్రేలియాపై కోహ్లికి సుమారు 50 సగటు ఉంది. అది అద్భుతమైన రికార్డు" అని స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ రవిశాస్త్రి అన్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-0తో ఇండియా గెలుస్తుందని కూడా ఇప్పటికే అతడు అంచనా వేసిన విషయం తెలిసిందే. అంతేకాదు తొలి రోజు నుంచి టర్న్ అయ్యే పిచ్ లు తయారు చేయాలనీ సూచించాడు. ఇక విరాట్ కోహ్లి విషయానికి వస్తే అతడు గతేడాది సెప్టెంబర్ నుంచి 4 సెంచరీలు బాదాడు. అయితే టెస్టుల్లో మాత్రం 2019 తర్వాత మరో సెంచరీ చేయలేకపోయాడు.
ఇప్పుడు స్వదేశంలో జరగబోయే ఈ సిరీస్ కోహ్లికి మంచి అవకాశం. టెస్టుల్లోనూ మునుపటి ఫామ్ అందుకోవడానికి విరాట్ ఉవ్విళ్లూరుతున్నాడు. విరాట్ టీమిండియా తరఫున 104 టెస్టుల్లో 8119 రన్స్ చేశాడు. అందులో 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.