Maha Political Crisis: శివసేనకు షాక్.. బలపరీక్షకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
SC On Maharashtra Floor Test: మహారాష్ట్ర శాసనసభలో బల పరీక్ష నిరూపణపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. దాదాపు 3 గంటల పాటు వాదనలు విన్న కోర్టు … బలపరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
SC On Maharashtra Floor Test: శివసేన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ కొనసాగింది. శివసేన తరపున అభిషేక్ సింఘ్వి, షిండే తరపున ఎంకే కౌల్ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బల పరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టే విధించేందుకు నిరాకరించింది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో గురువారం ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష జరగనుంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
మరోవైపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో దాఖలైన రిట్ పిటిషన్ కేసులో తుది నిర్ణయం స్పీకర్ పరిధిలో ఉందని.. ఈ నేపథ్యంలో తుది ఆదేశాలకు లోబడే రేపటి బలపరీక్ష జరగాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక జైలులో ఉన్న ఎమ్మెల్యేలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ ముఖ్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై కోర్టు విచారించిది. రేపటి బలపరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది.
ఒక రోజు సమయం సరికాదు - శివసేన తరపు న్యాయవాది
బల నిరూపణకు ఒక రోజు మాత్రమే సమయం ఇవ్వడం అన్యాయమని శివసేన లాయర్ సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకిందని, మరికొంతమంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉన్నారని వాదించారు. ఈ పరిస్థితుల్లో బల పరీక్ష ఎలా నిర్వహిస్తారని ప్రస్తావించారు. అనర్హత పిటిషన్ కోర్టు వద్ద పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ‘విశ్వాస పరీక్షకు సంబంధించిన లేఖపై జూన్ 28 అని ఉంది. కానీ ఈరోజు ఉదయం మాకు ఆ లేఖ వచ్చింది. రేపు సభలో విశ్వాస పరీక్ష అని లేఖలో ఉంది. ఒకవైపు ఎన్సీపీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కోవిడ్ పాజిటివ్‌తో ఉన్నారు. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే విదేశాల్లో ఉన్నారు. ఓటేసేందుకు ఎవరు అర్హులనేది తేల్చాల్సి ఉంది. కోర్టు ఈ అంశంపై విచారణను వాయిదా వేసింది. గవర్నర్ ఈ కోర్టు ప్రొసీడింగ్స్‌కు విరుద్ధంగా, అలాగే స్పీకర్ ప్రొసీడింగ్స్‌కు విరుద్ధంగా వెళ్లజాలరు..’ అని నివేదించారు. స్పీకర్‌కు ఉన్న సంకెళ్లు తెంచినా, లేక విశ్వాస పరీక్ష వాయిదా వేసినా న్యాయం జరుగుతుందని సింఘ్వీ తన వాదనలు ముగించారు.
బల పరీక్షను జరపాల్సిందే - షిండే తరపు న్యాయవాది
ఎట్టి పరిస్థితుల్లో బల పరీక్షను ఆపొద్దని ఏక్ నాథ్ షిండే లాయర్ ఎంకే కౌల్ వాదనలు వినిపించారు. గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఉన్నాయని ప్రస్తావించారు. మెజార్జీ ఎమ్మెల్యేలు షిండే వైపే ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మహారాష్ట్రలో సీఎం ఉద్దవ్ ఠాక్రే విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. నబం రెబియా కేసులో తీర్పును ప్రస్తావిస్తూ నీరజ్ కిషన్ కౌల్ తన వాదనలు ప్రారంభించారు. సభాపతి తొలగింపుపై నిర్ణయం పూర్తయ్యేవరకు అనర్హత ప్రొసీడింగ్స్‌లో నిర్ణయం తీసుకోజాలరని ఈ కేసులో తీర్పును ఉటంకించారు. ముందుగా స్పీకర్ తన పదవిలో ఉండేందుకు అర్హుడా లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని నివేదించారు. ముఖ్యమంత్రి విశ్వాస పరీక్షకు సిద్ధంగా లేరంటేనే ఆయన మెజారిటీ కోల్పోయారని ప్రాథమికంగా అవగతమవుతోందని కౌల్ నివేదించారు. విశ్వాస పరీక్ష ఎదుర్కోవడమంటే రాజకీయ జవాబుదారీతనం కలిగి ఉండడమని, రాజకీయ నైతికత కలిగి ఉండడమని కౌల్ నివేదించారు. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ కౌల్ ను ప్రశ్నిస్తూ అసమ్మతి గ్రూపులో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. 55 మందిలో 39 మంది ఎమ్మెల్యేలు అసమ్మతి వర్గంలో ఉన్నారని కౌల్ నివేదించారు. అందుకే విశ్వాస పరీక్షకు ముఖ్యమంత్రి సిద్ధంగా లేరని చెప్పారు.తాము (ఎమ్మెల్యేలు) శివ సేనను వీడడం లేదని, తామే శివసేన అని అసమ్మతి వర్గం ఎమ్మెల్యేల తరపు న్యాయవాది కౌల్ నివేదించారు. కేవలం 14 మంది మాత్రమే తమను విభేదిస్తున్నారని విన్నవించారు.
మొత్తంగా 3 గంటలకు పైగా వాదనలు ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం…. బలపరీక్షకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
సంబంధిత కథనం