Eknath Shinde Team in Maharashtra | షిండే టీమ్‌లో మంత్రులు వీరే!-team shinde to get 13 ministers 25 for bjp in maharashtra ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Team Shinde To Get 13 Ministers, 25 For Bjp In Maharashtra

Eknath Shinde Team in Maharashtra | షిండే టీమ్‌లో మంత్రులు వీరే!

HT Telugu Desk HT Telugu
Jul 07, 2022 09:30 PM IST

శివ‌సేన‌లో తిరుగుబాటును విజ‌య‌వంతం చేసి, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్‌నాథ్ షిండే కొత్త మంత్రివ‌ర్గం దిశ‌గా సమాలోచ‌న‌లు చేస్తున్నారు. ప్ర‌భుత్వంలో భాగ‌మైన బీజేపీతో మంత్రివ‌ర్గ కూర్పుపై చ‌ర్చిస్తున్నారు.

సీఎం కార్యాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న ఏక్‌నాథ్ షిండే
సీఎం కార్యాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న ఏక్‌నాథ్ షిండే

శివ‌సేన‌లో తిరుగుబాటు లేవ‌దీసి, విజ‌య‌వంతంగా ఉద్ధ‌వ్ ఠాక్రేను సీఎం ప‌ద‌వి నుంచి దింపి, ముఖ్య‌మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండే.. పాల‌న‌లో తొలి అడుగులు వేస్తున్నారు. మిత్ర‌ప‌క్షం బీజేపీతో క‌లిసి కొత్త మంత్రివ‌ర్గంపై క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Eknath Shinde Team in Maharashtra | బీజేపీకి 25

షిండే మంత్రివ‌ర్గంలో బీజేపీ త‌ర‌ఫున 25 మంది మంత్రులు ఉండ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. సంబంధిత జాబితా ఇప్ప‌టికే బీజేపీ నాయ‌కుడు, ఉప ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ‌ణ‌వీస్ వద్ద ఉంద‌ని బీజేపీ వ‌ర్గాల స‌మాచారం. ఆ జాబితాకు తుది మెరుగులు దిద్దే ప‌నిలో దేవేంద్ర ఫ‌డ‌ణ‌వీస్ ఉన్నార‌ని స‌మాచారం. కాగా, త‌న‌కు మ‌ద్దతు ఇచ్చిన శివ‌సేన తిరుగుబాటు వ‌ర్గం నుంచి క‌నీసం 13 మందిని షిండే త‌న మంత్రివ‌ర్గంలోకి తీసుకోనున్నారు. బీజేపీ, శివ‌సేన‌ల మ‌ధ్య కుదిరిన ఒప్పందం ప్ర‌కారం శివ‌సేన‌(షిండే వ‌ర్గం)లోని ప్ర‌తీ ముగ్గురు ఎమ్మెల్యేల‌కు ఒక మంత్రి ప‌ద‌వి, బీజేపీలోని ప్ర‌తీ న‌లుగురు ఎమ్మెల్యేల‌కు ఒక మంత్రి ప‌ద‌వి ఇవ్వాలి.

Eknath Shinde Team in Maharashtra | ఇండిపెండెంట్లు కూడా..

ఏక్‌నాథ్ షిండే మంత్రివ‌ర్గంలో స్వ‌తంత్ర ఎమ్మెల్యేల‌కు కూడా అవ‌కాశం ద‌క్క‌నుంది. క‌నీసం ఏడుగురు ఇండిపెండెంట్ల‌కు మంత్రులుగా అవ‌కాశం క‌ల్పించాల‌ని షిండే యోచిస్తున్నారు. మొత్తంగా, షిండే మంత్రివ‌ర్గంలో తొలిసారి మంత్రుల‌వుతున్న‌వారి సంఖ్య భారీగానే ఉండ‌బోతోంది. త‌న కోటాలో కూడా రానున్న ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త‌వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని బీజేపీ యోచిస్తోంది.

తిరుగుబాటు సంపూర్ణం

మ‌హారాష్ట్ర రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్పిన శివ‌సేన నేత ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు ప్ర‌స్తుతానికి సంపూర్ణ‌మైంది. శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ ఠాక్రే నేతృత్వంలో, కాంగ్రెస్‌, ఎన్సీపీల మ‌ద్ద‌తుతో ఏర్ప‌డిన మ‌హా వికాస్ అఘాడీ ప్ర‌భుత్వం కూలిపోయి, బీజేపీ మ‌ద్ధ‌తుతో షిండే సీఎం అయ్యారు. అయితే, డెప్యూటీ సీఎం అవుతార‌నుకున్న షిండే సీఎం కావ‌డం, సీఎం అవుతార‌నుకున్న దేవేంద్ర ఫ‌డ‌ణ‌వీస్ ఉప ముఖ్య‌మంత్రి కావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఈ నిర్ణ‌యం వెనుక బీజేపీ వ్యూహం ఏంట‌నే చ‌ర్చ చాలా రోజులు సాగింది.

సుప్రీం తీర్పు కోసం..

అయితే, కొత్త మంత్రివ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం జులై 11 త‌రువాతే ఉండ‌బోతోంది. ఆ రోజు షిండే స‌హా 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల‌పై శివ‌సేన(ఉద్ధ‌వ్ ఠాక్రే వ‌ర్గం) వేసిన అన‌ర్హ‌త పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఆ పిటిష‌న్‌పై తీర్పు కూడా అదే రోజు వెలువ‌డే అవ‌కాశ‌ముంది.

IPL_Entry_Point