Kieron Pollard 600 T20s: పొలార్డ్ అరుదైన ఘనత.. 600వ టీ20 ఆడిన క్రికెటర్-kieron pollard is the first cricketer to play 600 t20s ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kieron Pollard 600 T20s: పొలార్డ్ అరుదైన ఘనత.. 600వ టీ20 ఆడిన క్రికెటర్

Kieron Pollard 600 T20s: పొలార్డ్ అరుదైన ఘనత.. 600వ టీ20 ఆడిన క్రికెటర్

Hari Prasad S HT Telugu
Aug 09, 2022 03:45 PM IST

Kieron Pollard 600 T20s: ఒకటీరెండూ కాదు.. వంద రెండొందలూ కాదు.. ఏకంగా 600. వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ కీరన్‌ పొలార్డ్‌ క్రికెట్‌లో మరెవరికీ సాధ్యం కాని రీతిలో 600 టీ20లు ఆడటం విశేషం.

కీరన్ పొలార్డ్
కీరన్ పొలార్డ్ (IPL )

న్యూఢిల్లీ: కీరన్‌ పొలార్డ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఈ విండీస్‌ ప్లేయర్‌ మరీ భారీ రికార్డులు ఏమీ క్రియేట్‌ చేయకపోయినా.. ఇప్పుడతని పేరు మాత్రం క్రికెట్‌ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ జెంటిల్మన్‌ గేమ్‌లో షార్టెస్ట్‌ ఫార్మాట్‌ అయిన టీ20ల్లో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డును పొలార్డ్‌ అందుకున్నాడు. తన కెరీర్‌లో అతడు 600వ టీ20 మ్యాచ్‌ ఆడటం విశేషం.

ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్‌ టోర్నీలో భాగంగా లండన్‌ స్పిరిట్‌ టీమ్‌కు ఆడుతున్న పొలార్డ్‌ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్స్‌లో అతడు ఆడుతున్నాడు. అందులో భాగంగానే ఈ హండ్రెడ్‌ టోర్నీలో లండన్‌ స్పిరిట్‌ టీమ్‌ తరఫున కాంట్రాక్ట్‌ సైన్‌ చేశాడు.

సోమవారం మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు 11 బాల్స్‌లోనే 34 రన్స్‌ కూడా చేశాడు. అతని మెరుపు ఇన్నింగ్స్‌తో ఈ మ్యాచ్‌లో లండన్‌ టీమ్ 52 రన్స్‌తో గెలిచింది. ఇటు ఐపీఎల్లోనూ పొలార్డ్‌.. ముంబై ఇండియన్స్‌ టీమ్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో బార్బడోస్‌ రాయల్స్‌ టీమ్‌కు, బిగ్‌ బాస్‌ లీగ్‌లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ టీమ్స్‌కు ఆడాడు. అటు పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఇంటర్నేషనల్‌ లెవల్లో 101 టీ20లు ఆడిన పొలార్డ్‌ 1569 రన్స్‌ చేశాడు. 42 వికెట్లు తీసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఇండియాతోనే తన చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడిన పొలార్డ్‌.. ఓవరాల్‌గా తన కెరీర్‌లో ఇప్పటి వరకూ 600 టీ20ల్లో 11723 రన్స్‌ చేయడం విశేషం. అందులో ఒక సెంచరీ, 56 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు బౌలింగ్‌లో 309 వికెట్లు కూడా తీశాడు.

పొలార్డ్‌ టీ20 మ్యాచ్‌ల రికార్డు బ్రేక్‌ చేయడం అంత సులువు కాదు. ఎందుకంటే అతని తర్వాత డ్వేన్‌ బ్రేవో 543 మ్యాచ్‌లతో రెండోస్థానంలో ఉండగా.. షోయబ్‌ మాలిక్‌ 472, క్రిస్‌ గేల్‌ 463, రవి బొపారా 426 మ్యాచ్‌లతో ఉన్నారు. ప్రస్తుతం క్రికెట్‌ ఆడుతున్న వాళ్లలో పొలార్డ్‌ దరిదాపులకు కూడా ఎవరూ వెళ్లే అవకాశం లేదు.

WhatsApp channel