ODI Cricketer of the Year 2022: వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2022 బాబర్ ఆజం
ODI Cricketer of the Year 2022: వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డును గెలుచుకున్నాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం. ఈ విషయాన్ని గురువారం (జనవరి 26) ఐసీసీ వెల్లడించింది.
ODI Cricketer of the Year 2022: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం వరుసగా రెండో ఏడాది కూడా ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. గతేడాది అతడు తన టీమ్ తరఫున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 9 మ్యాచ్ లలో ఏకంగా 84.87 సగటుతో 679 రన్స్ చేశాడు. అందులో మూడు సెంచరీలు ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
వన్డే ర్యాంకింగ్స్ లో ఏడాది మొత్తం బాబర్ టాప్ లో ఉన్నాడు. జులై, 2021 నుంచి బాబర్ వన్డేల్లో అగ్రస్థానంలో కొనసాగుతుండటం గమనార్హం. అయితే 2022లో అతనికి ఎక్కువగా వన్డేలు ఆడే అవకాశం రాలేదు. ఏడాది మొత్తం కేవలం 9 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అయితే అందులోనూ మూడు సెంచరీలు బాదడం విశేషం. అంటే ప్రతి మూడు మ్యాచ్ లకు ఓ సెంచరీ చేశాడు.
బ్యాటర్ గానే కాదు.. కెప్టెన్ గానూ పాక్ టీమ్ కు మంచి విజయాలు సాధించి పెట్టాడు. 2022లో 9 వన్డేల్లో పాకిస్థాన్ కేవలం ఒక మ్యాచ్ లో మాత్రమే ఓడిపోయింది. దీంతో గతేడాది వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎంపిక ఐసీసీకి చాలా సులువుగా మారిపోయింది. ఇక ఐసీసీ ఇప్పటికే అనౌన్స్ చేసిన వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ కు కూడా బాబర్ కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే.
ఈ టీమ్ లో ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ కు చోటు దక్కింది. శ్రేయస్ అయ్యర్ తో పాటు సిరాజ్ కూడా వన్డే టీమ్ ఆఫ్ 2022లో చోటు దక్కించుకున్నారు. గతేడాది వన్డేల్లో పాకిస్థాన్ తన అత్యధిక స్కోరు చేజింగ్ లోనూ బాబర్ కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ ఏకంగా 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. ఈ మ్యాచ్ లో బాబర్ కేవలం 73 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వన్డేల్లో అతనికిదే అత్యంత వేగవంతమైన సెంచరీ.
ఇక బుధవారం (జనవరి 25) ప్రకటించిన ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సూర్యకుమార్ యాదవ్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా అతడు నిలిచాడు.