INDW vs ENGW 2nd T20I: ఇంగ్లాండ్‌‌పై భారత్ ఘన విజయం.. అర్ధశతకంతో చెలరేగిన స్మృతి -india women won by 8 wickets against england women in 2nd t20i ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  India Women Won By 8 Wickets Against England Women In 2nd T20i

INDW vs ENGW 2nd T20I: ఇంగ్లాండ్‌‌పై భారత్ ఘన విజయం.. అర్ధశతకంతో చెలరేగిన స్మృతి

Maragani Govardhan HT Telugu
Sep 14, 2022 09:00 AM IST

IndiaW vs EnglandW: డెర్బీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత అమ్మాయిలు ఘనవిజయం సాధించారు. 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్నారు. స్మృతి మంథానా అర్ధశతకంతో ఆకట్టుకుంది.

స్మృతి-హర్మన్ ప్రీత్ కౌర్
స్మృతి-హర్మన్ ప్రీత్ కౌర్ (Twitter)

India women won against England Women: భారత మహిళల జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ డెర్బీ కౌంటీ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ అమ్మాయిలపై భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇంగ్లీష్ జట్టు నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు ఓవర్లు మిగిలుండగానే.. కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఓపెనర్ స్మృతి మంథానా(79*) అర్ధశతకంతో చెలరేగగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(29*) రాణించింది. ఫలితంగా మూడు టీ20 సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో టీ20 గురువారం నాడు జరగనుంది.

143 పరుగుల లక్ష్య ఛేదనలో భారత మహిళల జట్టుకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంథానా తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించారు. స్మృతి ధాటిగా ఆడగా.. షెఫాలీ నిలకడగా ఆడుతూ రాణించింది. అయితే ఎకోల్‌స్టోన్ బౌలింగ్‌లో ఆమెకే క్యాచ్ ఇచ్చి షెఫాలీ వెనుదిరగడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హేమలత కూడా ఎక్కవ సేపు క్రీజులో నిలువలేకపోయింది. డేవీస్ బౌలింగ్‌లో బౌల్డయింది. ఫలితంగా 77కు 2 వికెట్లు కోల్పోయింది భారత్.

అనంతరం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌తో కలిసి స్మృతి మంథానా భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. వరుస పెట్టి బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచింది. ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ అదరగొట్టింది. ఈ క్రమంలోనే అర్ధ శతకం పూర్తి చేసింది. మరోపక్క కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా 29 పరుగులతో స్మృతికి మద్దతుగా నిలిచింది. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. చివరకు 16.4 ఓవర్లలో 146 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లీష్ బౌలర్లలో ఎకోల్‌స్టోన్, డేవిస్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ అమ్మాయిల బ్యాటింగ్ ఆద్యంతం పేలవంగా సాగింది. 54 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. భారత బౌలర్లు టాపార్డర్‌ను అత్యంత వేగంగా పెవిలియన్ చేర్చి ఇంగ్లాండ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టారు. అయితే చివర్లో ఫ్రెయా కెంప్(51) అర్ధశతకంతో చెలరేగింది. ఈమెరకు బౌచర్(34) చక్కటి సహకారం తోడవడంతో ఇంగ్లాండ్ మెరుగైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3 వికెట్లతో ఆకట్టుకోగా.. రేణుకా సింగ్, దీప్తి శర్మ చెరో వికెట్‌తో రాణించారు. అర్ధశతకంతో రాణించిన స్మృతి మంథానాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గౌరవం దక్కింది.

WhatsApp channel