Karnataka Dalit woman : దళిత మహిళపై వివక్ష.. నీరు తాగిందని గోమూత్రంతో ట్యాంక్​ 'శుద్ధి'!-tank cleaned with cow urine in karnataka after a dalit woman drinks water ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Tank Cleaned With Cow Urine In Karnataka After A Dalit Woman Drinks Water

Karnataka Dalit woman : దళిత మహిళపై వివక్ష.. నీరు తాగిందని గోమూత్రంతో ట్యాంక్​ 'శుద్ధి'!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 21, 2022 01:21 PM IST

Karnataka Dalit woman incident : తాగునీరు కోసం ఏర్పాటు చేసిన వాటర్​ ట్యాంక్​ నుంచి ఓ దళిత మహిళ నీరు తాగింది. కోపం తెచ్చుకున్న 'పెద్దలు'.. ట్యాంక్​ను కడిగించి.. గోముత్రంతో శుద్ధి చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

దళిత మహిళపై వివక్ష.. నీరు తాగిందని గోమూత్రంతో ట్యాంక్​ 'శుద్ధి'!
దళిత మహిళపై వివక్ష.. నీరు తాగిందని గోమూత్రంతో ట్యాంక్​ 'శుద్ధి'! (HT_PRINT)

Karnataka Dalit woman incident : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్ల గడిచిపోయినా.. బీ ఆర్​ అంబేడ్కర్​ కలలు కన్న 'భారతం' మాత్రం నిజమవ్వడం లేదు. సమాజంలో ఏదో ఒక మూల బడుగు వర్గాలు.. ఏదో ఒక విధంగా వివక్షకు గురవుతూనే ఉన్నారు. కర్ణాటకలో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ దళిత మహిళ.. మంచి నీరు తాగిందన్న కారణంతో కొందరు 'పెద్దలు' .. మొత్తం ట్యాంక్​నే ఖాళీ చేయించేశారు. అనంతరం గోమూత్రంతో 'శుద్ధి' చేశారు!

ఇదీ జరిగింది..

కర్ణాటక చమరాజనగర జిల్లాలోని హెగ్గొటార గ్రామంలో ఈ నెల 18న జరిగింది ఈ ఘటన. ఎస్​సీ వర్గానికి చెందిన ఓ మహిళ.. స్థానికంగా జరిగిన వివాహ వేడుకకు హాజరైంది. అక్కడే.. తాగునీరు కోసం ఏర్పాటు చేసిన ట్యాంక్​లో నీరు తాగింది.

ఆ ప్రాంతంలో అగ్రకులం వారు నివాసముంటారు. ఈ విషయం వారి చెవిన పడింది. దళిత మహిళ తమ వాటర్​ ట్యాంక్​ ట్యాప్​ ఓపెన్​ చేసి నీరు తాగిందని విని.. ఆగ్రహంతో ఊగిపోయారు. చివరికి.. మొత్తం ట్యాంక్​ను క్లీన్​ చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. ట్యాంక్​లోని నీరంతా కింద పోయించేశారు. అనంతరం ట్యాంక్​ను గోమూత్రంతో 'శుద్ధి' చేయించారని తెలుస్తోంది.

Heggotara village water tank : " నీళ్ల ట్యాంక్​ను అయితే కడిగారు. గోమూత్రాన్ని వాడారో లేదో ఇంకా తెలియదు," అని స్థానిక తహసిల్దార్​ ఐఈ బసవరాజ్​.. ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. దళిత మహిళ.. మంచి నీరు తాగిందనడానికి ఆధారాలు లేవని, ఎవరూ కూడా చూడలేదని పేర్కొన్నారు.

మరోవైపు.. ఆ మహిళ ఆచూకీ లభించలేదని బసవరాజ్​ అన్నారు. ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? వంటి వివరాలు తెలియడం లేదని పేర్కొన్నారు. ఆమె ఆచూకీ లభించిన తర్వాత.. మహిళ నుంచి ఫిర్యాదు తీసుకుని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై తహసిల్దార్​.. జిల్లా కలెక్టర్​కు సమగ్ర నివేదికను అందించాల్సి ఉంది.

'అందరు సమానమే..'

Discrimination on Dalit woman : ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అందరూ సమానమే అని చెప్పేందుకు.. స్థానిక అధికారులు చర్యలు చేపట్టారు. వివిధ గ్రామాల నుంచి దళితులు, ఓబీసీ వర్గానికి చెందిన వారిని పిలిపించి.. ట్యాంక్​లో నీళ్లను తాగించారు.

"గ్రామాల్లోని ట్యాంకులపై.. 'ఈ నీటిని ఎవరైనా తాగవచ్చు' అని రాసుంది. ఎవరైనా తాగవచ్చు," అని అధికారులు పిలుపునిచ్చారు.

ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ‘పెద్దల’పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇంకెంతకాలం సమాజం ఇలా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

IPL_Entry_Point