Jadeja on Comeback: రోజూ 10 నుంచి 12 గంటలు బౌలింగ్ చేసేవాడిని: జడేజా-jadeja on comeback says he bowled 10 to 12 hours a day at nca ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Jadeja On Comeback Says He Bowled 10 To 12 Hours A Day At Nca

Jadeja on Comeback: రోజూ 10 నుంచి 12 గంటలు బౌలింగ్ చేసేవాడిని: జడేజా

Hari Prasad S HT Telugu
Feb 09, 2023 05:50 PM IST

Jadeja on Comeback: రోజూ 10 నుంచి 12 గంటలు బౌలింగ్ చేసేవాడిని అంటూ గాయం నుంచి కోలుకున్న తర్వాత తాను పడిన కష్టాన్ని వివరించాడు రవీంద్ర జడేజా. తన కమ్‌బ్యాక్ మ్యాచ్ లోనే అతడు ఐదు వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే.

రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా (PTI)

Jadeja on Comeback: ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను టీమిండియా ఇన్నాళ్లూ ఎంతగా మిస్ అయిందో గురువారం (ఫిబ్రవరి 9) తెలిసొచ్చింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ లోనే జడ్డూ ఐదు వికెట్లతో చెలరేగాడు. గత ఆగస్ట్ లో మోకాలి గాయం కారణంగా ఇండియన్ టీమ్ కు దూరమైన జడేజా.. సుమారు ఐదు నెలల తర్వాత మళ్లీ వచ్చాడు.

అయితే ఈ ఐదు నెలల కాలంలో తాను ఎంతగా చెమటోడ్చిందీ అతడు వివరించాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ తొలి రోజు 22 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్న తర్వాత జడేజా మాట్లాడాడు. తన కెరీర్ లో ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయడం ఇది 11వసారి కావడం విశేషం.

"ఐదు నెలల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాను. ఇది చాలా కష్టం. దాని కోసం నేను సిద్ధమయ్యాను. చాలా కఠినంగా శ్రమించాను. ఎన్సీఏలో నా ‌ఫిట్‌నెస్ తో పాటు నా నైపుణ్యాలనూ మెరుగుపరచుకున్నాను. చాలా రోజుల తర్వాత ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాను. అక్కడ 42 ఓవర్లు వేశాను. ఈ టెస్ట మ్యాచ్ కు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగడానికి ఇది ఎంతగానో సాయపడింది" అని జడేజా వెల్లడించాడు.

ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ కు ముందు జడేజా రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున ఒక మ్యాచ్ ఆడాడు. అందులో ఒక ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసుకోవడం విశేషం. ఇక ఎన్సీఏలో ఉన్నప్పుడు రోజూ 10 నుంచి 12 గంటలు బౌలింగ్ చేసేవాడినని కూడా చెప్పాడు.

"బెంగళూరులోని ఎన్సీఏలో ఉన్నప్పుడు నా బౌలింగ్ పై చాలా కఠినంగా శ్రమించాను. ప్రతి రోజూ 10 నుంచి 12 గంటలు బౌలింగ్ చేసేవాడిని. అది నాకెంతో సాయపడింది. నా రిథమ్ పైనే పని చేశాను. ఎందుకంటే నేను టెస్ట్ మ్యాచ్ ఆడాలి.. సుదీర్ఘ స్పెల్స్ వేయాలి అన్నది తెలుసు" అని జడేజా చెప్పాడు.

ఇక నాగ్‌పూర్ పిచ్ గురించి కూడా జడేజా మాట్లాడాడు. "వికెట్ పై అసలు బౌన్సే లేదు. స్టంప్ టు స్టంప్ లైన్ వేశాను. ఓ బాల్ స్పిన్ అవుతోంది.. ఓ బాల్ నేరుగా వెళ్తోంది. లెఫ్టామ్ స్పిన్నర్ గా ఓ బ్యాటర్ వికెట్ల వెనుక క్యాచ్ ఇచ్చినా, స్టంపౌట్ అయినా ఆ క్రెడిట్ బాల్ కే దక్కుతుంది. టెస్ట్ క్రికెట్ లో ఏ వికెట్ దక్కినా అది సంతోషమే" అని జడేజా అన్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం