Clark on Australia: ఎన్నయినా చెప్పండి.. ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది.. ప్రాక్టీస్ లేకపోతే ఇంతే మరి: క్లార్క్-clark on australia says they got smoked in the first test ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Clark On Australia: ఎన్నయినా చెప్పండి.. ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది.. ప్రాక్టీస్ లేకపోతే ఇంతే మరి: క్లార్క్

Clark on Australia: ఎన్నయినా చెప్పండి.. ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది.. ప్రాక్టీస్ లేకపోతే ఇంతే మరి: క్లార్క్

Hari Prasad S HT Telugu
Feb 14, 2023 02:35 PM IST

Clark on Australia: ఎన్నయినా చెప్పండి.. ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది.. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా ఆడితే ఇలాగే ఉంటుంది అని అన్నాడు ఆ టీమ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ క్లార్క్. తమ టీమ్ ఈ సిరీస్ కోసం సరిగా సిద్ధం కాలేదని చెప్పాడు.

తొలి టెస్టులో మూడు రోజుల్లోనే చాప చుట్టేసిన కంగారూలు
తొలి టెస్టులో మూడు రోజుల్లోనే చాప చుట్టేసిన కంగారూలు (ANI )

Clark on Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు కొందరు ఆస్ట్రేలియా మాజీలు ఆ టీమ్ తీసుకున్న నిర్ణయంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇండియా టూర్ లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా నేరుగా సిరీస్ బరిలోకి దిగితే కష్టమే అని అన్నారు. వాళ్లు చెప్పినట్లే జరిగింది. తొలి టెస్టులో కంగారూలు మూడు రోజుల్లోనే తోక ముడిచారు. కావాలనే ఇండియాలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదన్న ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ కు కూడా ఇప్పుడు షాక్ తగిలింది.

ఈ ఓటమిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ క్లార్క్ తీవ్రంగా మండిపడ్డాడు. అసలు ఈ సిరీస్ కు ఆస్ట్రేలియా సరిగా సిద్ధం కాలేదని అతడు అభిప్రాయపడ్డాడు. "సిరీస్ కు ముందు కూడా మనం దీనిపై మాట్లాడుకున్నాం. అసలు వాళ్లు సరిగా సిద్ధమయ్యారా అని. దీనికి సమాధానం కచ్చితంగా లేదు. ప్రాక్టీస్ మ్యాచ్, టూర్ మ్యాచ్ ఆడకుండా నేరుగా బరిలోకి దిగడంతో చాలా దారుణంగా ఓడిపోయారు.

ఎన్నయినా చెప్పండి. వాళ్లు చెత్తగా ఓడిపోయారు. ఇండియా స్వదేశంలో మంచి టీమ్. కానీ ఆస్ట్రేలియా మాత్రం ఈ సిరీస్ కు సరిగా సిద్ధం కాలేదని మాత్రం చెప్పగలను" అని స్కై స్పోర్ట్స్ తో మాట్లాడుతూ క్లార్క్ స్పష్టం చేశాడు. ఇక తొలి టెస్టుకు ఆస్ట్రేలియా ఎంపిక చేసిన తుది జట్టుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టాప్ ఫామ్ లో ఉన్న ట్రెవిస్ హెడ్ ను తొలగించడం ఎవరికీ అంతుబట్టలేదు. అంతేకాదు లెఫ్టామ్ స్పిన్నర్ ఆష్టన్ అగార్, లెగ్ స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్ ఉన్నా కూడా లయన్, మర్ఫీ రూపంలో ఇద్దరూ ఆఫ్ స్పిన్నర్లనే తీసుకున్నారు. అయితే మర్ఫీ తొలి టెస్టులోనే 7 వికెట్లతో రాణించినా.. ఈ ఇద్దరి బౌలింగ్ లో పెద్దగా తేడా లేకపోవడం ఇండియన్ బ్యాటర్లకు కలిసొచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడు తుది జట్టులో మార్పులు చేసే పరిస్థితి కూడా ఆస్ట్రేలియాకు కనిపించడం లేదని క్లార్క్ అన్నాడు. ఇప్పుడు కొత్తగా లెఫ్టామ్ స్పిన్నర్ కునెమన్ ను హడావిడిగా పిలిపించినా అతన్ని తుది జట్టులో తీసుకునేది అనుమానమే అని కూడా క్లార్క్ చెప్పాడు.

"డొమెస్టిక్ క్రికెట్ లో కునెమన్ బౌలింగ్ నేను చూశాను. అతడు మంచి బౌలర్. కానీ అతన్ని ఆడించాలంటే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలి లేదంటే నేథన్ లయన్ ను పక్కన పెట్టాలి. కానీ అవి రెండూ జరుగుతాయని అనుకోవడం లేదు. మర్ఫీ బాగా బౌలింగ్ చేశాడు కాబట్టి.. అతన్ని పక్కన పెట్టలేరు. తుది జట్టులో మార్పులు చేయలేని స్థితిలోకి వాళ్లు వెళ్లారు. గాయాలైతే తప్ప మార్పులు చేయడం కష్టం. స్టార్క్, గ్రీన్ కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది" అని క్లార్క్ అన్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం