పూరీ జగన్నాథుడి ఆలయ చరిత్ర, స్థల పురాణం ఇదే-know about puri jagannatha swamy temples and ratha chakras significance of place ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Know About Puri Jagannatha Swamy Temples And Ratha Chakras Significance Of Place

పూరీ జగన్నాథుడి ఆలయ చరిత్ర, స్థల పురాణం ఇదే

HT Telugu Desk HT Telugu
Jun 20, 2023 09:09 AM IST

పూరీ జగన్నాథ స్వామి ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా? ఒడిశాలోని పూరీ పట్టణంలో ఉన్న ఈ ఆలయం భారత దేశ ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటి.

రథోత్సవానికి రథాలను సిద్ధం చేస్తున్న దృశ్యం
రథోత్సవానికి రథాలను సిద్ధం చేస్తున్న దృశ్యం (@SJTA_Puri)

పూరీ జగన్నాథ స్వామి పుణ్య క్షేత్రం నీలాద్రి కొండపై ఉంటుంది. దీనికే నీలాచలం, నీలగిరి, నీలాద్రి అని పేరు. బంగాళాఖాతం తీరంలో వెలసిన ఈ పుణ్య క్షేత్రంలో స్వామి వారి విగ్రహం వేప దారుతో ఉన్న శిల్పం. వేప చెట్టు చెక్కతో శ్రీకృష్ణ, బలరాము, సుభద్రల విగ్రహాలు ఉంటాయి. పన్నెండేళ్ల కోసారి కొత్త దారు విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ట చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

జగన్నాథ రథ యాత్ర

చైత్ర, ఫాల్గుణ మాసాల్లో నవకళేబరోత్సవ, రథోత్సవాలు నిర్వహిస్తారు. రథోత్సవంలో మూడు రథాలు ఉంటాాయి. అతి పెద్ద రథం జగన్నాథుడి రథం. ఈ రథం ఎత్తు 45 అడుగులు ఉంటుంది. దీనినే నంది ఘోష అంటారు. దీనిపై గరత్మంతుడి జెండా ఎగురుతుంది. మరొక రథంలో బలభద్రుడు, ఇంకో రథంలో సుభద్ర వేంచేస్తారు. ఏటా రథాలను కొత్తగా నిర్మిస్తారు. ఉత్సవం ముగిసిన వెంటనే వాటిని కాల్చివేస్తారు.

రథోత్సవంలో జగన్నాథుడి రథం ప్రారంభం కావడానికి ముందు స్థానిక ఆచారం ప్రకారం పండాలు(అర్చకులు) అశ్లీల పదాలు పలుకుతారు. ముందుగా బలభద్రుని రథం, తరువాత సుభద్ర రథం, చివరగా జై జగన్నాథ నినాదాల మధ్య జగన్నాథ రథం కదులుతుంది. ఈ మూడు రథాలు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచ ఆలయాన్ని చేరుకుంటాయి. అక్కడ అమ్మవారిని జగన్నాథుని సరసన కొద్దిసేపు వేంచేపు చేసి తిరిగి వెనక్కి తీసుకుని వెళతారు. ఈ రథం గుండిచ చేరుకోవడానికి 12 గంటలు, తిరిగి జగన్నాథ స్వామి ఆలయం చేరుకోవడానికి 12 గంటలు పడుతుంది. మొత్తం 12 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.

పూరీ జగన్నాథ స్వామి ఆలయ చరిత్ర, స్థల పురాణం

శ్రీకృష్ణుడి నిర్యాణం అనంతరం అంత్యక్రియలు జరిగనప్పుడు పార్థివ శరీరంలో నాభిభాగం కాలలేదు. ఆ భాగాన్ని సముద్రలో పారవేశారు. అది కొంతకాలానికి సముద్రంలో నల్లటి విష్ణుమూర్తి శిలగా మారింది. విశ్వసముడనే సవర జాతికి చెందని గిరిజనుడికి ఈ శిల దొరుకుతుంది. ఈ విగ్రహాన్ని నీలమాధవుడి పేరుతో ప్రతిష్టించి విశ్వసముడు పూజలు చేస్తుండేవాడు. అతడు సమర్పించే అన్నం, పండ్లను విష్ణుమూర్తి మానవ రూపంలో వచ్చి తినేవాడు.

ఈ విషయాన్ని నారదుడు మాళవదేవపు రాజు ఇంద్రద్యుమ్నుడికి తెలుస్తుంది. దీంతో రాజు తన మనుషులను పంపి వెతికిస్తాడు. ఇందులో ఓ బ్రాహ్మణుడు రాజుకు నీలమాధవుడి జాడ చెబుతాడు. ఇంద్రద్యుమ్నుడు వెళ్లి చూడగా విగ్రహం అదృశ్యమవుతుంది.

ఓ రాత్రి విష్ణుమూర్తి స్వయంగా ఇంద్రద్యుమ్నుడికి కలలో కనిపిస్తాడు. అశ్వమేథ యాగం చేస్తే తన విగ్రహం చెక్కరూపంలో సముద్రంలో లభిస్తుందని చెబుతాడు. ఇప్పటి గుండిచ ఆలయం వద్దే ఆ రాజు అశ్వమేథ యాగం చేస్తాడు. తరువాత సముద్రంలో ఆ రాజుకు ఒక పెద్ద చెక్క దుంగ కొట్టుకుని వస్తూ కనిపిస్తుంది. శిల్పులను పిలిపించి విష్ణుమూర్తి విగ్రహం చెక్కాలని కోరుతాడు. అయితే ఆ శిల్పులు పని ప్రారంభించగానే పనిముట్లు పనిచేయకుండా పోతాయి.

ఇదే సమయంలో విష్ణుమూర్తి స్వయంగా ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు. ఆ పని తాను పక్క గదిలో 21 రోజుల్లో చేసి పెడతానని, ఎవరూ మధ్యలో వచ్చి తలుపులు తెరవకూడదని చెబుతాడు. కానీ 15 రోజులకే ఆ రాజు కుతూహలంకొద్దీ తలుపు తెరవగా విష్ణుమూర్తి అదృశ్యమవుతాడు. విగ్రహాలు అసంపూర్తిగా ఉంటాయి. నడుము కింది భాగం, కాళ్లు చేతులు లేకుండానే విగ్రహం ఉంటుంది. ఇంద్రద్యుమ్నుడు తాను చేసిన పనికి పశ్చాత్తాపపడతాడు. ఆలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టిస్తాడు.

తరువాత యయాతి కేసరి అనే రాజు దేవాలయాన్ని విస్తరిస్తాడు. రెండు ప్రాకారాలు, రాజగోపురం కట్టిస్తాడు. క్రీస్తుశకం 1140ల కాలంలో చోడ గంగమహాదేవుడు ఎత్తైన గోపురం నిర్మించి దానిపై అష్టధాతువులతో తయారైన చక్రం తయారు చేయిస్తాడు. ఇతడి కుమారుడు అనంగమహారాజు ప్రస్తుత దేవాలయ ప్రాకారంలోని పలు దేవాలయాలను నిర్మించాడు. ఈ ప్రాకారాల్లో అలోక్‌నాథ్, లక్ష్మీనరసింహస్వామి, వరాహ స్వామి మందిరాలు కూడా ఉన్నాయి.

జీవితంలో ఒక్కసారైన పూరీ జగన్నాథుడి రథ చక్రాల చప్పుడు వినాలని పెద్దలు చెబుతారు.

(రెఫరెన్స్: టీటీడీ ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచురణలు)

WhatsApp channel