RR vs DC IPL 2023: అర్ధశతకాలతో విజృంభించిన బట్లర్, యశస్వి.. దిల్లీపై రాజస్థాన్ భారీ స్కోరు-buttler and yashasvi hits to help rajasthan get huge score against delhi ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rr Vs Dc Ipl 2023: అర్ధశతకాలతో విజృంభించిన బట్లర్, యశస్వి.. దిల్లీపై రాజస్థాన్ భారీ స్కోరు

RR vs DC IPL 2023: అర్ధశతకాలతో విజృంభించిన బట్లర్, యశస్వి.. దిల్లీపై రాజస్థాన్ భారీ స్కోరు

Maragani Govardhan HT Telugu
Apr 08, 2023 05:38 PM IST

RR vs DC IPL 2023: గువహటి వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 199 పరుగుల భారీ స్కోరు చేసింది. రాజస్థాన్ ఓపెనర్లు బట్లర్, యశస్వి జైస్వాల్ అర్ధ శతకాలతో అదరగొట్టారు. ఫలితంగా దిల్లీ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగారు.

రాజస్థాన్-దిల్లీ
రాజస్థాన్-దిల్లీ (PTI)

RR vs DC IPL 2023: దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ 14వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. గువహటీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్లు జాస్ బట్లర్(79), యశస్వి జైస్వాల్(60) అర్ధశతకాలతో విజృభించగా.. చివర్లో షిమ్రన్ హిట్మైర్(39) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా దిల్లీ ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. దిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, రోవ్‌మన్ పోవెల్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్ దూకుడుగా ఆడటం ప్రారంభించారు. ముఖ్యంగా యశస్వి ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఐదు ఫోర్లు కొట్టి 20 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత బట్లర్ తన బాదుడును మొదలుపెట్టాడు. వరుస పెట్టి బౌండరీలతో బౌలర్లకు చుక్కలు చూపించారు. బౌలర్‌తో సంబంధం లేకుండా ధాటిగా ఆడి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఈ క్రమంలోనే యశస్వి అర్ధశతకం పూర్తి చేశాడు. మొత్తంగా 31 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు. ఓ సిక్సర్ ఉంది. బట్లర్‌తో కలిసి తొలి వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దూకుడుగా ఆడుతున్న అతడిని ముఖేష్ కుమార్ ఔట్ చేశాడు.

యశస్వి ఔటైనప్పటికీ బట్లర్ మాత్రం తగ్గలేదు. దూకుడుగా ఆడి స్కోరు వేగాన్ని పెంచాడు. అయితే ఇదే సమయంలో సంజూ శాంసన్(0), రియాన్ పరాగ్(7) తక్కువే స్కోర్లుకే పెవిలియన్ చేరినప్పటికీ బట్లర్ వేగాన్ని మాత్రం తగ్గించలేదు. హిట్మైర్‌తో ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. నిలకడగా అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. మొత్తంగా 51 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు ఓ సిక్సర్ ఉంది. వేగంగా ఆడే ప్రయత్నంలో 19వ ఓవర్లో ముఖేష్ కుమార్‌కు ఔటయ్యాడు.

ఆఖర్లో హిట్మైర్ సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. 21 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇందులో 4 సిక్సర్లు ఓ ఫోర్ ఉంది. చివరి ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన హిట్మైర్ ఆ ఓవర్లో 16 పరుగులు రాబట్టాడు. మొత్తంగా రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.