Steve Smith on India Tour: ఇండియాలో సిరీస్ విజయం యాషెస్ గెలుపు కంటే గొప్పది: స్టీవ్ స్మిత్
Steve Smith on India Tour: ఇండియాలో సిరీస్ విజయం యాషెస్ గెలుపు కంటే గొప్పదంటూ ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గురువారం (ఫిబ్రవరి 9) నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపత్యంలో స్మిత్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Steve Smith on India Tour: ఆస్ట్రేలియా కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ ను ఏలింది. కానీ ఇండియాలో మాత్రం ఆ టీమ్ పప్పులుడకలేదు. ఇక్కడ సిరీస్ గెలవాలనే చాలాసార్లే వచ్చింది. కానీ 2004లో మాత్రం తన కలను సాకారం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకూ ఒక్కసారి సిరీస్ గెలవలేకపోయింది. నిజానికి ఆస్ట్రేలియాకు కాదు ఇండియాలో సిరీస్ విజయం ప్రపంచంలోని ఏ టీమ్ కైనా పెద్ద సవాలే.
ట్రెండింగ్ వార్తలు
ఇప్పుడు మరోసారి నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడటానికి ఇండియాకు వచ్చింది ఆస్ట్రేలియా టీమ్. 18 ఏళ్ల నిరీక్షణ తెరదించుతూ ఈసారి సిరీస్ గెలవాలన్న పట్టుదలతో ఆస్ట్రేలియా ఉంది. అయితే అది అంత సులువు కాదని వాళ్లకూ తెలుసు. అందుకే క్రికెట్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ విజయంతో దీనిని పోలుస్తున్నారు ఆస్ట్రేలియా క్రికెటర్లు.
ఆ టీమ్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అయితే ఇండియాలో సిరీస్ విజయం యాషెస్ సిరీస్ గెలుపు కంటే కూడా గొప్పదని అనడం విశేషం. ఇప్పుడు కూడా ఇండియాలో సిరీస్ గెలవాలంటే ఆస్ట్రేలియాకు స్మిత్ చాలా కీలకం కానున్నాడు. బ్యాటింగ్ పై ఆ టీమ్ అతనిపైనే ఎక్కువగా ఆధారపడింది. క్రికెట్ ఆస్ట్రేలియా పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఆ టీమ్ క్రికెటర్లు ఇండియా టూర్ పై స్పందించారు.
అందులో స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. ఇండియాలో ఒక్క టెస్ట్ గెలవడం కూడా చాలా కష్టమైన పని అని అన్నాడు. "అక్కడ గెలవడం చాలా కష్టం. సిరీస్ కాదు కదా ఒక్క మ్యాచ్ కూడా కష్టమే. అందువల్ల ఆ కొండను మేము ఎక్కగలిగితే అది చాలా పెద్ద విజయం అవుతుంది. ఇండియాలో మేము సిరీస్ గెలవగలిగితే మాత్రం అది యాషెస్ కన్నా గొప్పదవుతుంది" అని స్టీవ్ స్మిత్ అన్నాడు.
అటు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇండియాలో సిరీస్ విజయం ఇంగ్లండ్ గడ్డపై యాషెస్ విజయాల కంటే చాలా అరుదు అని అన్నాడు. అటు పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ స్పందిస్తూ ఇండియాలో సిరీస్ విజయం ఆస్ట్రేలియా టీమ్ కిరీటంలో ఓ కలికితురాయి అని అనడం విశేషం.
"ఇండియాలో సిరీస్ ఆడటం మా గ్రూప్ కు చాలా స్పెషల్. ఇక్కడికి వచ్చే ఆస్ట్రేలియన్ టీమ్స్ కు ఇది కిరీటంలో కలికితురాయి లాంటిది. అత్యంత కఠినమై విదేశీ పర్యటనల్లో ఒకటి. ఇండియన్ టీమ్ కూడా చాలా స్ట్రాంగా ఉంది" అని స్టార్క్ అన్నాడు.
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్ లో వచ్చే గురువారం (ఫిబ్రవరి 9) తొలి టెస్ట్ జరగనుంది. ఆ తర్వాత ఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్ లలో మరో మూడు టెస్టులు జరుగుతాయి. అయితే తొలి టెస్టుకు ఆస్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ దూరమయ్యారు. ఇది ఆ టీమ్ కు పెద్ద మైనసే అని చెప్పాలి.