Eknath Shinde : ఉద్ధవ్​ ప్రభుత్వంలో ‘మహా’ కుదుపు.. మంత్రి మాయం!-sena minister eknath shinde out of touch uddhav thackeray calls urgent meeting ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sena Minister Eknath Shinde Out Of Touch, Uddhav Thackeray Calls Urgent Meeting

Eknath Shinde : ఉద్ధవ్​ ప్రభుత్వంలో ‘మహా’ కుదుపు.. మంత్రి మాయం!

Sharath Chitturi HT Telugu
Jun 21, 2022 10:19 AM IST

Eknath Shinde : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రేకు మరో తలనొప్పి! శివసేన కీలక నేత, రాష్ట్ర మంత్రి ఏక్​నాథ్​ షిండే మాయమైపోయారు! ఆయనతో పాటు 11-12మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఉద్దవ్​ ఠాక్రేకు ‘మహా’ కుదుపు.. మంత్రి మాయం!
ఉద్దవ్​ ఠాక్రేకు ‘మహా’ కుదుపు.. మంత్రి మాయం! (ANI)

Eknath Shinde : మహారాష్ట్రలోని మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వంలో 'మహా' కుదుపు! శివసేన సీనియర్​ నేత, రాష్ట్ర మంత్రి ఏక్​నాథ్​ షిండే అనూహ్యంగా అదృశ్యమయ్యారు. పార్టీకి చెందిన ఫోన్​ కాల్స్​కు ఆయన స్పందించడం లేదు. కాగా.. ఏక్​నాథ్​ షిండే.. గుజరాత్​లోని సూరత్​లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు 11-12మంది ఎమ్మెల్యేలు సైతం ఉన్నట్టు సమాచారం. మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన కొన్ని గంటల వ్యవధిలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది.

తాజా పరిణామాల మధ్య మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఏక్​నాథ్​ వ్యవహారంపై పార్టీ నేతలు, శాసన సభ్యులతో ఆయన చర్చించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీకి వెళ్లాల్సిన మరో కీలక నేత, శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​.. పర్యటనను రద్దు చేసుకుని ఉద్ధవ్​ను కలిసేందుకు సిద్ధపడ్డారని పేర్కొన్నాయి.

ఏక్​నాథ్​ షిండే.. శివసేనలో ఓ కీలక నేత. ఠాణె ప్రాంతంపై శివసేన పట్టు సాధించిందంటే.. అది షిండే వల్లే! పార్టీ ఎదుగుదలకు ఆయన తీవ్రంగా కృషి చేశారు. కాగా.. గత కొంత కాలంగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. నాయకత్వం తనను పక్కన పెట్టినట్టు ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఈ వ్యవహారంపై మంగళవారం మధ్యాహ్నం ఏక్​నాథ్​ షిండే.. మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

'మహా' కష్టాలు..

2019లో మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. అప్పటివరకు అధికారపక్షంలో ఉన్న బీజేపీకి సొంతంగా మెజారిటీ దక్కలేదు. సీఎం పదవి పంచుకుంటేనే మద్దతిస్తామని శివసేన తేల్చిచెప్పింది. అందుకు బీజేపీ ఒప్పుకోలేదు. కొంత కాలం ప్రతిష్ఠంభన కొనసాగింది.

అనంతరం శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ కూటమిగా మారి మహా వికాస్​ అఘాడీ అనే పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే.. సీఎంగా ప్రమాణం చేశారు.

సీఎం పదవి దక్కినా శివసేనకు కష్టాలు తప్పలేదు. కొందరు తిరుగుబాటు చేసినా.. ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. మూడేళ్ల పాట ఈ భయాల మధ్యే ప్రభుత్వాన్ని నడిపించింది శివసేన. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కమలదళం ప్రయత్నిస్తోందని అనేకమార్లు ఆరోపణలు సైతం చేసింది.

ఇక ఇప్పుడు ఏక్​నాథ్​ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో? అని ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్