Better than Virat Kohli: విరాట్ కంటే నేనే బెటర్.. నా రికార్డులే ఎక్కువ.. పాక్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్-pakistan cricketer khurram manzoor says he is world no 1 in odi cricket better than kohli ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Pakistan Cricketer Khurram Manzoor Says He Is World No 1 In Odi Cricket Better Than Kohli

Better than Virat Kohli: విరాట్ కంటే నేనే బెటర్.. నా రికార్డులే ఎక్కువ.. పాక్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

Maragani Govardhan HT Telugu
Jan 25, 2023 08:56 AM IST

Better than Virat Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కంటే తన రికార్డులే ఎక్కువగా ఉన్నాయని పాకిస్థాన్ క్రికెటర్ ఖుర్రం స్పష్టం చేశాడు. 50 ఓవర్ల క్రికెట్‌లో తానే నెంబర్ వన్ అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ

Better than Virat Kohli: వరల్డ్ క్రికెట్‌ను శాసించే వారు ప్రతి తరానికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉంటారు. తమ బ్యాటింగ్ లేదా బౌలింగ్ రికార్డులతో ప్రపంచంలోని ప్రతి ఆటగాడికి నిర్దిష్ట ప్రమాణాన్ని నెలకొల్పుతారు. ఆ విధంగా రెండు శతాబ్దాల క్రికెట్‌ చరిత్రను చూసుకుంటే డాన్‌బ్రాడ్‌మన్, వివ్ రిచర్డ్స్, సునీల్ గవాస్కర్, సచిన్ తెందూల్కర్, షేన్ వార్న్ లాంటి దిగ్గజాలను ప్రపంచం చూసింది. సమకాలీనుల్లో ఆ దిశగా విరాట్ కోహ్లీ ప్రయాణిస్తున్నాడు. దిగ్గజాల సరసన నిలిచేందుకు అతడు నమోదు చేస్తున్న గణాంకాలను చూస్తేనే తెలుస్తోంది కోహ్లీ ప్రతిభ ఏంటో. అలాంటి కోహ్లీ కంటే కూడా తాను మెరుగైన ఆటగాడనంటూ పాకిస్థాన్ క్రికెటర్ ఒకరు స్పష్టం చేశాడు. లిస్ట్-ఏ కెరీర్‌లో కోహ్లీ కంటే మెరుగ్గా ఆడనని, కానీ సెలక్టర్లు పదే పదే తనను విస్మరించారని తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు

ఇంతకీ ఆ పాక్ క్రికెటర్ పేరు ఖుర్రం మంజూర్. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 2008లో పాకిస్థాన్ తరఫున అరంగేట్రం చేశాడు. దాయాది జట్టు తరఫున 26 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 16 టెస్టులు ఉండగా.. ఏడు వన్డేలు, మూడు టీ20లు ఉన్నాయి. ఈ మూడు టీ20ల్లో ఓ మ్యాచ్‌లో కోహ్లీ, ఖుర్రం ఇద్దరూ ఆడారు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ.. అతడిని 10 పరుగుల వద్ద అద్భుతమైన రనౌట్ చేశాడు.

"నేను విరాట్ కోహ్లీతో పోల్చుకోవట్లేదు. వాస్తవాలు మాత్రమే చెబుతున్నా. 50 ఓవర్ల క్రికెట్‌లో టాప్-10 ఎవ్వరున్నా కానీ ప్రపంచ నెంబర్ వన్‌ను మాత్రం నేనే. నా తర్వాత కోహ్లీ ఉంటాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అతడికంటే మెరుగైన గణాంకాలు నాకున్నాయి. అతడు ప్రతి ఆరు ఇన్నింగ్స్‌కు ఓ సెంచరీ చేశాడు. కానీ నేను ప్రతి 5.68 ఇన్నింగ్స్‌కే శతకం నమోదు చేశాను. గత పదేళ్లుగా నా సగటు 53గా ఉంది. అలాగే లిస్ట్-ఏ క్రికెట్‌లో ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉన్నా. 2015 నుంచి ఇప్పటి వరకు గత 48 ఇన్నింగ్స్‌లో 24 సెంచరీలు చేశాను. పాకిస్థాన్ తరఫున ఎవరూ ఓపెనింగ్ చేసినా ఇప్పటికీ నాదే లీడింగ్ స్కోరు. నేషనల్ టీ20లో టాప్ స్కోరు చేశాను, అలాగే సెంచరీ సాధించాను. అయినా నన్ను పక్కన పెట్టారు. ఇలా ఎందుకు చేశారో నాకు ఒక్కరు కూడా బలమైన కారణం ఇవ్వలేదు" అని ఖుర్రం అన్నాడు.

లిస్ట్-ఏ క్రికెట్‌లో ఖుర్రం 166 మ్యాచ్‌ల్లో 7992 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు ఉన్నాయి. ప్రతి 6.11 ఇన్నింగ్స్‌కు ఓ శతకం నమోదు చేశాడు. అతడి సగటు వచ్చేసి 53.42గా ఉంది. ప్రస్తుతం లిస్ట్-ఏ క్రికెటర్లలో ప్రపంచంలోనే ఆరో స్థానంలో ఉన్నాడు. మరోపక్క విరాట్ కోహ్లీ 294 ఇన్నింగ్స్‌లో 14215 పరుగులు చేశాడు. ఇందులో 50 శతకాలు ఉన్నాయి. ప్రతి 5.88 ఇన్నింగ్స్‌కు ఓ సెంచరీ చొప్పున కోహ్లీ చేశాడు.

WhatsApp channel

సంబంధిత కథనం