T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌ కోసం.. ఆ మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌ మళ్లీ టీమిండియాలోకి-paddy upton returns to indian team ahead of t20 world cup ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Paddy Upton Returns To Indian Team Ahead Of T20 World Cup

T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌ కోసం.. ఆ మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌ మళ్లీ టీమిండియాలోకి

Hari Prasad S HT Telugu
Jul 26, 2022 06:12 PM IST

T20 World Cup: అతడు 2011లో ఇండియాకు వరల్డ్‌కప్‌ అందించిన సపోర్ట్‌ స్టాఫ్‌లో ఒకడు. ఇప్పుడు మరోసారి టీ20 వరల్డ్‌కప్‌ రానున్న నేపథ్యంలో అతన్ని టీమ్‌లోకి తీసుకున్నారు.

హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తో మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ అప్టాన్
హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తో మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ అప్టాన్ (Twitter)

న్యూఢిల్లీ: మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌ పాడీ అప్టాన్‌ మళ్లీ టీమిండియా సపోర్ట్‌ స్టాఫ్‌లోకి వచ్చాడు. 2011లో ధోనీ కెప్టెన్సీలోని ఇండియన్‌ టీమ్‌ వరల్డ్‌ కప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు ఈ అప్టాన్‌. దీంతో ఈ ఏడాది అక్టోబర్‌, నవంబర్‌లలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ కోసం అతన్ని మళ్లీ తీసుకొచ్చారు. వెస్టిండీస్‌లో ఉన్న టీమ్‌తో అతడు చేరతాడని, టీ20 వరల్డ్‌కప్‌ వరకూ టీమ్‌తోనే ఉంటాడని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పటి హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో అప్టాన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ కోచ్‌లుగా చాలాసార్లు కలిసి పని చేశారు. అప్టాన్‌ తొలిసారి గ్యారీ కిర్‌స్టన్‌ కోచ్‌గా ఉన్న సమయంలో సపోర్ట్‌ స్టాఫ్‌లోకి వచ్చినప్పుడు ద్రవిడ్‌ టీమ్‌లో ప్లేయర్‌గా ఉన్నాడు. ఈ ఇద్దరూ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ (ఇప్పటి క్యాపిటల్స్‌) టీమ్స్‌కు కలిసి పని చేశారు.

చాలా రోజులుగా హెడ్‌ కోచ్‌లుగా ఉన్న వాళ్లు ప్లేయర్స్‌ మానసికంగా కూడా దృఢంగా ఉండటానికి ఇలా మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌లను తీసుకొచ్చారు. ముఖ్యంగా వరల్డ్‌కప్‌లాంటి టోర్నీల్లో ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. దానిని అధిగమించడానికి ఇలాంటి కోచ్‌ల సాయం అవసరం అవుతుంది. 2011 కంటే ముందు కూడా 2003 వరల్డ్‌కప్‌ సమయంలో అప్పటి హెడ్‌ కోచ్‌ జాన్‌ రైట్‌.. స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌ అయిన సాండీ గోర్డాన్‌ను తీసుకొచ్చాడు.

ఆ తర్వాత కోచ్‌గా వచ్చిన గ్రెగ్‌ చాపెల్‌ కూడా మరో స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌ రూడీ వెబ్‌స్టర్‌ సేవలు వినియోగించుకున్నాడు. 2014 నుంచి రవిశాస్త్రి వచ్చిన తర్వాత మైండ్‌ కోచ్‌లు కనిపించలేదు. తనకు తానే టీమ్‌ను మోటివేట్‌ చేసేవాడు రవిశాస్త్రి. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి టీమ్‌కు ఇలా మెంటల్‌ కండిషనింగ్‌ తప్పనిసరి అయింది. వరల్డ్‌కప్‌లాంటి ఈవెంట్లలో మ్యాచ్‌కు మ్యాచ్‌కు మధ్య ప్లేయర్స్‌ సెలక్షన్‌పై ఎక్కువగా ఆలోచించకుండా, ఏకాగ్రత కోల్పోకుండా వీళ్లు సాయపడతారు.

WhatsApp channel